కడప/ అనంతపురం, ఏప్రిల్ 13: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి డుమ్మాకొట్టారు. కడప వైఎస్సార్ జిల్లాలో శనివారం ముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటనలో మిగిలిన ఇద్దరు మంత్రులతో పాటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నేతలు, జిల్లా నేతలు ఎవరికివారే యమున తీరే అన్నట్టుగా వ్యవహరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం మహీధర్‌రెడ్డి మాత్రం పర్యవేక్షణ బాధ్యతను భుజానికెత్తుకుని గత రెండు రోజులుగా అధికార యంత్రాంగాన్ని, జిల్లా నేతలను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని గట్టెక్కించారు. మంత్రులు సి రామచంద్రయ్య, ఎస్‌ఎండి అహ్మదుల్లాలు శనివారం ఉదయం జిల్లాకు చేరుకున్నప్పటికీ తప్పనితంతుగా ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్న సిఎం పర్యటన ఏర్పాట్ల విషయంలో అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో అనుచరగణం కూడా అదేబాటలో నడిచింది. డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ మాత్రం తనవంతు బాధ్యత నెరవేర్చానని అనిపించుకున్నారు. ఇదిలావుండగా బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి శివరాకృష్ణారావుల మధ్య స్పర్థలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కమలమ్మ సీనియర్ నాయకుడు శివరామకృష్ణారావుకు తెలియకుండా కార్యక్రమాలు ఖరారు చేయడంతోపాటు చివరికి ఆయన కోరిన బద్వేలులోకాకుండా అట్లూరు మండలంలో వేదికలు ఏర్పాటు చేయడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయినట్టు తెలుస్తోంది. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన శివరామకృష్ణారావును కమలమ్మ నిర్లక్ష్యం చేయడంపై ఆయన అనుచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. శివరామకృష్ణారావు పార్టీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి ముంత్రి మహీధర్‌రెడ్డి జోక్యం చేసుకుని ఆయనతో మంతనాలు జరిపారు. దీంతో ఆయన శుక్రవారం వౌనం వీడారు. మంత్రి మహీధర్‌రెడ్డితోపాటు ఏర్పాట్లను పర్యవేక్షించినా అన్యమనస్కంగానే ఉన్నట్టు కనిపించింది. ఇవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కమలమ్మ జన సమీకరణ కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కాగా జిల్లాకు చెందిన రాజంపేట ఎంపి, కేంద్ర మాజీ మంత్రి ఎ సాయిప్రతాప్, రాష్ట్ర మాజీ మంత్రి ఎస్ రామమునిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజులరెడ్డి, రాజంపేట ఇన్‌చార్జి మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, రైల్వే కోడూరుకు చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడులు తమ అనుచరులతోరాగా కడప, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల నుంచి డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి, పిసిసి ప్రతినిధి ఎం రాంప్రసాద్‌రెడ్డిలు వేర్వేరుగా తమ అనుచరగణాలతో ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యారు. జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు మచ్చుకైనా హాజరుకాలేదు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయినప్పటికీ జిల్లా మంత్రులకు ముఖ్యమంత్రితో సఖ్యత ఏమాత్రం ఉందో పర్యటనలో స్పష్టమయింది. ఆధిపత్య పోరు నేపథ్యంలో మంత్రులు, నేతలు సిఎం పర్యటన విషయంలో కూడా ఎవరికివారుగా వ్యవహరించడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
అనంతలో జెసి డుమ్మా!
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి డుమ్మాకొట్టారు. జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన జెసి మరోసారి సిఎం పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ముఖ్యమంత్రి పదిసార్లు పర్యటించగా ఒకటి, రెండుసార్లు మాత్రమే జెసి పాల్గొన్నారు. శనివారం సభకు సైతం దూరంగా ఉన్నారు. కార్యక్రమంలో జెసి వర్గీయులు సైతం పాల్గొనలేదు. జిల్లాకు చెందిన మంత్రులతో విభేదాలు తీవ్రస్థాయిలో ఉండటం వల్లే సిఎం సభకు జెసి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రులు, నేతలు ఎడమొగం పెడమొగం * అనంతలో మాజీ మంత్రి జెసి గైర్హాజరు
english title:
dl
Date:
Sunday, April 14, 2013