విశాఖపట్నం, ఏప్రిల్ 12: పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పైప్‌లైన్ వ్యవస్థ కీలకం కానుందని, ఉపరితల రవాణాతో పోలిస్తే పైప్‌లైన్ ద్వారా రవాణా చేయడం ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు భద్రత పరంగాను సురక్షితమని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ హైటెక్నాలజీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సంస్థలు సంయుక్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్స్‌పై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఇప్పుడు నిత్యావసరాలుగా మారాయని, వీటి రవాణా, పంపిణీ వంటి అంశాల్లో మాత్రం ఒకప్పటి విధానాలే అమలవుతున్నాయన్నారు. ప్రస్తుతం గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి 42 శాతం పైప్‌లైన్ ద్వారానే రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని ఈ సంవత్సరాంతానికి 52 శాతానికి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 2,300 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందని, 2020 నాటికి ఈ వ్యవస్థను మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక కిలోమీటర్ పైప్‌లైన్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సగటున 6కోట్ల రూపాయల వ్యయం అవుతోందన్నారు. చమురు క్షేత్రాల నుంచి రిఫైనరీకి, రిఫైనరీ నుంచి సరఫరా పాయింట్లకు పైప్‌లైన్ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉపరితల రవాణా వ్యవస్థపై ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. అయితే పైప్‌లైన్ రవాణా వ్యవస్థ సురక్షితమైనప్పటికీ వీటి నిర్మాణంలో కొన్ని సాంకేతిక పరమైన అవరోధాలు తప్పట్లేదన్నారు.
రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులపై చర్చిస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అదనపుగ్యాస్ కేటాయింపులపై పనబాక లక్ష్మిని విలేఖరులు ప్రశ్నించగా, ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తమ శాఖతో చర్చిస్తున్నారని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అంశంపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని వివరించారు. పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో తమ మంత్రిత్వశాఖలో దీనిపై చర్చించాల్సి ఉందన్నారు.
భవిష్యత్తులో ఇదే సురక్షిత విధానం, అధిక ఆదాయం: కేంద్ర సహాయ మంత్రి పనబాక
english title:
p
Date:
Saturday, April 13, 2013