న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ ఆర్థిక సంవత్సరం రత్నాలు, నగల ఎగుమతులు 15 శాతం పెరిగే అవకాశాలున్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జిజెఇపిసి) అంచనా వేసింది. బంగారం ధరలు దిగివస్తున్న ప్రస్తుత తరుణంలో శుక్రవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన భారత రత్నాలు, నగల ప్రదర్శనలో కొనుగోళ్లు పెరుగుతాయనే ఆశాభావాన్ని కూడా జిజెఇపిసి వ్యక్తం చేసింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర 29,000 రూపాయల దరిదాపుల్లో కదలాడుతుండగా, గత పదిహేను రోజుల నుంచి పుత్తడి ధరలు 30,000 రూపాయల నుంచి క్రమంగా పడిపోతూ వస్తున్నాయి.
గత ఏడాది నవంబర్ 27న 10 గ్రాముల బంగారం అత్యధికంగా 32,975 రూపాయలు పలికింది. ఈ పరిణామాలపై జిజెఇపిసి వైస్ చైర్మన్ పంకజ్ పరేఖ్ పిటిఐతో మాట్లాడుతూ ‘గత కొద్ది వారాలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి.’ అన్నారు. ఈ పరిస్థితుల్లో తాజా నగల ప్రదర్శన ఢిల్లీ వాసులకు లాభించగలదని అభిప్రాయపడ్డ ఆయన సుమారు 100 రిటైలర్ల నుంచి వివిధ రకాల ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
గీతాంజలి, మలబార్ గోల్డ్‌తోపాటు మరికొన్ని ప్రముఖ సంస్థల ఆభరణాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయన్నారు. కాగా, భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటిపిఒ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రితా మీనన్ మాట్లాడుతూ అన్ని వర్గాల వినియోగదారులకు తగ్గట్లుగా వివిధ ధరల శ్రేణులతో ఎన్నో రకాల ఆభరణాలు ఈ ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. ఇదిలావుంటే అంతకుముందు భారత్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రత్నాలు, నగల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం పెరిగే అవకాశాలున్నాయని రత్నాలు, జిజెఇపిసి చైర్మన్ విపుల్ షా అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి విదేశాలకు 39 బిలియన్ డాలర్ల విలువైన వివిధ రకాల రత్నాలు, నగలు ఎగుమతి అయిన నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆ ఎగుమతులు 15 శాతం పెరిగి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఇక్కడ ప్రారంభమైన 2013 భారత రత్నాలు, నగల ప్రదర్శనకు హాజరైన ఆయన ఎగుమతులపై ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్జాతీయ విపణిలో నెలకొన్న మందగమనం ప్రభావం తగ్గిపోతోందన్న ఆయన ప్రధానంగా అమెరికా మార్కెట్‌లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, డిమాండ్ పెరుగుతోందని, అందుకే ఈసారి భారత్ నుంచి ఎగుమతులు కూడా పెరుగుతాయని అంచనా వేశామన్నారు.
భారత రత్నాలు, నగలకు మేజర్ మార్కెట్లుగా యూరప్, అమెరికా, యుఎఇ, హాంగ్‌కాంగ్ దేశాలున్నాయి. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లపైనా ఎగుమతిదారులు దృష్టి పెడుతున్నారని విపుల్ షా తెలిపారు.
2013-14లో రత్నాలు, నగల ఎగుమతులపై జిజెఇపిసి అంచనా బంగారం ధరల తగ్గుదలతో కొనుగోళ్లు పెరగగలవనే ఆశాభావం
english title:
s
Date:
Saturday, April 13, 2013