హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలుగు సినిమా పోకడలు ఇటీవల కాలంలో తెలుగు ప్రజల గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు ఇతర భాషా చిత్రాలను ధీటుగా ఉండలేకపోతున్నాయని ఆమె అన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో గురువారం లలిత కళాతోరణంలో జరిగిన నంది బహుమతుల ప్రదానాన్ని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేయగా, మంత్రి అరుణ అధ్యక్షోపన్యాసం చేశారు. తెలుగు భాషకుగానీ సంస్కృతిగానీ తెలుగు సినిమాల్లో తగిన గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తిస్తుండగా, ఆ గౌరవం సినిమాల్లో దక్కడం లేదని మంత్రి విమర్శించారు. ఇక నుంచి అయినా తెలుగు సినిమాలకు మునుపటి ఖ్యాతి తెచ్చేలా, జాతీయ స్థాయిలో గౌరవం పెరిగేలా సినిమాలు తీయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని ఆమె పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు స్టూడియోలకు స్థలాలు కేటాయించడం, కళాకారులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, సినిమా థియేటర్ల నిర్మాణానికి ప్రోత్సహాకాలు అందించడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి అన్నారు. ఎన్‌టిఆర్ జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని అందుకున్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుని పేరుపై స్థాపించిన అవార్డు తనకు దక్కడం గర్వంగా ఉందనీ, అలాగే తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. దివంగత ఎన్టీఆర్‌తో తనకు ఎంతగానో సన్నిహితం ఉండేదనీ, ఆయన నిర్మించిన చిత్రాలను ఎన్నింటినో తాను రీమేక్ చేశానని అమితాబ్ బచ్చన్ గుర్తు చేశారు. సినిమా కళామాతల్లికి కులం, మతం, ప్రాంతం ఏదీ లేదన్నారు. దేశ సమగ్రతను కపాడేందుకు కూడా సినిమా కళామాతల్లి దోహదపడుతుందని ఆయన కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు గీతారెడ్డి, పితాని సత్యనారాయణ, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్‌నుంచి నంది అవార్డు అందుకుంటున్న మహేష్‌బాబు. చిత్రంలో సిఎం కిరణ్ తదితరులు
* నంది అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి డికె అరుణ హితవు
english title:
dk aruna
Date:
Friday, April 12, 2013