Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బియ్యం ధరలకు రెక్కలు!

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 14 : బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఆరు నెలల వ్యవధిలో కిలో రూ. 10 వరకు ధర పెరిగింది. వరి సేద్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడే ఇలా ఉంటే జూన్ నాటికి క్వింటా ధర రూ. 5 వేలు దాటవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతినెలా బియ్యం ధర పెరుగుతుండడంతో మధ్య తరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో గత రెండేళ్ళుగా ఆయకట్టు పరిధిలో వరి సేద్యం పడకేసింది. దీంతో జిల్లాలో వరి ఉత్పత్తి తగ్గింది. దీని ప్రభావం బియ్యంపై పడింది. జిల్లాలో కూడా ఆశించనంత స్థాయిలో సాగులేకపోవడంతో పోరుగు జిల్లాల నుంచి మరీ దిగుమతి చేస్తున్నారు. గతంలో జిల్లాలోనే ధాన్యం మిగులు ఉండడంతో బియ్యం ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం దిగుబడి తగ్గడంతో గతంలో ఎప్పుడూ లేనంతగా బియ్యం ధరకు రెక్కలొచ్చాయి. మిల్లుల వద్ద కిలో రూ.30 చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా జిల్లాలో అది ఆరంభ శూరత్వమే అయింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ ప్రకటన నీరుగారి పోయింది. ఆరు నెలల క్రితం క్వింటా బియ్యం ధర 3,200 నుంచి 3,500 వరకూ ఉండగా, ప్రస్తుతం రూ. 4,500కు చేరింది. ఆరు నెలల్లోనే రూ. వెయ్యి పెరగడంతో మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. సన్న బియ్యంతో పాటు మిగిలిన బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నాటికి రూ. 5 వేలకు పైన ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధాన్యం దిగుబడి తగ్గడంతో ఏటా ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని ఆయుకట్ట ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో 3.50 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతుంది. ఈ ఖరీఫ్, రబీ సీజన్‌లో నీరు విడుదల చేయకపోవడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. బోర్లు, బావుల కింద సాగు చేసినా నీలం తుపాను కారణంగా సుమారు 50 శాతం మేర పంట నష్టం వాటిల్లింది. అయితే అరకొరగా వచ్చినది దిగుబడిన వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల వద్ద ధాన్యం అయిపోవడంతో బియ్యం ధరలు కొద్ది కొద్దిగా పెంచడం ప్రారంభించారు. సన్నబియ్యం ధరలను పెంచుతున్న వ్యాపారులు వాటితో పాటు దొడ్డు బియ్యం, నూకల ధరలు కూడా పెంచేశారు.

నేటి నుంచి వేటకు విరామం
విశాఖపట్నం, ఏప్రిల్ 14: సముద్ర ఉత్పత్తుల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి చేపటల వేటను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద సంరక్షణలో భాగంగా ఈనెల 15 నుంచి మే 31 వరకూ 45 రోజుల పాటు వేటను నిలిపివేస్తారు. ఈకాలంలో సముద్ర ఉత్పత్తులు గుడ్లుపెట్టి పునరుత్పత్తిని కొనసాగిస్తుంటాయి. ఈకారణంగా సముద్రంలో చేపలవేటను నిషేధిస్తుంటారు. సముద్రం లోనికి వెళ్ళి వేటసాగించే ట్రాలర్లు, మెకనైజ్డ్ బోట్లు, సాధారణ మర పడవలకు నిషేధం వర్తిస్తుంది. తీరం వెంబడి వేట సాగించే సంప్రదాయ పడవలకు నిషేధం నుంచి మినహాయింపు నిచ్చారు. జిల్లాలో సుమారు 600వరకూ మెకనైజ్డ్ బోట్లు, 100 వరకూ ట్రాలర్లు వేట సాగిస్తుంటాయి. ఇక తీరం వెంబడి మరో 600 వరకూ సంప్రదాయ పడవుల్లో మత్స్యకారులు వేట సాగిస్తుంటారు. జిల్లాలో 132 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతం ఉంది. దాదాపు 11 మండల్లో విస్తరించిన తీరప్రాంతంలో 63 మత్స్యకార గ్రామాల్లో 13వేల కుటుంబాలు చేపలవేటనే ఆధారంగా జీవిస్తున్నాయి. సాలీనా జిల్లా నుంచి 70 వేల టన్నుల వరకూ మత్స్య సంపదన లభిస్తుండగా, స్థానిక అవసరాలు తీర్చగా 30 వేల టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతిచేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టైగర్ ఫ్రాన్స్ ఎగుమతులు విశాఖ కేంద్రంగా సాగుతుంటాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ట్యూనా ఫిష్‌కు మంచి గిరాకీ ఉంది. ఈరకం చేపల వేటకు మత్స్యకారులు ప్రాధాన్యత నిస్తారు. అయితే ఇటీవల కాలంలో ట్యూనాఫిష్ వేట ఆశాజకంగా లేదు.
ఇదిలా ఉండగా సముద్ర ఉత్పత్తుల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని చేపలవేటపై నిషేధం కొనసాగిస్తున్నప్పటికీ మత్స్యకార కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మత్స్యకార సంఘాలు విమర్శిస్తున్నాయి. వేట నిషేధం అమల్లో ఉన్న కాలంలో వీరికి అవసరమైన నిత్యావసరాలతో పాటు నగదు సాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. నిషేధ కాలంలో 4500 రూపాయలు ఆర్ధిక సాయం అందజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

‘అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి సాధించాలి’
విశాలాక్షినగర్, ఏప్రిల్ 14: అన్ని రంగాల్లో గిరిజనులు మరింత అభివృద్ధిచెందాల్సి ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ప్లాటినం జూబ్లీహాలులో గిరిజనులు-విద్య అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కంటే కూడా గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని, మరింత అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కలెక్టర్ వి.శేషాద్రి, ఏయు విసీ ఆచార్య జిఎస్‌ఎన్ రాజు, గిరిజన సంఘం గౌరవ అధ్యక్షుడు వి.తిరుపతిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

పోలీసుల అదుపులో మరో సిమ్స్ డైరక్టర్
* నగదు, బంగారం, ఇన్నోవ కారు స్వాధీనం
విశాఖపట్నం, ఏప్రిల్ 14: సిమ్స్ డైరక్టర్లలో మరో డైరక్టర్‌ను ఆదివారం యానాంలో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఖాతాదారులకు మస్కకొట్టి కోట్లాది రూపాయలతో బోర్డు తిప్పేసిన సిమ్స్ సంస్థకు చెందిన ఎం.డి. సురేంద్రగుప్తాను, ఖాతాదారులను మాయ చేసి సిమ్స్‌లో డిపాజిట్లను కట్టించిన డైరక్టర్లు, ఏజెంట్లల్లో కొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పరారీలో ఉన్న మరి కొంతమంది డైరక్టర్ల ఆచూకీపై ప్రత్యేక పోలీసు బృందం నిఘా పెట్టింది. సిమ్స్ బోర్డు తిప్పేసిన నాటి నుండి పరారీలో ఉన్న మరో డైరక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి పాండిచ్ఛేరిలోని యానాంలో ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్యేక పోలీసు బృందం అదివారం అతనిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు ఇన్నోవ కారును, రూ. లక్షా 80వేలు, ఎనిమిది గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎసిపి కె.రాజేంద్రరావు నేతృత్వంలో సిఐ మళ్ళ శేషు బృందం కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి భౌతిక కాయానికి
తలకొరివి పెట్టిన కుమార్తె
విశాఖపట్నం, ఏప్రిల్ 14: కుమారులు లేని ఆ తండ్రికి కన్నకూతురే రుణం తీర్చుకుంది. అరుదైన అల్లిపురం వెంకటేశ్వర మెట్ట ప్రాంతంలో ఆదివారం జరిగింది. అల్లిపురానికి చెందిన దాడి సూర్యనారాయణ (53) రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి కూతురు కల్పన, అల్లుడు దొరబాబు ఉన్నారు. కొంతకాలంగా సూర్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందారు. శనివారం రాత్రి సూర్యనారాయణ కన్నుమూశారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఆయనకు తలకొరివి ఎవరు పెట్టాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. కొడుకులు లేకపోవడంతో కూతురు లక్ష్మి ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఇంటి దగ్గర నుంచి శ్మాశనవాటిక వరకు వెళ్ళింది. దహన సంస్కారాల్లో చేయాల్సిన పనులన్నీ చేసింది. తండ్రి అంత్యక్రియలు బాధ్యతను తీసుకున్న ఆమె సంప్రదాయబద్ధంగా నిర్వహించి కొడుకులేని లోటు తీర్చింది. ఈ సంఘటన స్థానిక చర్చనీయాంశమైంది.

‘అగ్ని ప్రమాద రహిత జిల్లా కోసం సహకారం అవసరం’
విశాఖపట్నం, ఏప్రిల్ 14: అగ్ని ప్రమాదరహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దేందుకు అంతా సహకరించాలని కలెక్టర్ వి.శేషాద్రి కోరారు. నగర పరిధిలోనున్న పలు రకాల భవనాలు, ప్రస్తుతం నిర్మాణంలోనున్న భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు శతశాతం పాటించడం వలనే ఇది సాధ్యమవుతుందన్నారు. జాతీయ అగ్నిమాపక సేవ దినాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్యాబాగ్‌లో అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగర పరిధిలో షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్సులు, హోటళ్ళు, ఆసుపత్రులు, అపార్టుమెంట్లు తదితర అత్యాధునిక భవన నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వీటన్నింటిలోను అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను శతశాతం పాటించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి అంతా సహకరించాలన్నారు. జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి సిహెచ్.కృపావరం, జెసి ప్రవీణ్‌కుమార్, విశాఖ తూర్పు ఏసిపి వెంకటరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిమాపక సేవల శాఖ ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు, బ్రోచర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి
english title: 
rice price

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>