కడప, ఏప్రిల్ 13: రాష్ట్రంలో గుడిసెలనేవి లేకుండా పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి నాటి ఇందిరమ్మ కలలను యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆశీస్సులతో నిజం చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం కడప వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గంగవరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా గూడులేని ఎస్సీలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 65 వేల రూపాయలను లక్ష రూపాయలకు, ఎస్టీలకు ఇచ్చే 65 వేల రూపాయలను లక్షా 5వేలకు పెంచామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కపట ప్రేమ చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినపుడు సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. వెన్నుపోటుతో అధికారం వెలగబెట్టిన బాబు అధికారదాహంతో పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. పాదయాత్రలో అమలుకాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. సభకు వేలాదిగా తరలి వచ్చి తనను ఆదరించడం తన జీవితంలో మరుపురాని ఘట్టమని అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేసిన తర్వాత రాష్ట్రంలోని ఎస్టీలకు 16.6 శాతం రూ.8,585 కోట్లు, ఎస్టీలకు 6.1శాతం రూ. 3,666 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఏడాదిలోనే నిధులను ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఈ చట్టం కింద గతంలో ఎస్సీ, ఎస్టీలకు పక్కా ఇళ్లకు 65వేలు విడుదల చేస్తుంటే, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఒక్కొక్క గృహానికి లక్ష రూపాయలకు పెంచామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలన కోసమే దళిత వర్గాలకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంపుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ వాడితే ప్రభుత్వమే ఆ బిల్లులను భరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి టీవీ చానళ్లు, పత్రికలు లేవన్నారు. ఆ రెండూ కార్యకర్తలేనన్నారు. కార్యకర్తలే ప్రసార సాధనాలై 2014లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రుణాల్లో సింహభాగం మహిళలకే వడ్డీ లేకుండా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఇస్తున్న రుణాలకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. గతంలో పురుషుల ఆధిపత్యంతో కుటుంబాలు అభివృద్ధి కాలేదనే నానుడి ఉందన్నారు. అందుకే ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అందించడం ద్వారా ఆ కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉన్నాయన్నారు. ఈ వాస్తవాన్ని కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జిమంత్రి ఎం మహీధర్‌రెడ్డి, మంత్రులు సి రామచంద్రయ్య, ఎస్‌ఎండి అహ్మదుల్లా, పితాని సత్యనారాయణ, పసుపులేటి బాలరాజు, రాజంపేట ఎంపి సాయిప్రతాప్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) కడప వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్.
ఇందిరమ్మ కలల సాకారానికే ఉప ప్రణాళిక చట్టం బాబుకి ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ ఉండే అసెంబ్లీకి హాజరుకాలేదా? కాంగ్రెస్‌కు కార్యకర్తలే టీవీలు, పత్రికలు కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
english title:
hutless state
Date:
Sunday, April 14, 2013