లౌకికవాదే పదవికి అర్హుడని మెలిక * జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చ
==================
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ప్రధాన మంత్రి పీఠంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కూర్చోబెట్టాలన్న భారతీయ జనతా పార్టీ ఆలోచనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన మంత్రి పదవికి ఎవరు అర్హులన్న విషయమై బిజెపి, దాని భాగస్వామ్య పక్షమైన జెడి(యు) మధ్య నలుగుతున్న వివాదానికి తెరపడింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ఆమోదించే ప్రసక్తి లేదని జనతాదళ్(యు) నిర్ద్వంద్వంగా ప్రకటించింది. లౌకికవాదానికి కట్టుబడిన వ్యక్తులే ప్రధానమంత్రి కావాలన్న తమ వాదన ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని పార్టీ నాయకుడు కేపి త్యాగి స్పష్టం చేయటంతో మోడీ అభ్యర్థిత్వంపై బిజెపి, జెడి(యు) మధ్య సయోధ్య కుదరకపోగా రానున్న కాలంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమీకరణలు మారే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. రెండురోజుల పాటు జరిగే జెడి (యు) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఇక్కడ మొదలయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ సమావేశాల్లో సీనియర్ నాయకుడైన శరద్‌యాదవ్ మూడవసారి పార్టీ అధ్యుక్షుడిగా ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి పదవికి మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జెడి(యు) ఈ మేరకు ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది. అయితే చివరి క్షణాల్లో చర్చను ఆదివారానికి వాయిదా వేశారు. బిజెపితో తమకున్న సదీర్ఘ అనుబంధం యథాతథంగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని సీనియర్ నేత త్యాగి మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు. అంతేకాక ప్రధాని అభ్యర్థి విషయంలో తమ పార్టీ బిజెపిపై ఎలాంటి ఒత్తిడీ చేయటం లేదని చెప్పారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే బిజెపి అభ్యర్థే ప్రధాని అవుతారని చెబుతూ, పదవిని లౌకికవాదే చేపట్టాలన్నది తమ అభిమతమని మెలికపెట్టారు. మోడీయే ప్రధాని అభ్యర్ధి అన్న ప్రచారం పత్రికల్లో తప్పించి ఇంతవరకూ పార్టీపరంగా వ్యక్తం కాలేదని ఆయన గుర్తు చేశారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మతకలహాలను అదుపుచేసి అమాయకుల ప్రాణాలను రక్షించటంలో ముఖ్యమంత్రిగా మోడీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బిజెపి ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ధర్మాన్ని సక్రమంగా పాటించటం లేదని విమర్శించారు. బిజెపి తన ప్రధాని అభ్యర్థిని ప్రకటించిన తరువాతే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు వ్యవధి ఉన్నందున తమ పార్టీ ఏ విషయంలోనూ తొందర పడదని త్యాగి వెల్లడించారు. (చిత్రం) ఢిల్లీలో శనివారం ప్రారంభమైన జెడి(యు) జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికపై ముచ్చటిస్తున్న పార్టీ అధ్యక్షుడు శరద్‌యాదవ్, బీహార్ సిఎం నితీష్‌కుమార్, సీనియర్ నాయకుడు త్యాగి
ప్రధాని అభ్యర్థిత్వంపై జెడి(యు) * కమలనాథుల ఆశలకు చెక్
english title:
jdu
Date:
Sunday, April 14, 2013