హైదరాబాద్, ఏప్రిల్ 11: రాష్ట్ర పోలీసు శాఖ పారదర్శకత, జవాబుదారీతనానికి ‘డయల్ 100’ నిదర్శనంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. డయల్ 100 సర్వీస్ భవిష్యత్తులో పోలీసు శాఖలో పెద్ద మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల వద్దకు ఇప్పటి వరకు ప్రజలు వెళ్లే వారని, ఇక నుంచి ప్రజల వద్దకే పోలీసులు వెళతారని అన్నారు. జివికె-ఇఎంఆర్‌ఐతో చేసుకున్న ఒప్పందం మేరకు పోలీసు శాఖ డయల్ 100 ప్రాజెక్టును చేపట్టింది. ఈ సర్వీస్‌ను గురువారం మేడ్చల్ సమీపంలోని దేవరయాంజాల్ వద్ద జివికె-ఇఎంఆర్‌ఐ ప్రాంగణంలో సిఎం చేతుల మీదుగా ప్రారంభించారు. 100కి తొలి డయల్ చేసి ఈ సర్వీస్‌ను ప్రారంభించారు. అయితే సిఎం రెండుసార్లు వరుసగా డయల్ చేసినా 100 సర్వీస్‌కు కనెక్ట్ కాలేదు. దీంతో ఆయన ప్రసంగం ప్రారంభించారు. నిజంగా డయల్ 100 అవసరం లేదు కాబట్టి ఇప్పుడు పని చేయలేదని చెప్పి నవ్వులతో సరిపెట్టుకున్నారు. డయల్ 100ను ప్రారంభించగానే సరికాదని ఇది పోలీసు శాఖకు పెద్ద సవాల్‌గా మారుతుందని అన్నారు. ఈ సర్వీస్ ప్రారంభం కాకుండానే రోజుకి 40 వేల కాల్స్ వస్తున్నాయని, ఇక సర్వీస్ అందుబాటులోకి వస్తే మరెన్ని కాల్స్ వస్తాయో ఊహించవచ్చునని అన్నారు. ఏ మారుమూల పల్లె నుంచైనా సరే 100కి డయల్ చేసి ఫిర్యాదు లేదా, అత్యవసర విషయం చెబితే ఆ కాల్ సంబంధిత పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ నమోదు అవుతుంది. వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కాల్ చేసిన వ్యక్తికి తిరిగి ఎంత సేపటిలో ఆ పని పూర్తయ్యిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కాల్ చేసిన సారాంశం మొత్తం రికార్డు అవడమే కాకుండా, పోలీసులు ఇచ్చే జవాబు కూడా రికార్డు అవుతుందని అన్నారు. ఈ విధానంలో కిందిస్థాయి పోలీసు సిబ్బంది సహజంగా స్టేషన్‌కు వచ్చే వారితో మాట్లాడే భాష బాగోదని, ఇక మీదట అది కుదరదని చెప్పారు. ఫోన్ కాల్‌కి స్పందించి ఏం మాట్లాడిందీ రికార్డు అవుతుంది కాబట్టి చాలా పద్దతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ సర్వీస్‌ను తయారు చేసిన జివికె-ఇఎంఆర్‌ఐ యాజమాన్యాన్ని, డిజిపి వి.దినేశ్‌రెడ్డిని సిఎం అభినందించారు. ఈ సర్వీస్ బాగా పని చేసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని, పర్యవేక్షణ ఒక సీనియర్ ఆఫీసర్‌కు అప్పగించాలని అన్నారు. ప్రజలకు పారదర్శకత అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ప్రారంభించిన మీ సేవ సర్వీస్ చాలా బాగా ప్రజలకు ఉపయోగపడిందని, ఇంకా సర్వీస్‌లో కొన్ని మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఏదైనా సర్వీస్ నిర్దిష్ట సమయంలో అందించలేకపోతే సంబంధిత అధికారి తిరిగి దరఖాస్తుదారునికి జరిమానా చెల్లించే విధానం త్వరలో అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన డిజిపి వి.దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 100 డయల్ ఉందని, అది లోకల్‌గా మాత్రమే పని చేస్తోందని అన్నారు. దీనిలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సర్వీస్ అందుబాటులో ఉండే విధంగా డయల్ 100ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సర్వీస్ అందుబాటులోకి రావడం దేశంలోనే ఇది ప్రధమమని అన్నారు. మంత్రులు పితాని, ప్రసాద్‌కుమార్, జివికె అధినేత జివికె రెడ్డి, ఇఎంఆర్‌ఐ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* ‘డయల్ 100’ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి కిరణ్
english title:
dial 100
Date:
Friday, April 12, 2013