హైదరాబాద్, ఏప్రిల్ 13: వేసవి దృష్ట్యా పెరిగిన ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుకు అనేక సదుపాయాలు, ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 278 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ రైళ్లు హైదరాబాద్, తిరుపతి, కరీంనగర్, విశాఖపట్నం, మచిలీపట్నం, రేణిగుంట, కాకినాడ, గుంటూరు, నాందేడ్, ఔరంగాబాద్, బెంగళూరు, ముంబాయి, కొల్లం, జైపూర్, శ్రీగంగాపూర్, కోట, దర్బాంగకు నడుస్తాయి. 22 రైళ్లకు 63 అదనపు కోచ్‌లను అనుసంధానం చేశారు. దీనివల్ల వెయిటింగ్ జాబితా తగ్గుతుంది. అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇ-టిక్కెట్లు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. జన సాధారణ్ టిక్కెట్ బుకింగ్ సేవక్, ఆటోమాటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. టిక్కెట్ల బుకింగ్ రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద మోసగాళ్లు నేరాలకు పాల్పడకుండా తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల అత్యవసరాలను గమనించిన ఈ నేరగాళ్లు రైల్వే సిబ్బందితో కుమ్మక్కై దొంగమార్గాల ద్వారా టిక్కెట్లను సంపాదించి ప్రయాణికులకు ఎక్కువ సొమ్ముకు ఇస్తారు. ఈ సందర్భంగా నేరగాళ్ల కదలికలపై గట్టి నిఘా పెట్టినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీరికి సహకరించే రైల్వే సిబ్బందిని కూడా తనిఖీ బృందం గమనిస్తుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వేసవి రద్దీని ఎదుర్కోవడానికే.. టిక్కెట్ల మోసాలకు పాల్పడితే చర్యలు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
english title:
special trains
Date:
Sunday, April 14, 2013