హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలెప్పుడు?.. ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట, అమ్మహస్తంతో నెలంతా బిజీబిజీగా గడుపుతున్నారు. జూన్‌లో స్థానిక సంస్ధల ఎన్నికలకు, తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీని సమాయత్తం చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి పరుగులు తీస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా గడువు ఉన్నప్పటికీ, లోక్‌సభకు ఈ ఏడాది చివర్లోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై, మార్చి నెలాఖరుకు ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంతో ముగిసేవి. కానీ ఈ దఫా పార్లమెంటు తరహాలో కొత్తగా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేశారు. ఆమేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలరోజుల క్రితం మెదక్ జిల్లా శంకర్‌పల్లిలోని లహరి రిసార్ట్స్‌లో స్టాండింగ్ కమిటీలపై రెండురోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు రోజున అసెంబ్లీ సెంట్రల్ హాలులో పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్‌తో ఆర్భాటంగా సదస్సును ప్రారంభింపజేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు కాలేదు. గత నెల 13న ప్రారంభించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడునెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించుకోవడం, 26న సమావేశాలు వాయిదా పడడం జరిగిపోయాయి. ఓట్ ఆన్ అకౌంట్‌కే ఆమోదం పొందినందున, పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదం కోసం మళ్లీ అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. ఆ సమావేశాలు నిర్వహించడానికి ముందు, కొత్తగా ఏర్పాటు చేసే స్టాండింగ్ కమిటీలు, అన్ని ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై అధ్యయనం చేయాల్సి ఉంది. ఆ కమిటీలు నేరుగా సభకు సిఫార్సులు అందజేస్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి కమిటీలకు కనీసం మూడువారాల గడువు అవసరం ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఇప్పటివరకు కమిటీల ఏర్పాటు కాలేదు. కమిటీల ఏర్పాటు ఎప్పుడు? సమావేశాలు మళ్లీ ఎప్పుడు? అంటే మే నెలాఖరున లేదా జూన్ మొదటివారంలో నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశాల కంటే నెల రోజుల ముందు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటైతేనే, ఆ కమిటీలు అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి పైగా గడువు ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం, ప్రజలతో మమేకం కావడంలో నిమగ్నమయ్యారు. ఈ స్టాండింగ్ కమిటీలపై పెద్దగా దృష్టి సారించే అవకాశాలు కనిపించడం లేదు. స్టాండింగ్ కమిటీలు ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో ఆలోచన చేయడం బాగా లేదని, కనీసం రెండేళ్ళ ముందైనా చేసి ఉండాలని, లేదా సార్వత్రిక ఎన్నికలు పూర్తయి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనైనా చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దృష్టి సారించలేమని ఎమ్మెల్యేలు కొందరు అన్నారు. పైగా ఈ అధ్యయనం చేయడం అనేది రాష్ట్రంలో తొలిసారి కాబట్టి, అంత సమర్థవంతంగా జరుగుతుందన్న నమ్మకమూ లేదన్న అభిప్రాయాన్ని, సందేహాన్ని వ్యక్తం చేశారు. మేలో కమిటీలు ఏర్పాటైతే అధ్యయనం చేయడానికి మూడువారాల గడువు అవసరం కాబట్టి మేలో మండు వేసవిలో మూడువారాల పాటు హైదరాబాద్‌లో ఉంటే, అటు ఎమ్మెల్యేలకు, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే కొత్తగా ఏర్పాటయ్యే 12 స్టాండింగ్ కమిటీల్లో నాలుగు స్టాండింగ్ కమిటీల చైర్మన్ పదవులను ప్రతిపక్షాలకు ఇవ్వాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఎందుకంటే పార్లమెంటును ఆదర్శంగా తీసుకుంటున్నాం కాబట్టి అదే పద్ధతిని ఆచరించాలని ఆయన చెబుతున్నారు. పార్లమెంటులో మొత్తం 24 కమిటీలు ఉంటే, అందులో 8 కమిటీల చైర్మన్ పదవులను ప్రతిపక్షాలకు ఇచ్చారు. ఇక్కడా అదే పద్ధతిని అవలంభించాలనుకున్నా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీ స్టాండింగ్ కమిటీల చైర్మన్ పదవులను తీసుకోవడానికి విముఖత చూపుతున్నది. ఎందుకంటే కమిటీ చైర్మన్ పదవులను తీసుకుంటే, భాగస్వామ్యమై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అవకాశం రాదని ఆ పార్టీ భావన. కమిటీ చైర్మన్ పదవులను తీసుకోకుండా ఉంటే, ప్రతి కమిటీ సమర్పించే నివేదికను తూర్పారబట్టేందుకు అవకాశం లభిస్తుంది.
మరోవైపు స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీ్ధర్ బాబు, అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి జాబితాలు సిద్ధం చేశారని, దానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆమోదం తెలపాల్సి ఉందని తెలుస్తోంది.
సమావేశాల నిర్వహణపై తర్జన భర్జన * స్టాండింగ్ కమిటీలతో తలనొప్పి! * కమిటీల్లో చేరేందుకు తెదేపా విముఖత
english title:
assembly
Date:
Sunday, April 14, 2013