ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ స్థాయిలో నష్టాలను చవిచూశాయి. గత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికానికిగానూ ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ మదుపర్లను నిరాశపరించింది. ఈ క్రమంలోనే ఆ సంస్థ షేర్ల విలువ 21 శాతానికిపైగా క్షీణించింది. చిల్లర ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ పట్టించుకోని మదుపర్లు అమ్మకాలకు తెగబడ్డారు. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 300 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 65 పాయింట్ల మేర కోల్పోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత ఆ స్థాయిలో మార్కెట్లు నష్టపోవడం ఇదే తొలిసారి. నాడు సెనె్సక్స్ 317 పాయింట్ల వరకు దిగజారింది. ఇతర ఐటి సంస్థలైన టిసిఎస్, విప్రో సంస్థల షేర్లూ పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఆసియాలోని చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు 0.06 శాతం నుంచి 1.31 శాతం పడిపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం నిరాశాజనకంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలావుంటే ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, రిఫైనరీ షేర్లు లాభాలను అందుకున్నాయి. అయినప్పటికీ ఐటి సూచి 11.09 శాతం క్షీణించడం వల్ల నష్టాలు మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 299.64 పాయింట్లు పడిపోయి 18,242.56 వద్ద, నిఫ్టీ 65.45 పాయింట్లు దిగజారి 5,528.55 వద్ద ముగిశాయి.
దశాబ్దకాలం క్రిందకు
ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపర్లను ఆకట్టుకోలేకపోవడంతో భారీగా అమ్మకాలకు గురైన ఆ సంస్థ షేర్ల విలువ దశాబ్దకాలం క్రిందకు దిగజారింది. ఈ ఆర్థిక సంవత్సరం రెవిన్యూ అంచనా తక్కువగా ఉండటంతో నిరాశకు లోనైన మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఇన్ఫోసిస్ షేర్ విలువ 21.33 శాతం పడిపోగా, 35,740 కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయింది.
చిన్న పట్టణాలపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: బీమా రంగం చిన్నచిన్న పట్టణాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సూచించారు. శుక్రవారం ఆయన ఇక్కడ పాన్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ప్రపంచంలో నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో భారత్ 52వ స్థానంలో ఉందన్న ఆయన ఎల్‌పిజి రాయితీని ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఆస్తి పన్ను వసూళ్లలో రాజమండ్రి టాప్
రాజమండ్రి, ఏప్రిల్ 12: ఆస్తి పన్ను వసూళ్లలో పురపాలకశాఖ రాజమండ్రి రీజియన్ రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పాత బకాయిలు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వసూలుకావాల్సిన మొత్తం ఆస్తి పన్ను రూ.180కోట్ల 57లక్షల్లో మార్చి 31నాటికి రూ.171కోట్ల 83లక్షల ఆస్తి పన్ను వసూలయింది. రాజమండ్రి రీజియన్‌లోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుండి ఇంకా వసూలుకావాల్సిన ఆస్తి పన్ను కేవలం రూ.8కోట్ల 74లక్షలు మాత్రమే ఉంది. మూడు జిల్లాల్లోని సుమారు 6లక్షల 39వేల 874 భవనాలు, ఖాళీ స్థలాల నుండి ఈ ఆస్తి పన్ను వసూలయింది.
గతంలో ఆస్తి పన్ను సక్రమంగా వసూలు కాకపోవటంతో పురపాలకసంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవి. ఆస్తి పన్ను వసూలుచేయటానికి పురపాలకసంఘాల అధికారులు నానా తిప్పలుపడాల్సి వచ్చేది. రాను రాను యజమానుల విధానంలో మార్పు రావటంతో పాటు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఆస్తి పన్ను వసూళ్లు గత రెండేళ్లుగా పెరుగుతున్నాయి. అయితే ఆస్తి పన్ను వసూళ్లు కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఇతర ప్రాంతాల్లో కన్నా కాస్తంత ఎక్కువ జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా మార్చి 31నాటికి వసూలయిన ఆస్తి పన్ను వసూళ్లను పరిశీలిస్తే, రాజమండ్రి రీజియన్‌లోనే ఇతర రీజియన్ల కన్నా ఎక్కువ వసూళ్లు కనిపిస్తున్నాయి. బకాయిలతో సహా మార్చి 31నాటికి ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే, ఎలాంటి అదనపు భారం లేకుండా, వడ్డీని మాఫీ చేస్తామని రెండేళ్లుగా రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక రాయితీ కూడా ఆస్తి పన్ను వసూళ్లు పెరగటానికి ఊతమిస్తోంది. ఈ అవకాశాన్ని కూడా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలోని వారే ఎక్కువ వినియోగించుకుంటున్నారు తప్ప, ఇతర రీజియన్లలోని వారు పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించటం లేదు. రీజియన్లవారీ వసూళ్లతో పాటు కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీల వారీ ఆస్తి పన్ను వసూళ్లను చూసినాగానీ గోదావరి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనే ఎక్కువ వసూళ్లు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కార్పొరేషన్లలో రాజమండ్రి కార్పొరేషన్ 99.10శాతం ఆస్తి పన్నును వసూలుచేసి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. గత ఏడాది కూడా రాజమండ్రి కార్పొరేషన్ ఇదే తీరును ప్రదర్శించింది. మున్సిపాలిటీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 99.10శాతం సాధించి మున్సిపాలిటీల్లో అగ్రభాగాన నిలిచింది. 95శాతంపైనే ఆస్తి పన్ను వసూలుచేసిన మున్సిపాలిటీలు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 16 ఉన్నాయి. వీటిలో 98శాతం వసూళ్లు సాధించిన మున్సిపాలిటీలు 13 ఉన్నాయి. ఆస్తి పన్నును ఇంత బాగా వసూలుచేస్తున్నాగానీ, ఖాతాల్లో జమ చేసుకోవటం తప్ప, అభివృద్ధి పనులకు వినియోగించుకోవటానికి మాత్రం మున్సిపాలిటీలకు సవాలక్ష అడ్డంకులు ఉన్నాయి.