నడిమెట్ల రామయ్య తెల్లటి గుబురు మీసాలు, భుజంపై కండువ, ధోతి కట్టుకుని గోచి బిగించి, అచ్చం తెలుగు ‘్ధనం’ ఉట్టిపడుతున్న తాతయ్యలాగా కనిపిస్తాడు. గత ఆరేడేళ్ళ నుండి ప్రతి సాహిత్య, సాంస్కృతిక సభల్లోను లెక్కతప్పకుండా కనబడేవాడు. డెబ్బయి ఏళ్ళ ముదిమిలోనైనా చురుకుగా వుండేవాడు. నిర్ణీత సమయానికి ముందే ఠంచన్‌గా హాజరవుతాడు. ఈయనకు పనిపాటా, కుటుంబం, పిల్లలు లేరా? ఉన్నా ఎవ్వరూ ఏమనరా? అనిపించింది. నాలో నాకే ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. నేను కూడా తరుచుగా సభలు, సమావేశాలకు వెడుతుండటం వలన, వెళ్ళినచోట రామయ్యగారు తారసపడుతుండటం వల్ల ఆయనపై చర్చించే ఆలోచన మళ్ళింది. ఆయన నన్నుచూడగానే యథాలాపంగానే, ‘నమస్కారమండి’ అన్నాడు. నేను అదోలా ఆలోచిస్తూనే ప్రతి నమస్కారం చేసి ముందుకు కదిలాను. సార్ అని పిలువడంతో, ఎందోయ్ అన్నాను. ఏమనుకోకండి సార్, మొన్న మీరు రాసిన మానేరు తరంగాలు అన్న పుస్తకం ఒకరి చేతిలో చూశాను, కాస్తా నాకొకటి ఇస్తారా? అన్నాడు. నేను ఇరవైఐదేళ్ల కిందట రాసిన జైజవాన్- జైకిసాన్ పాటల పుస్తకం తీసుకోండి అని తన జబ్బ సంచీనుండి తీసి ఇచ్చాడు. సరేలే రామయ్యగారు ఇస్తాను. వీలైతే మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. తప్పక, సరేనని బదులిచ్చాడు.
తెల్లారి ఆదివారం ఉదయం కుర్చీలో కూర్చుండి, పేపర్ తిరగేస్తున్నాను. మా ఆవిడ తనకే సొంతమైన వంటసాలలో గరిటెలను ఆడిస్తోంది. సార్ అంటూ రామయ్య దిగారు. రావయ్యా అని ఆహ్వానించాను. లోనికివెళ్ళి నేను రాసిన మూడు పుస్తకాలు ఇచ్చాను. కృతజ్ఞతలు, మీరు ఇంత ఉదారులని అనుకోలేదని, పుస్తకాలు తీసుకుంటూ అన్నాడు. అలా ఎందుకంటున్నావయ్యా? అన్నాను. పుస్తకాలు చదివేవారి దగ్గరికి చేరితేనే విలువుంటుంది. బుల్లితెర ఇంటిలోకి వచ్చి రీడింగ్‌ను కబళించివేసింది. నారచనకు సార్థకం వుంటుందని ఇచ్చానని అన్నాను.
ఈలోగా నా శ్రీమతి శారద రెండు టీ కప్పులతో వచ్చి చేరో కప్పు చేతికందించింది. ముదిమి వయస్సులో తిప్పుడు మీసాలతో ఉత్సాహంగా వున్నారు, దీని రహస్యమేమిటి? ఉత్సుకతను చంపుకోలేక అడిగా...
అందరూ ఇలాగే అడుగుతుంటారు. కాదనను, చెబుతాను. మీకు ఒపికుంటే నా జీవితానే్న కథగా చెబుతాను. మీరే తీర్పివ్వండి అన్నాడు.
సార్ నేనొక సాధారణ మగ్గం నేసే పద్మశాలి కార్మికున్ని. కరీంనగర్ మండలంలోని వల్లంపాడు స్వగ్రామం. వృత్తిపరంగా వచ్చిన సాంప్రదాయ మొగ్గం నేతనే నాకు బతుకుతెరువు. పెళ్ళాయ్యాక నా పొట్టతిప్పలాటలు, కష్టాలు పోటీపడ్డాయి. కొన్నాళ్ళు ఇంటివద్దే మొగ్గం నేశాను. గిట్టుబాటు కాకపోవడంతో కరీంనగర్‌కు చేనేత సోసైటిలో మొగ్గం కూలీగా చేరాను. కూలీ సరిపోకపోవడం వల్ల మహారాష్టల్రోని బీవండిలో మిల్లు సాంచాలపై పనిచేయడానికి వలస వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అంతా చేదు అనుభవమే ఎదురయైంది. రోకట్లో నుండి తీసి పొయ్యిలో కాలు పెట్టినట్లయింది. బీవండిలో మిల్లులలో పనిచేసే వర్కర్లది పరమ దుర్భర జీవితం. 12 గంటల డ్యూటి. రాత్‌పైలీ, దివస్ పైలిగా పని చేయాల్సి వుంటుంది. అక్కడ కూడా వర్కర్లు అనేక వ్యసనాలకు లోనై, అష్టకష్టాలు పడుతుండటం కనిపించింది. పైగా ఒంటరి జీవితం, బరువనిపించింది. భీవండి కార్మికుల దుర్భర జీవితంపై చలించి ఒక గేయం కూడా రాశాను. ఆర్నెల్లు తర్వాత బీమారికి గురి కాగా, చేసేదిలేక పెట్టెబేడా సదురుకొని ఇంటికి వచ్చేశాను. టెన్త్ వరకు చదివాను. సొంతంగా గేయాలు, పాటలు రాసి పాడటం, కవిత్వం రాయడం నాకు కొట్టినపిండి.
మా నాయన తెచ్చే తత్వాలు, మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు చదవటం వల్ల నాకు కొంత ఆధ్యాత్మికంగాను, మరియు సాధారణంగాను లోక జ్ఞానం తెలిసివచ్చింది. చేనేతకు పెద్దదిక్కయిన ప్రభుత్వ సహకార ప్య్రాబ్రిక్స్ సంస్థలో 1973లో అప్రెంటిస్, అసిస్టెంట్ సేల్స్‌మెన్ జాబ్స్ వున్నట్లు తెలిసి దరాఖాస్తు చేశాను. నెలరోజులలోపే జాబు ఇస్తు, తిరుపతిలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు నాజీతం 110 రూపాయలు. ఎదుగుల లేని ఉద్యోగమిది. పొట్టతిప్పలుకై ఎదో పనిచేయాలన్న విషయమై రాజీపడాల్సి వచ్చింది. విషయాలన్నీ అవగాహన అయ్యేవరకల్లా ఇహ ఉద్యోగం చేయడం భారమనిపించింది. అప్పటికీ సంస్థలో నిబద్దతగల సైనికుడిగా 27ఏళ్ళపాటు నా ఉద్యోగ జీవితం నడిచింది. 2వేల సంవత్సరంలో తప్పుకున్నాను. సంస్థలో ఎనె్నన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నాను. వాటి వివరాలు వింటే నా జీవితమే మరొక బృహత్క్థగా, వుంటుందని నవ్వుకుంటూ అన్నాడు.
తిరుపతిలోని సంస్థవారి విక్రయశాలలో అప్రంటిస్ సేల్స్‌మెన్‌గా నా ప్రవాస జీవితం మొదలైంది. అప్పటికే నా పెళ్ళయి, పదేళ్ళయింది. నావయస్సు 33 ఎళ్ళు. నా శ్రీమతిని కాపురానికి తీసుకెళ్ళాను. నాతోపాటుగా, ఆరేడుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. నెలకు మూడు లక్షల టర్నోవర్ వుండేది. కస్టమర్స్ కొన్న బట్టలు ప్యాకింగ్ చేయడం, స్వీపర్ రాకపోతే ఊడ్చడం, అతిధులకు టీలు అందించడం, షాపు షెల్ప్‌లు,సేల్స్ కౌంటర్ శుభ్రం చేయడం వంటి పనులుండేవి. ఉదయం 10 గంటల నుండి రాత్రి కొట్టు కట్టేసే 9 గంటల వరకు పని వుంటుండేది.
పైగా ఎవరైనా వస్తే తిరుమల కొండకు తీసుకెళ్ళి దర్శనం చేయించేవాడిని. అక్కడి తిరుమల అర్చకులతో పరిచయాలు పెరగడం వల్ల వెంకన్న దర్శనం సులభంగా అయ్యేది. అప్పటి లడ్లు పెద్దసైజులో, మధురంగా వుండేవి. వాటి ధర ఒక రూపాయే. మూడేళ్ళ తర్వాత నెల్లూరుకు సేల్స్‌మెన్‌గా ప్రమోట్ చేస్తూ బదిలీ చేశారు. నా నిజాయితీ తనాన్ని నచ్చిని చేతివాటానికి పాల్పడిన తోటి ఉద్యోగులు, నన్ను తెలివిగా నెల్లూరుకు బదిలీ చేయించారని తెలిసింది. తిరుపతిలో వేడినీళ్ళకు చన్నీళ్ళలాగా మా ఆవిడ బట్టల మిషన్ కుట్టి సంపాదిస్తుండేది. మా ఆవిడ స్వయం ఉపాధి నా కుటుంబానికి ఎంతో అండై నిలిచింది. నా అత్తెసరి జీతంతో సమానంగా మా ఆవిడ ఆదాయం తేవడం వల్ల, ఇలా నాకుటుంబాన్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, నెట్టుకురాగలిగాను.
సింహపురిలో ఒక సంవత్సరం పనిచేశాను. నెల్లూరు షాప్ కౌంటర్ పెద్దదే. పక్కనే వున్న గూడూరు షాపులో ఫ్రాడ్ కావడం వల్ల, నన్ను ఇంచార్జ్ అసిస్టెంట్ మేనేజర్‌గా అక్కడికి పంపించారు. గూడూర్‌లో తొమ్మిదేళ్లు సంస్థకు పనిచేశాను. నా నిజాయితీ పనితనం వల్ల షాపు టర్నోవర్ పెరగింది. షాపు గిరాకీ పెరిగింది. నగరంలో వుండే మరో షాపు బాగోగులను కూడా నేనే చూసేవాడిని. ఎందుకంటే ఆషాపు మేనేజర్‌కు తరుచుగా అనారోగ్యానికి గురికావడం వల్ల ఆషాపు నిర్వహణాభారం, అకౌంట్స్ చూడటం అన్నీ నాపైనే అదనంగా పడ్డాయి. పొరుగున వున్న శ్రీహరికోట ఆప్కో షాపులో దొంగలుపడి బట్టలు పోయినపుడు, ననే్న ఆషాపు ఇంచార్జిగా డిప్యూటేషన్‌పై పంపించారు. నేను ఆషాపు నిర్వహణను మెరుగుపరచాను. దానివల్ల శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఉద్యోగులతో పరిచయాలు పెరిగాయి. 1977 కృష్ణాజిల్లా దివిసీమ ఉప్పెన వచ్చినపుడు, సంస్థ తరపున చేసే సహాయానికి ననే్న ఎంపిక చేసి పంపించారు. సూళ్లూరుపేట స్టాక్ పాయింట్ నుండి బట్టలు తీసుకెళ్ళి చుట్టుపక్కల గల గ్రామాలలోని తుఫాన్ బాధితులకు పంపిణీ చేయించేశాం. అదనంగా లెక్కతప్పిపోయి వచ్చిన రెండు బట్టల గట్టాలను తిరిగి సంస్థకు వాపస్ చేయించాను. వాటిని అమ్ముకుతిందామనుకున్న తోటి ఉద్యోగుల నోట్లో పచ్చి వెలగ్గాయ పడినట్లయింది. అవినీతికి ఆమడ దూరం ఉండటం వల్ల, అప్పుడప్పుడు ఇలా ఇబ్బందులెదురయ్యేవి. ఇక్కడి షాపులో 30మీటర్ల పాలిష్టర్ బట్ట రోల్ దొంగతనం జరిగినప్పుడు, వెంటనే పైఅధికారులకు రిపోర్టు చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినా, అధికారులు నా నిజాయితీకి మచ్చతెచ్చేలా ఆ బట్టల ఖరీదును నాజీతం నుండి రాబట్టుకోవడం నన్ను తెగ బాధించింది. ఇలా ఉద్యోగిగా ఎనె్నన్నో సమస్యల్ని ఏకవీరుడిలాగా అధిగమించినాను. అక్కడి నుండి నన్ను ఆత్మకూర్‌కు బదిలీ చేశారు. అక్కడి మేనేజర్, షాపు సరిగా తీయడం లేదన్న ఫిర్యాదులు రావడంతో ఆ షాపును సరిదిద్దడానికై నన్ను పంపించారు. అక్కడ ఐదేళ్ళు పనిచేశాను. షాపునిర్వహణా సామర్థ్యాన్ని పెంచాను.
అక్కడి నుండి నన్ను నా సొంత జిల్లాయైన కరీంనగర్‌కు బదిలీ చేశారు. ఎక్కడ అవినీతి వుంటే, సరిచేయమని అక్కడికి బదిలీ చేసే వారు. అధికారులకు నేనొక చూపుడు వేలులా మిగిలిపోయాను. అట్లనే జమ్మికుంట షాపును సరిచేసిన. నాపట్ల అధికారులలో మంచిపేరే వుండేది. తర్వాత నన్ను జమ్మికుంట నుండి కరీంనగర్‌కు బదిలీ చేశారు. కరీంనగర్ ఆప్కో కౌంటర్‌లోకి నన్ను మేనేజర్‌గా బదిలీ చేశారు. సిటికి రావడం నా ఇంటికి వచ్చినంత ఆనందమైంది. రెండేళ్ళ తర్వాత టవర్ సర్కిల్ శాఖకు బదిలీ చేశారు. ఆషాపు టర్నోవర్ లక్షల్లో వుంటుంది. మూడేళ్లు పనిచేశాక, నన్ను ఆదిలాబాద్ జిల్లా జన్నారంకు బదిలీపై పంపించారు. అక్కడి అవకతవకలు సరిదిద్దడానికై, నాసొంత జిల్లానుండి కదిలించడం నన్ను బాధించింది. ఆ టైమ్‌కే నా పెద్దమ్మాయి పెళ్ళి చేశాను. నిజాయితీ పనితనానికి స్థిరత్వం వుండదని నాతో రుజువైంది. సంచార కర్మచారిగా అలిసిపోయాను. తదుపరి రెండవ అమ్మాయి ప్రియబాంధవి పెళ్ళి చేశాను. నేను రిటైర్‌మెంట్ తీసుకునేంత వరకు నాజీతంలో ఎలాంటి పెరుగుదలలు కనిపించలేదు. నాకు ఆఖరికి దక్కిన పెద్ద సైజు జీతం కేవలం 5,500 రూపాయలు మాత్రమే. సంస్థలో చివరి దినాలలో పనిచేయడం నాకు రుచించలేదు. చాలామంది ఉన్నతాధికారులు సైతం లంచగొండి తనాలకు అలవాటై వుండటం వల్ల నాకు బాధేనిపించింది. ఇలావుంటే, సంస్థ భవిష్యత్తు, ఆర్థిక స్థితి కష్టంగా మారగలదని ఊహించాను. అప్పటినుండే సంస్థ నష్టాల బాటలో వున్నట్లు వార్తలు వచ్చాయి. బురదగుంటలో కాలిడి, బురదంటకుంట ఎలా ఉండగలుగుతుందన్న ప్రశే్న నన్ను వేధించసాగింది. పర్యవేక్షణకు వచ్చిన పైఅధికారులు, ప్రలోభాలకు, ఆమ్యామ్యాలకు ఆశపడినట్లు కనిపించేది. ఏమైనా లోపం కనిపిస్తేచాలు దండుకోవడానికి వారికి మార్గం సుగమమైనట్లే. ఇంకా తోమ్మిదేళ్ళ సర్వీసుందనగానే సంస్థ ప్రకటించిన స్వచ్చంద పదవీ విరమణ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. 2వేల సంవత్సరంలో పదవీ విరమణ పొందాను. అంతాకలిపి నాలుగున్నర లక్షల ద్రవ్యం చేతికి వచ్చింది. అందులో నుండి యాబై వేలు వృద్ధాశ్రమానికి విరాళంగా తీసి పెట్టాను. చిన్నమ్మాయి ఝూన్సిలక్ష్మీ పెళ్ళి చేశాను. శివాజీనగర్‌లోని నా పెంకుటింటిని బాగుచేయించుకుని కవిత్వం రాస్తు, సభలకు హాజరవుతూ కాలం వెళ్ళదీస్తున్నాను. ముగ్గురు బిడ్డల తర్వాతే నా కవిత్వం నాలుగో కూతురు నుండి నేడు పెద్దకూతురంతగా ఎదిగిపోయింది. 40 ఏళ్ళ పర్వంలో పుస్తకాలు చదివినా, కవిత్వం రాసినా, పాటలు పాడినా. 1970లోనే పాటల పుస్తకం రాయగా, అప్పటి కరీంనగర్ కలెక్టర్ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఇటీవల తెలంగాణ ఉద్యమ పాటలు రాశాను. గొంతెత్తి పాడుతాను. ‘నడిమెట్లరాగాలు’ అన్న గేయశతకాన్ని వేయగా, చక్కటి ఆదరణ లభించింది. ఈపుస్తకాన్ని రంగినేని ట్రస్టు వారు అచ్చేసిర్రు. నాజీవితం నల్లేటి మీది నడక కాదు,అయినప్పటికి సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను.
ఏవండి టిఫిన్ రెడీ అయింది. మీ ఇద్దరకు తెమ్మాంటారాయని నా శ్రీమతి వంటశాల నుండి పిలువడంతో.. రామయ్య సంభాషణను ఆపాడు. ఇహ మార్కెట్‌కు వెళ్లే టైమైందని లేచాడు. రామయ్య ఉద్యోగ జీవితంలోని ఆటుపోట్లను ఆధారంగా తీసుకుని, ఎందుకు కథరాయరాదని అనిపించింది. పక్కనున్న ప్యాడ్ తీసుకుని, కలంతో కథ రాయడం మొదలుపెట్టాను.
-సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్, సెల్. 9346814782
ఆనాటి కథలు.. ఆణిముత్యాలు- 2
సురవరం ప్రతాపరెడ్డి గారు, గోలకొండ పత్రిక- రెండూ అవిభక్త కవలలుగా తెలుగుజాతి గుర్తుంచుకుంది. తెలంగాణ సామాజిక జీవన విధానాన్ని అనేక విధాలుగా వెలుగులోకి తెచ్చిన మహామనీషి- సురవరం వారు. మొత్తం తెలుగు వారి ఆచార వ్యవహారాలూ, సాంస్కృతిక వైభవం, సంప్రదాయ వివరాలూ- లోకానికి వెల్లడిస్తూ వారు రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’- నాటికీ, నేటికీ ఒక సుప్రసిద్ధ ఆకర గ్రంథం. ఉత్తమ సాహిత్య ప్రచారానికీ, ఉన్నత విలువల నిర్వహణకీ సురవరం వారు వైవిధ్యభరితమైన ప్రక్రియల్ని ప్రోత్సహించారు. వాటిలో కథానిక ఒకటి. స్వయంగా తానే కథకులు. 1930 ప్రాంతాల్లోనే సామాజిక న్యాయ ఆవశ్యకతను బలంగా విశ్వసించి, తమ కథల ద్వారా ప్రజల్లో ఆ భావ చైతన్యాన్ని కలిగించిన ఆదరణశీలి వారు. ఆనాటి ప్రభువుల అలసత్వం, గ్రామాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ కలిగించిన దురాగతాలూ, అధికారమదాంధత వంటి అంశాల్ని వ్యంగ్యాత్మకం చేస్తూ వారు రాసిన ‘మొగలారుూ కథలు’ సుప్రసిద్ధమైనవి. కష్టించి గడించుకొని పొట్ట పోసుకునే శ్రమజీవులూ, ఇతరుల కష్టాన్ని తాము దోచుకుని వారి పొట్టలుకొట్టే దళారీలూ, ప్రభుత్వాధికార్లూ- వారి కథల్లో కళాత్మక వాస్తవికతతో కనిపిస్తారు. ఆ వ్యవస్థ దుస్థితి- ‘ఇంకానా, ఇకపై సాగదు’ అని చేసిన హెచ్చరికే ఈ- ‘సంఘాల పంతులు’ కథ!
నిజాం ఇలాకా గ్రామం. పేరు రామసాగరం. గ్రామంలో 500 ఇండ్లు. ఆ ఊళ్ళో ఒక సర్కారీ నాకా- అంటే పోలీసు స్టేషన్ వుంది. 12 మంది జవాన్లు, ఒక అమీన్, ఒక జమేదారు- దాని పాలకులు. అమీన్ ఇల్లు నాకా పక్కనే. అమీన్ పెండ్లాము- బేగం సాహెబా! పోలీసు వారెప్పుడూ చేతి నుంచీ పైకమిచ్చి వస్తువులు కొనరు. కోరిందంతా కోమట్లు సప్లై చెయ్యాలి. కోళ్ళు, గుడ్లు, కట్టెలు- మాదిగల జిమ్మా! ఇట్లా వ్యవహారం మజాగా సాగుతూ వుంది. ఒకనాడు ముసలి మాదిగది- 70 ఏండ్లది- అమీన్ సాహెబ్ పెండ్లాము రేలకట్టెల మోపు తెమ్మంటే, అడవంతా తిరిగి అవి దొరక్క తంగేడి కట్టెలు మోపు చేసుకుని కష్టించి అలసిపోయి, మోపు తెచ్చి ఇంట్లో వేసింది. ‘్ఛనాల్, రేలకట్టె తీస్కొని రమ్మంటే, ఇదేమి పుల్లలు తెచ్చినావ్?’ అని డొక్కమీద నాలుగు తన్నులు తన్నింది బేగం. ముసలిది చచ్చింది. ‘నికాలో ఈ పీనిగని’ అంది బేగం. శవాన్ని ఈడ్చి మాదిగ గేర్లో పారేశారు జవాన్లు. కోమటి దుకాన్‌దారు బాదమ్, అఖ్రోట్, పిస్తా సప్లై చేయలేదని నాలుగు ‘జూతా’లు పునకమీద వాయించారు... ఇలావుంది జులుం పరిస్థితి. ఊళ్ళో గోలరేగింది. ఒకనాడు చీకటి వుండగానే పక్క వూరి నుంచీ బండి కట్టుకొని ఒక పెద్ద మనిషి రామసాగరం వచ్చాడు. ఎతె్తైన మనిషి. ఖద్దరు వేస్తాడు. వకీళ్లలాగా రుమాలు కడ్తాడు. వెంట తోలుపెట్టె. ఈయనే సంఘాల పంతులు! ఊళ్ళో పది మందినీ కలిపాడు. కోమట్లకి ధైర్యమిచ్చాడు. వర్తక సంఘం స్థాపనయింది! తన పాయిఖానా బాగా సాఫు చేయలేదని ఒక మాలామె చెంప మీద వాత వేసింది బేగం. ఇంకొకాయన కాళ్ళొత్తలేదని డొక్కమీద తన్నాడు అమీన్. ఆయన మంచం పట్టాడు. ఈ బాధితుల్ని సమావేశపరచాడు పంతులు. వెట్టి కూడదనే ఫర్మానులు చదివి వినిపించాడు. క్రమంగా జనంలో అవగాహన వచ్చింది. వారంలోనే మార్పు మొదలైంది.
బేగం సాహెబ్ పాయిఖానా ఊడ్చేవారులేరు. వెట్టి చాకిరీకి మనుషులు రారు. కోళ్ళు లేవు. బియ్యం రూపాయికి 4 పళ్ళే అయినవి. గుర్రాలకు గడ్డి చిక్కదు! కుతకుత ఉడికిపోయింది నాకా! కడుపు రగిలింది. కసి రేగింది. పంతుల్ని ‘డాలో హత్కడీ, గోలీసే ఉడాదో, పట్టండి బొమ్మన్‌కీ’ అంటూ, ‘వీడూ మనకీ నోట్లో మన్నూ వేసినాడ్’ అంటూ జవాన్లు మీద పడ్డారు. సరిగ్గా ఆ సమయంలో- సైన్యం ప్రవేశించింది. జవాన్లకి దేహశుద్ధి జరిగింది. అమీన్‌ని తన్నారు. ‘కల్లు తిత్తివలె దొర్లినాడు’! వారం గడిచేసరికీ మొహతమీం వచ్చాడు. విచారణ జరిగింది. వందల కొలది షికాయతులు చేశారు గ్రామస్థులు. అమీన్‌కి బర్తరఫ్, జమాదారుకు తనుజ్జుల్ (డిగ్రేడ్), జవాన్లకి మోతల్ (సస్పెండ్).. కడకు నాకా అవసరం ఆ వూరికి లేదని, ఠానా బర్ఖాస్త్ (ఎత్తివేయటానికి) హుకుం అయింది! ఇదీ కథ!
సామాజిక వాస్తవికత, మంది మంచి కోసం ఒక మార్పు ఆవశ్యకత, జనంలో ఐకమత్యం వుంటే ఆ మార్పు సాధ్యమవుతుందనే నమ్మకం- వీటిని బలంగా చిత్రించిన కథ - ‘సంఘాల పంతులు’! నేటికీ ఆ నమ్మకం, ఆ ఆచరణలే- సమాజానికి రక్ష- అని మళ్ళీమళ్ళీ రుజువవుతూనే వుంది. అందుకనే ఈ కథ- సార్వకాలీనం, సార్వజనీనం అయిన ఆణిముత్యం!!
- విహారి, సెల్: 9848025600
బుక్ షెల్ఫ్
భారతీయ సాహిత్య వ్యాసాలు
-నలిమెల భాస్కర్
వెల: 60/-
రామయ్య విద్యాపీఠం ప్రచురణ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో
రావు రూకుల
(కవిత్వం)
-కందుకూరి శ్రీరాములు
వెల: 95/-
ఝరీ పోయెట్రి సర్కిల్ ప్రచురణ
ప్రతులకు: 503, సుహార్తి నెట్
సలీంనగర్, మలక్‌పేట
హైదరాబాద్
ఫోన్ నెం: 040-24545405
యాభై దాటిన యవ్వనం
(కవిత్వం)
-సౌభాగ్య
వెల: 90/-
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్
ప్రతులకు: సౌభాగ్య,
ఎఫ్-3, బి-4, రామరాజునగర్
మేడ్చల్ రోడ్, హైదరాబాద్
సెల్ నెం: 9848157909
సమ్మోహనం
(కవిత్వం)
-కోటం చంద్రశేఖర్
వెల: 50/-
కళాభారతి ప్రచురణలు
కాపీలకు: 4-2-120,
విజ్ఞాణపురి కాలనీ, తాండూర్
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం: 9490157371
మనో గీతికలు
ఓ మానవుడా
ఓ మానవుడా ధనమంటే ఎందుకు నీకు ఆపేక్ష
అక్రమ మార్గంలో సంపాదిస్తే పడుతుంది శిక్ష
అప్పుడు ఎవరూ రారు నీకు రక్ష
నీవంటే ఎవరికీ లేదు కక్ష
నామోషి కాకపోతే తొక్కు రిక్ష
చేతకాకపోతే అడుగు భిక్ష
భగవంతుడు పెడుతున్నాడు నీకు పరీక్ష
డబ్బు సంపాదించడానికి కావాలి దీక్ష
ఇతరుల సొమ్ము మీద ఎందుకు నీకు ఆకాంక్ష
నిన్ను నువ్వు చేసుకో సమీక్ష
లక్షలు సంపాదించడానికి మార్గాలున్నాయి సవాలక్ష
-కె.సురేష్ బాబు, సుల్తానాబాద్, సెల్: 8019432895
ముళ్ల కంప
సత్యం శివం సుందరమ్
ఓడిపోయిన జీవితం సాక్షిగా
నేను ఆ దారిలోనే నడిచాను
సత్యాన్ని సమాధి చేసి
మట్టి మీద జెండా లేని కట్టె
సాయమవుతున్నప్పుడు
కన్నీళ్లు కార్చినందుకు
ఎన్‌కౌంటర్
ప్రజాస్వామ్య ఆయుధం
గుండెల మీద గురి పెట్టింది
ఓడిపోయిన కన్నీళ్లని!
శివం మనసు శివం
ఆత్మ శివం
ఆకాశం శివం
శివం శివం శివం
శివుని మీద ఒట్టు
విశ్వాసం మీద ఓటునం నిలబెట్టినపుడు
ఏమిటనే ప్రశ్నించాను
కమల ముందు లాఠీ తిరిగింది
సుందరమ్
జీవనం సుందరమ్ జీవితం సుందరమ్
నడక సుందరమ్ ఆడుగు సుందరమ్
ఆలోచన సుందరమ్ ఆశ సుందరమ్
సుందరమ్ సుందరమ్ సుందరమంటూ
ఎన్ని మల్లె తోటలు నాటినా
ప్రపంచీకరణ పాడు గాలికి
అన్నీ ముళ్ల
కంపలయ్యాయి
-సిహెచ్.మధు
అబల
అబల నువ్వు అశ్రువు కాదు
తాళమేయ తబల కాదు
చాకిరి చేయ చీపురు కాదు
పోకిరి వెధవల బానిస కాదు
వంటింటి కుందేలువు కాదు
బాసండ్లు తోమ బతకలేక కాదు
బావ మరుదులతో బందుకుండుట కాదు
అత్త మామల పాద దాసివి కాదు
నాలుగు గోడల నిలువుటద్ధం కాదు
నాగరికత ఎరుగని అనామకురాలివి కాదు
నలుగురిలో తలవంచ దోషివి కాదు
నిత్యం నీవో యంత్రం కాదు
ప్లస్‌లు మైనస్‌లు లెక్కలు కాదు
ముళ్లు ఆకులు మచ్చలు కాదు
అనసూయ అరుంధతి కథలిప్పుడు కాదు
అణచివేతకు నువ్వు అర్థం కాదు
ఎత్తుకు ఎదగ ఆకాశం అడ్డే కాదు
ఎగతాళిని చేసేవారు ఎదురే కాదు
స్ర్తి పురుష భేదాలెంచే వ్యక్తులు కాదు
నీకడ్డుగ నిలిచే చీడలు అవరోధం కాదు
-వజీరు ప్రదీప్, పరకాల, సెల్: 989562991
నేనెప్పుడు..?
నేనెప్పుడు
కవిత్వం రాస్తనో తెలుసా?
మనో గోళంలో సునామి ఏర్పడినపుడు!!
నేనెప్పుడు మాట్లాడుతానో తెలుసా?
గొంతుల్లో
ఆప్యాయతకు వెలక్కాయ అడ్డుపడినపుడు!!
నేనెప్పుడు ఉద్యమిస్తానో తెలుసా?
హృదయ కవాటాలలో
ఉద్వేగం ప్రవహించినపుడు!!
నేనెప్పుడు స్పందిస్తానో తెలుసా?
ప్రశాంతత పరాయికరణం చెందినపుడు!!
నేనెప్పుడు విశ్రమిస్తానో తెలుసా?
అక్షరం ఎముకలు విరిగినపుడు!!
నేనెప్పుడు నినదిస్తానో తెలుసా?
నా ప్రశ్న పరావర్తనం చెంది
ననే్న ప్రశ్నించినపుడు!!
నేనెప్పుడు
బోధిస్తానో తెలుసా?
సుగుణం నిర్మోచనం చెంది
వెర్రితలలు వేసినపుడు!!
నేనెప్పుడు సూక్ష్మంగా ఆలోచిస్తానో తెలుసా?
వృద్ధాప్యం సమాధి
మంచి చెడులను ప్రశ్నించినపుడు!!
ఆకుముడుత పురుగులాగా
ఆత్మీయతా చెదలు
ఆవహించిన మనిషిని కదా
మనో యవనికపై రూపాయి లెక్కింపులు
లెక్కల్లో జీవిస్తున్నా
జీవితాన్ని లెక్కిస్తున్నా
లెక్క తేలేది ఎప్పుడనీ?
-కె.ఎస్.అనంతాచార్య
కరీంనగర్
సెల్ నెం: 9441195765
రవ్వలు
విద్యార్థి చేతిలో పెన్ను
జవాన్ చేతిలో గన్ను
రైతు ఒంటికి మన్ను
దేశానికి వెన్నుదన్ను
ఆచార్యుల చేతిలో పెన్ను
మన్నును మిన్నును చైతన్యపరిచే మూడో కన్ను
కవి చేతిలో పెన్ను అన్యాయాల నెదిరించె గన్ను
విద్యార్థుల మేధస్సుకు
పౌష్టికాహారం జీవితం నావకు దిక్సూచి పుస్తకం
నాకు ఏకాంతమంటే ఎంతో ఇష్టం
మెదడుకు పుస్తకాల మేత వేయొచ్చు
కలానికి కవిత్వం పూత పొయొచ్చు
-ఎర్రోజు వెంకటశ్వర్లు
కరీంనగర్
సెల్: 9492557037
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం కోసం ఈ క్రిందిచిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫోటో, చిరునామాతో ఈ మెయిల్ అడ్రస్‌కు పంపించండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. knrmerupu@deccanmail.com
నిర్వహణ: వారాల ఆనంద్ varalaanand@yahoo.com