న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులకు అద్దం పట్టేలా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు విడుదలయ్యాయి. ఈ ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రగతి గణాంకాలు 0.6 శాతానికి పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 4.3 శాతంగా ఈ గణాంకాలున్నాయి. విద్యుదుత్పత్తి, గనుల అభివృద్ధి, తయారీ రంగాల్లో నమోదైన పేలవ ప్రదర్శన పారిశ్రామిక వృద్ధిరేటును దెబ్బతీశాయి. ఇక 2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-్ఫబ్రవరి మధ్యలో పారిశ్రామిక వృద్ధిరేటు 0.9 శాతం ఉండగా, 2011-12 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 3.5 శాతంగా ఉంది. తయారీ రంగంలో వృద్ధి గత ఫిబ్రవరితో పోల్చితే ఈసారి 4.1 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది. అలాగే విద్యుత్ 8 శాతం నుంచి మైనస్ 3.2 శాతానికి, మైనింగ్ 2.3 శాతం నుంచి మైనస్ 8.1 శాతానికి పడిపోయింది. కాగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం మంచి వృద్ధిరేటును నమోదు చేయగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజా ఐఐపి గణాంకాలు చాలా తక్కువగా నమోదయ్యాయని ఈ సందర్భంగా అహ్లూవాలియా పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో సమసి పోతాయనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు.
వడ్డీరేట్లు తగ్గించాలి
ఫిబ్రవరిలో పారిశ్రామిక రంగ ప్రదర్శన పేలవంగా ఉన్న నేపథ్యంలో ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ఉత్పత్తి పెరగాలంటే వడ్డీరేట్ల తగ్గింపు తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నాయి. పరిశ్రమల విభాగం ఫిక్కి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘్ఫబ్రవరి ఐఐపి గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఉత్పత్తి పెరుగుదలకు, పెట్టుబడుల వెల్లువ కోసం ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.’ అని ఫిక్కి ప్రధాన కార్యదర్శి దిదర్ సింగ్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై క్యాబినెట్ కమిటీ సైతం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.
ఇక ఇదే అభిప్రాయాలను సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యక్తం చేశారు. రెపో రేటు, సిఆర్‌ఆర్‌లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బిఐ తగ్గించాలని మేం కోరుకుంటున్నామన్నారు. క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ డికె జోషి మాట్లాడుతూ పేలవమైన వృద్ధిరేటు దృష్ట్యా వడ్డీరేట్లు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా విడుదలైన చిల్లర ద్య్రవోల్బణం తగ్గిన దృష్ట్యా వడ్డీరేట్లను తగ్గించే విషయంలో రిజర్వ్ బ్యాంకు యోచించాలన్నారు.
ఈ-కాయిన్స్ ట్రేడింగ్‌ను
ఆరంభించిన ఆర్‌ఎస్‌బిఎల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: దేశంలోనే అతి పెద్ద బులియన్ ట్రేడింగ్ కంపెనీ రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌బిఎల్) తొలిసారిగా ఈ-కాయిన్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ కంపెనీ ఎండి ఫృధ్వీరాజ్ కొఠారీ ఈ-కాయిన్స్ ట్రేడింగ్‌ను శుక్రవారం నాడిక్కడ ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రారంభించారు. స్వల్ప విలువ కలిగిన బంగారు నాణేలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ-కాయిన్స్ ట్రేడింగ్ ద్వారా పొందేందుకు దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. ఆధునాతాన ఎలక్ట్రానిక్ విధానం ద్వారా కొనుగోలు లేదా విక్రయం ఏదైనా చేసుకోవచ్చని తెలిపారు. ఏదైనా కడ్డీ, కాయిన్ రూపంలో మాత్రమే ఉంటేనే ట్రేడింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ లావాదేవీ ఒక గ్రాము నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఒకటి ఉందని, దానిని కొనుగోలు దారుడు ఎలాంటి చార్జిలు చెల్లించే అవసరం లేకుండా డౌన్‌లోడ్ చేసుకుని ట్రేడింగ్‌కు యాక్సెస్ కావచ్చని తెలిపారు. స్వచ్చతను బట్టి ధర ఉంటుందని, స్పాట్ డెలివరీ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.
భారత్‌తో ఎఫ్‌టిఎకి
ఐరోపా సమాజం మొగ్గు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్‌తో కుదుర్చుకోవాలనుకుంటున్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)లో డాటాకు సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలను చేర్చాలని తాము కోరడం లేదని ఐరోపా సమాజం (ఇయు) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే రాజకీయ దృఢ సంకల్పం ఇరు పక్షాల్లో కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించింది. కొత్త ఔషధాలకు సంబంధించి భద్రత, సామర్థ్యం రుజువు చేసుకునేందుకు నిర్వహించే అంతర్జాతీయ పరిశోధనల ఖర్చులు, తదతర వివరాలను పొందుపరచాలని ఔషధ రంగంలోని ఆయా సంస్థలకు నిబంధనలు పెట్టడం లేదంది. మార్కెట్‌లో ప్రముఖ సంస్థలు ఈ విషయంలో ఔషధ తయారీపై హక్కులను సాధించుకుంటుండటంతో మిగతా సంస్థలు ఇబ్బందిగా ఉంటుందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే ఇయు పైవిధంగా స్పందించింది. ఇప్పుడు మేము ఇలాంటి డాటా ఉండాల్సిందని ఏమీ అనడం లేదని ఇయు ప్రతినిధుల బృందం అధిపతి తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చిన ఈ బృందం ప్రభుత్వ అధికారులను కలుసుకుని అనంతరం విలేఖరులతో మాట్లాడింది. కాగా, భారత జనరిక్ మందుల పరిశ్రమ 20 బిలియన్ డాలర్ల విలువైనదిగా ఉండగా, మొత్తం ఉత్పత్తిలో 50 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
ఫిబ్రవరి ఐఐపి గణాంకాలు 0.6 శాతంగా నమోదు
english title:
p
Date:
Saturday, April 13, 2013