వర్షాలు పుష్కలం
*ప్రభుత్వ పంచాంగ శ్రవణం
హైదరాబాద్, ఏప్రిల్ 11: శ్రీ విజయనామ సంవత్సరంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని ప్రముఖ జ్యోతిష్య శాస్తవ్రేత్త, తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య శాఖాధిపతి సివిబి సుబ్రమణ్యం తెలిపారు. రవీంద్రభారతిలో ఉగాది సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సుబ్రమణ్యం విజయనామ సంవత్సరంలో జరగబోయే విషయాలను తెలిపారు. ఆషాడమాసంలో వర్షాలు బాగా కురుస్తాయని, భాద్రపద మాసంలో జలాశయాలు నీటితో నిండుతాయన్నారు. దాంతో పంటలు పుష్కలంగా పండుతాయని, పశుసంపద వృద్ధి చెందుతుందని, పాడి పెరుగుతుందన్నారు. ధరలు మాత్రం బాగా పెరుగుతాయని వెల్లడించారు. ఈ సంవత్సరం గురువు మహారాజు స్థానంలో ఉన్నాడని, అందువల్ల సజ్జనులు, మేధావులకు ప్రాధాన్యత లభిస్తుందని, పరిశోధనల్లో ముందడుగు ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రభువులు సత్కార్యాలు చేస్తారని, పాలకులు న్యాయంగా నీతిగా పరిపాలన సాగిస్తారన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగుతుందని, ఈ కారణంగా పాలకులు మంచి కీర్తిని సంపాదిస్తారని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని సుబ్రమణ్యం వెల్లడించారు. ప్రభుత్వానికి కొన్ని విషమ పరిస్థితులు ఎదురైనప్పటికీ, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారన్నారు. అంతర్జాతీయ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏర్పాటవుతుండటం వల్ల రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుందన్నారు. విద్యారంగంలో పురోభివృద్ది ఉంటుందని, విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయని, సరిహద్దు దేశాలను అదుపులో పెట్టగల శక్తి మన దేశానికి కలుగుతుందన్నారు.
కలహాల్లో పాలకులు
* ఎన్టీఆర్ భవన్‌లో...
హైదరాబాద్, ఏప్రిల్ 11: ఈ సంవత్సరం రాజకీయ సంక్షోభాలు అనివార్యమని టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పంచాంగ పఠనంలో పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలిపారు. గురువారం ఉగాది సందర్భంగా జరిగిన పంచాంగ పఠనంలో గార్గేయ అనేక అంశాలు వివరించారు. జూలై 19 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాజకీయ, వర్ష బీభత్సాలు తప్పవని తెలిపారు. ఆగస్టు 18 నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు, తిరిగి 2014 ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి మార్చి 29 వరకు రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సంవత్సరం రైతులకు అనుకూలంగా ఉంటుందని, పాడిపంటలు బాగా పండుతాయని తెలిపారు. మే 31 నుంచి గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల పాలకులు కలహాలతో ఉంటారని తెలిపారు. 2014 మార్చిలో అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి పారిశ్రామికవేత్తలు, విద్యా రంగం, ఐటి రంగాల్లోని వారు సరికొత్త ఆలోచనలతో ఆశావాదంతో ఉంటారని తెలిపారు. కాగా, వచ్చే ఉగాది చంద్రబాబు పాలనలోనే జరుపుకుంటామని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు జోస్యం చెప్పారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పంచాగ శ్రవణంలో మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తుమ్మల పాల్గొన్నారు.
230 సీట్లు ఖాయం
* వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో...
హైదరాబాద్, ఏప్రిల్ 11: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 230 సీట్లు గెలుచుకుని మహాప్రభంజనం సృష్టించబోతోందని ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్య శాస్తవ్రేత్త మారేపల్లి రామచంద్ర శాస్ర్తీ అన్నారు. గురువారం ఇక్కడ వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో శ్రీవిజయనామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ, నేతలు శోభానాగిరెడ్డి, డిఏ సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రశాస్ర్తీ పంచాంగ శ్రవణం చేశారు. ఆయన మాట్లాడుతూ గందరగోళం తర్వాత స్ధిరత్వం వస్తుందని, జగన్మోహన్ రెడ్డికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయన్నారు. త్వరలోనే బయటకు వస్తారన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎక్కువకాలం నిలబడవన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వైఎస్‌ఆర్ పార్టీ మద్దతు అవసరమవుతుందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షించారు. రాష్ట్రంలో వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ సువర్ణ పాలన వస్తుందన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న నిబద్ధతతో తమ పార్టీ పనిచేస్తుందన్నారు.
సాహస నిర్ణయాలు
*గాంధీభవన్‌లో...
హైదరాబాద్, ఏప్రిల్ 11: కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సత్వరమే సామాన్య ప్రజలకు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో జరిగిన ఉగాది శ్రీ విజయనామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు కె సూర్యనారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడతాయని జోస్యం చెప్పారు. స్ర్తి, పురుషుల మధ్య కలతలు పెరుగుతాయన్నారు. పాలకులు సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. దొంగస్వాములు పుట్టుకొస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య, విద్యారంగాలు వ్యాపారంగా మారాయని, ప్రభుత్వ నియంత్రణ అవసరమన్నారు. మతమార్పిడులు పెరుగుతాయన్నారు. వైట్ కాలర్ నేరాలు పెచ్చుమీరుతాయని, అధికారుల్లో ధిక్కార స్వభావం పెరుగుతుందన్నారు. న్యాయ వ్యవస్ధ జోక్యం పెరుగుతుందన్నారు. రాజకీయాలు, సామాజిక రంగంలో యువకుల పాత్ర అధికమవుతుందన్నారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి అన్నపూర్ణ అనే పేరును నిలబెట్టుకుంటామన్నారు. కొత్త పథకాలతో రాష్ట్రప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. ప్రతి వ్యక్తి పంచాంగాన్ని ప్రతి రోజూ శ్రవణం చేయాలన్నారు. తిథి, వార, నక్షత, యోగ,కర్ణాలను తెలుసుకోవడం వల్ల కాలమహిమను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమమంలో వేద పండితులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసమూర్తి, కె సూర్యనారాయణమూర్తిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.