విశాఖపట్నం, ఏప్రిల్ 14: పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సంవత్సరం జూన్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్న భావతో ఉన్న ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే ఓటర్ల జాబితాలను ప్రకటించిన అధికారులు ఈనెల 17 తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను చేపట్టనున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీలకు, వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈనెలాఖరులోగా 2011 జనాభా లెక్కలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ముందుగానే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 38.32 లక్షల జనాభా ఉంది. గ్రామీణ జిల్లా జనాభా 21.08 లక్షలు. వీరిలో ఎస్సీ జనాభా 7.6 శాతం కాగా, ఎస్టీ జనాభా 14.55 శాతం. జిల్లా వ్యాప్తంగా 942 గ్రామ పంచాయతీలు ఉండగా, ఏజెన్సీలో 244 గ్రామాలున్నాయి.
జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం, బిసిలకు 35 శాతం పంచాయతీలు, వార్డులు కేటాయించనున్నారు. వీటిలో 50శాతం స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ఈ జనాభా లెక్కల ప్రాతిపదికనే ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు.
వుడా షాపుల కేటాయింపునకు ఆన్‌లైన్ దరఖాస్తులు
విశాఖపట్నం, ఏప్రిల్ 14: విశాఖ నగర పరిధిలో వుడా షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాల్లో ఖాళీగా ఉన్న షాపులు, కార్యాలయ వసతుల కేటాయింపునకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ వుడా ప్రకటన జారీ చేసింది. కూర్మన్నపాలెం షాపింగ్‌కాంప్లెక్స్‌లో మూడు, పెదగంట్యాడ ఫేజ్-1లో ఒకటి, సాగర్‌నగర్‌లో నాలుగు, వెంకోజీపాలెంలో పెట్రోల్ బంక్ ఎదురుగా రెండు దుకాణాలు ఉద్యోగభవన్ కాంప్లెక్స్‌లో రెండు షాపులు, సీతమ్మధార జనతాకాంప్లెక్స్ మొదటి అంతస్తులో 19 షాపులు, వుడా పార్కు ఫేజ్-2లో మూడు షాపులు, ఫేజ్-1లో మినీ క్యాంటీను, కైలాసగిరి ఫుడ్‌కోర్టు-1 కేటాయింపు నిమిత్తం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
‘శ్రీ రామాయణం
అన్నా, విన్నా పుణ్యమే’
సింహాచలం, ఏప్రిల్ 14 : శ్రీరామాయణాన్ని పారాయణ చేసిన, శ్రద్ధతో వీనుల విందుగా విన్నా పుణ్యం ప్రాప్తిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు డాక్టర్ టి.పి.శ్రీనివాసయాజులు అన్నారు. దేవస్థానం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో జరుగుతున్న అష్టోత్తర శత సుందరకాండ సామూహిక పారాయణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు ఆయన సుందరకాండపై ప్రవచించారు. శ్రీరామాయణంలో సుందరకాండ ప్రత్యేకతలను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. లోకంలో గాయత్రి మంత్రానికి మించిన మంత్రం మరొకటి లేదని మహనీయుల వాక్కు అటువంటిది. సుందరకొండలో ఒకసారి పారాయణం చేస్తే సహస్ర గాయిత్రీ మంత్రాలలు జపించిన పుణ్యం దక్కుతుందని ఆయన ఉపమానాలతో సహ ప్రస్తుతించారు. కలిమొక్క ప్రభావతం రామాణం పూర్తిగా రామయణం, భారతం ప్రస్తావించిన కథలు, కవులు లేరని ఆఖరికి సినిమాలు కూడా అనేకం ఉన్నాయని రామానుజం చెప్పారు. కార్యక్రమం అనంతరం సింహక్షేత్ర ప్రధానార్చకుడు మోర్త సీతారామాచార్యులు నేతృతంలో భజన సంకీర్తన జరిగింది. అంతకు ముందు శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం ఉదయనగర్ సంకీర్తన నిర్వహించారు. చివరి రోజు సోమవారం మధ్యాహ్నం పూర్ణాహుతి, పట్ట్భాషేక సర్ల విన్నపం, శాంతి కల్యాణం, నిర్వహిస్తారు.
సింహగిరిపై బ్యూటిఫికేషన్ పనులు
సింహాచలం, ఏప్రిల్ 14: సింహగిరిపై బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నుండి పలు రకాల పూలమొక్కలను తీసుకువచ్చారు. ఆదివారం ముందు భాగంలో నృసింహాలయం వద్ద ఈ మొక్కలను నాటనున్నారు. బంతులు గులాబీలు విదేశీ జాతులకు చెందిన పుష్పాలు తీసుకువచ్చారు.
‘సామాజిక విలువలను నేర్పించేదే విద్య’
పెందుర్తి, ఏప్రిల్ 14 : సామాజిక నైతిక, విలువలను పెంచేదే విద్య అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పెందుర్తిలో గల శ్రీ విద్యా టెక్నో పాఠశాల రెండో వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వరూపానందేంద్ర సరస్వతి విద్యార్థులను ఉద్దేశించి అభిభాషించారు. ప్రతీ మనిషికి విద్య కీలకమైనదని దానిని అందరూ వినియోగించుకోవాలని స్వరూనందేంద్ర సరస్వతి ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పీలా శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి గొర్లె రామునాయుడు, పాఠశాల ప్రిన్సిపల్ అంజి తదితరులు పాల్గొన్నారు.
‘దిక్సూచి’కి ఉత్తమ ప్రదర్శన బహుమతి
ఆరిలోవ, ఏప్రిల్ 14: కళాభారతి, కీర్తిశేషులు ఎ.ఎస్. రాజా నాటకోత్సవాల సంస్థల ఆధ్వర్యంలో ఆ సంస్థల అష్టమ వార్షిక రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు 2013 పేరున నాలుగు రోజుల పాటు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఎనిమిది నాటికల్లో జమ్మలమడక రమణ దర్శకత్వంలో నడిమింటి జగ్గారావు రచన దిక్సూచి ఉత్తమ ప్రదర్శన బహుమతి కైవశం చేసుకుంది.
ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని చెంగల్వ పూదండ నాటిక, తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని సంచలనం నాటికలు కైవశం చేసుకున్నాయి. వీరికి వరుసగా రూ.10 వేలు, రూ.8 వేలు, రూ. 6 వేలు, నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. చెంగల్వ పూదండ నాటిక రచయిత శిష్ట్రా చంద్రశేఖర్ ఉత్తమ రచయిత బహుమతిని, దిక్సూచి నాటికకు దర్శకత్వం వహించిన జమ్మలమడక రమణ ఉత్తమ దర్శకత్వ బహుమతిని, ఉత్తమ నటుడు బహుమతిని దిక్సూచి నాటికలోని పాత్రధారి శరత్‌కుమార్, ఉత్తమ నటి బహుమతిని ట్రీట్‌మెంట్ నాటికలోని పాత్రధారి కె. విజయలక్ష్మి, అదే నాటికలో నటించిన ఐ.కె. త్రినాధ్ ఉత్తమ ప్రతి నాయకుడు బహుమతిని, అదే నాటికలోని పాత్రధారి ఎన్. శ్రీను ఉత్తమ హాస్య నటుడు బహుమతిని, దిక్సూచి నాటికలో నటించిన బి. సుధాకర్ ఉత్తమ సహాయ నటుడు బహుమతిని, సంచలనం నాటికలో నటించిన జానకీనాధ్ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ బహుమతిని, పి. బాబూరావు (ట్రీట్‌మెంట్) ఉత్తమ రంగాలంకరణ బహుమతి, చెంగల్వ పూదండకు సంగీతం సమకూర్చిన లీలామోహన్ ఉత్తమ సంగీతం బహుమతిని, మల్లాది గోపాలకృష్ణ (చెంగల్వ పూదండ) ఉత్తమ ఆహార్యం బహుమతులను కైవశం చేసుకున్నారు. వీరికి 1,116 రూపాయల చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అతిధులు ఎఎస్ రాజా ట్రస్ట్ ధర్మకర్త డాక్టర్ మంగళగౌరి, వి.ఎం.డి.ఎ. అధ్యక్షుడు రాజు అందజేశారు. గుణ నిర్ణేతలుగా ఆచార్య బాబీవర్దన్, ఎం.వివి. గోపాలరావు, బి. ధవళేశ్వరరావులు వ్యవహరించారు. కార్యక్రమ నిర్వహణలో బొడ్డేటి జగత్‌రావు, వి. నాంచారయ్య, శ్రీపాద వెంకన్న పాల్గొన్నారు. డాక్టర్ శర్మ, డాక్టర్ వేణు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.