నార్సింగి, మొయినాబాద్, ఏప్రిల్ 12: గండిపేట్ చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టిన యువతిని గుర్తించారు. వివరాల్లోకి వెళితే మాసబ్‌ట్యాంక్ హుమాయూన్‌నగర్‌లో జెఎన్ అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తులో అంజుమ్ తస్లీం ఉంటోంది. తస్లింకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రెండునెలల క్రితమే సికింద్రబాద్ నుంచి వీరు హుమాయూన్ నగర్‌కు మారారు. తస్లిం చిన్నకుమార్తె సానియా అలైస్ (18) అస్నా వెడ్డింగ్ ఈవెంట్ ఆర్గనైజర్‌గా చేస్తోంది. అయితే ఈనెల పదవ తేదీన సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఫోన్‌చేసి అర్జంటు పనిఉందని, వెంటనే రమ్మని పిలిచారు. దీంతో సానియా అర్జంట్ పని ఉందని, తన కోసం కింద కారులో ఇద్దరు వెయిట్ చేస్తున్నారని తల్లితో చెప్పి వెళ్లిపోయింది. అయితే రాత్రి వరకు రాలేదు. అంతేకాకుండా మర్నాడు కూడా రాకపోవడంతో తల్లి తస్లిం స్థానిక హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈనెల 11న ఉగాది పండుగ రోజున గండిపేట్ చౌరస్తాలో ఓ గుర్తుతెలియని యువతిని కొందరు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతురాలు సానియా కావచ్చునని అనుమానించిన పోలీసులు ఆమె తల్లిని తీసుకురాగా ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న మృతదేహం సానియాదేనని ఆమె గుర్తించింది. సానియా తండ్రి షకీర్ దుబాయిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమయి ఉంటుందని, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.
యువతి అదృశ్యం
నార్సింగి, ఏప్రిల్ 12: ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఇది. ఎస్‌ఐ రవీందర్ కథనం ప్రకారం విజయనగర్ కాలనీకి చెందిన స్వామి మొయినాబాద్ ప్రాంతంలో ఓ ఫౌమ్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. స్వామి కూతురు లావణ్య (16) శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో పనిచేసేందుకు లావణ్య వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య తల్లిదండ్రులు అన్నిచోట్లా వెతికి ఆమె ఆచూకీ తెలియక హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.