సిబిఐ నివేదికలో సర్కారు జోక్యంపై కథనాలు
ప్రధానిని రక్షించే ప్రయత్నమే: సుష్మ సిబిఐని వాడుకుంటున్నారు: అరుణ్‌జైట్లీ నివేదికలో ప్రభుత్వ జోక్యం లేదు: కాంగ్రెస్ పరిస్థితిపై కాంగ్రెస్ కోర్ గ్రూప్ చర్చ కథనాలన్నీ ఊహాజనితాలు: సిబిఐ డైరెక్టర్
=========
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ‘బొగ్గు’ మళ్లీ రాజుకుంటోంది. గనుల కేటాయింపు కుంభకోణం సరికొత్త మలుపు తిరిగి సంకీర్ణ సర్కారు పీకకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో ఘట్టంలో ‘బొగ్గు’నే ఆయుధంగా చేసుకుని సంకీర్ణ సర్కారుపై దాడికి విపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. మరోపక్క బొగ్గు కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి ప్రభుత్వ జోక్యంపై సుప్రీం కోర్టుకు సిబిఐ అందచేయనున్న నివేదిక అనూహ్య పరిణామాలకు దారి తీయవచ్చునని భావిస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నీతి నిజాయితీలనే వేలెత్తి చూపుతున్న బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతి అవకతవకలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సిబిఐ యథాతథ స్థితిని వివరిస్తూ ఒక నివేదికను తయారు చేసి అందించింది. నివేదికను సీల్డు కవర్‌లో ఉంచాల్సిందిగా ఆదేశిస్తూ, నివేదికలోని అంశాలను అధికారులు, ప్రభుత్వానికి తెలియనివ్వొద్దని జస్టిస్ ఆర్‌ఎం లోథా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్‌తో కూడిన బెంచి సిబిఐని ఆదేశించింది. కుంభకోణంపై నిర్వహించే అన్ని దర్యాప్తు నివేదికలకూ ఇదే సూత్రం వర్తింప చేయాల్సిందిగా బెంచి ఆదేశించింది. అయితే తాము సమర్పించిన నివేదికకు తుదిరూపం ఇచ్చే సమయంలో న్యాయ శాఖ మంత్రి అశ్వనీకుమార్ తమ సంస్థ డైరక్టర్ సహా మరికొంతమంది ఉన్నతాధికార్లతో సమావేశమై నివేదికను సవరించినట్టు సిబిఐ న్యాయ స్థానానికి తెలియచేయాలని నిశ్చయించింది. సిబిఐ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి సంకటంగా మారుతోంది. ఒక జాతీయ పత్రికలో ఈమేరకు వచ్చిన కథనాలపై బిజెపి నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మన్మోహన్‌ను రక్షించేందుకే న్యాయ శాఖామంత్రి అశ్వినీకుమార్ ఈ చర్యకు పాల్పడ్డారని లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. సిబిఐ రూపొందించిన నివేదికను తారుమారు చేసి నీరుగార్చటంకంటే తీవ్రనేరం మరొకటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన సిబిఐని ప్రభుత్వం స్వతంత్రంగా పని చేయనీయటం లేదని వ్యాఖ్యానించారు. సుప్రీం ఆదేశాల మేరకు సిబిఐ తన నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి అందచేయాలే తప్పించి, ప్రభుత్వానికి ఒక్కముక్క కూడా తెలియచేయటానికి వీల్లేదని ఆయన గుర్తు చేశారు. తమ నివేదికలోని అంశాలను సిబిఐ అధికారులు లేదా రాజకీయ నాయకత్వానికి వివరించకూడదని సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం నివేదికను తారుమారు చేయటం సహించరాని నేరమే అవుతుందని ఆయన చెప్పారు. గనుల కేటాయింపులో చోటుచేసుకున్న అవినీతి అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ జోక్యాన్ని సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టు దృష్టికి సిబిఐ తీసుకురానున్నందున తీవ్ర పరిణామామలు తప్పవని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ జోక్యం లేదు: కాంగ్రెస్
ఇదిలావుంటే, వేడెక్కుతున్న ‘బొగ్గు’ వ్యవహారంపై కాంగ్రెస్ కోర్ గ్రూపు శనివారం చర్చించింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కోర్ సభ్యులు తీవ్రమవుతున్న పరిస్థితిపై చర్చలు జరిపారు. విమర్శల వాడిని పెంచుతున్న బిజెపిని ఎదుర్కొనే అంశంపై వ్యూహాత్మక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ గ్రూపు చర్చల అనంతరం అధికార ప్రతినిధి రషీద్ అల్వీ మీడియాతో మాట్లాడారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై సుప్రీం కోర్టుకు సిబిఐ సమర్పిస్తున్న నివేదికలో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా తేల్చిచెప్పారు. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యే వరకూ బిజెపి వేచి ఉండాలన్నారు. దేశాన్ని తప్పుదోవ పట్టించవద్దని, దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.
కథనాలన్నీ కల్పితాలే: సిబిఐ
అయితే, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు నివేదికను ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న కథనాలన్నీ ఊహాజనితాలని సిబిఐ డైరెక్టర్ రంజిత్‌సిన్హా కొట్టిపారేశారు. వ్యవహారం యథాతథ స్థితికి సంబంధించి ఇప్పటికే సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించామన్నారు. సిబిఐ నివేదికలో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయన్న కథనాల్లో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయన కొట్టిపారేశారు.
గనుల కేటాయింపు కుంభకోణంలో కొత్తమలుపు*మన్మోహన్ లక్ష్యంగా దాడికి విపక్షాలు సమాయత్తం
english title:
coalgate
Date:
Sunday, April 14, 2013