జామి, ఏప్రిల్ 14 : మండలంలోని తెలగాపాలెం గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుఝాము నుండి ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలు ఆలపిస్తూ భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పదలు సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
‘అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం’
గజపతినగరం, ఏప్రిల్ 14 : అగ్ని ప్రమాదాలపై మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ప్రమాదాలు కొంత వరకు నివారించవచ్చని స్థానిక ఫస్ట్ క్లాస్ మున్సిప్ మేజిస్ట్రేట్ కె.సత్యలత అన్నారు. ఆదివారం స్థానిక అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణ మార్గాలపై వారికి అవగాహన లేనందున తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. వారికి కరపత్రాల ద్వారా ఇతర మార్గాల ద్వారా అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. అగ్ని ప్రమాదాలతోపాటు బోర్లలో పిల్లలు పడిపోయినపుడు రక్షించాల్సిన బాధ్యత అగ్నిమాపక అధికారులపై ఉందని సిఐ ఎం.శ్రీనివాసరావు అన్నారు. అందుకు సిబ్బంది శిక్షణ పొందాల్సి ఉందన్నారు. 2011-13 సంవత్సరం వరకూ అగ్ని మాపక కేంద్రం పరిధిలో 76 ప్రమాదాల్లోని 15 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని కాపాడినట్లు అగ్ని మాపక కేంద్రం అధికారి పి.లక్ష్మినారాయణ అన్నారు. కార్యక్రమంలో ఎస్సై టి.కాంతికుమార్ పాల్గొనగా కరపత్రాలను విడుదల చేసిన అనంతరం అగ్ని మాపక ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
చెరకు రైతులకు చెక్కుల పంపిణీ
జామి, ఏప్రిల్ 14 : భీమసింగి సహకార చక్కెర కర్మాగార చెరకు రైతులకు ప్రోత్సాహక చెక్కులను గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అందజేశారు. చెరకు సాగులో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ, సేంద్రియ ఎరువులనే వాడుతూ అధిక దిగుబడులను సాధించిన రైతులను గుర్తించి 9 మంది రైతులను ఎంపిక చేసారు. వీరికి సిడిసి ద్వారా 50 వేల రూపాయలు విలువ గల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసారు. రాబోయే క్రషింగ్ సీజన్‌కు సంబంధించి అధిక చెరకు కర్మాగారానికి లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసుకున్న ప్రణాళికలను ఎమ్మెల్యేకు ఎండి నారాయణరావు తెలియజేసారు. కర్మాగార సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరిక
జామి, ఏప్రిల్ 14 : మండలంలోని తాండ్రంకి గ్రామంలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులు అయిన వీరు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో చిరకాలంగా ఉన్న సమస్య ప్రధాన వీధికి రహదారి ఏర్పాటు తాండ్రంకి, కొత్తూరు మీదుగా బిటి రోడ్డు ఏర్పాటు, మంచినీటికి సంబంధించి రక్షిత మంచి నీటి పథకం మరమ్మతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య ద్వారానే పనులను పూర్తి చేసుకో గలిగామని గ్రామస్తులు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌లో చేరామన్నారు. పార్టీలోకి బీల సూరినాయుడు, వేండ్రపు దేముడు, చలంనాయుడు, కుటుంబాలతో సహా చేరినట్లు ప్రకటించారు.
‘పదవుల కోసం పార్టీ వీడితే గుణపాఠం’
బొబ్బిలి, ఏప్రిల్ 14: పదవుల కోసం పార్టీని వీడిన నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్థానిక శ్రీకళాభారతిలో ఆదివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదవుల కోసం నాయకులు పదవులను వీడ్డం సమంజసమంగా లేదన్నారు. స్వార్థం కోసం కూడా పార్టీని వీడిన వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వారికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యధావిధిగా చేపడుతున్నామన్నారు. వీటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించేందుకు కార్యకర్తలు, నాయకులు మరింత కృషి చేయవల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శంబంగి వెంకటచినప్పలనాయుడు, వాసిరెడ్డి వరదారామారావులు మాట్లాడుతూ ఒకే కుటుంబానికి బొబ్బిలిలో రెండు పదవులున్నప్పటికీ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఎక్కడా అభివృద్ధి చేపట్టలేదని ఆరోపించారు. ఐదేళ్లు మున్సిపల్ చైర్మన్‌గా ఉంటూ ఐదు పర్యాయాలు మాత్రమే సమావేశాలకు హాజరైతే ఏవిధంగా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందన్నారు. సంక్షేమ పథకాలు నిరుపేదలందరికీ అందిస్తామన్నారు. అసత్య ప్రచారాలను నమ్మరాదన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సావు కృష్ణమూర్తినాయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాలరావు, నాయకులు బొద్దల సత్యనారాయణ, డి.సి.ఎం.ఎస్. డైరెక్టర్ గొట్టాపు సూర్యనారాయణ, దమ్మా అప్పారావు, శంకా గౌరీపతి, ఇంటి గోవిందరావు, తెర్లి సత్యారావు, బొత్స రమణమ్మతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు మోటారు సైకిల్స్‌తో ర్యాలీ నిర్వహించారు.
‘ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత’
సీతానగరం, ఏప్రిల్ 14: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన స్పష్టం చేశారు. ఆదివారం కాశాపేట గ్రామంలో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడేది తమ పార్టీ ఒక్కటేనని, ఈ విషయాన్ని ప్రజలంతా గ్రహించాలని కోరారు. దళిత వాడల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైకాపా అధికారంలోకి వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు చలివేంద్రం నిర్వాహకులు మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తెంటు వెంకటప్పలనాయుడు, చినబోగిలి మాజీ సర్పంచ్ సబ్బాన జగన్నాథంలతోపాటు వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
‘శాంతి భద్రతల పరిరక్షణకు కృషి’
పార్వతీపురం, ఏప్రిల్ 14: శాంతి భద్రతలు పరిరక్షణకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్వతీపురం ఎఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్వతీపురం ఎ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎఎస్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ వారం రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని అంశాలపై అవగాహన కోసం స్టడీ చేస్తానన్నారు. పార్వతీపురం ప్రాంతంలోని శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్, ఇళ్లదోపిడీ జరిగిన వివిధ అంశాలపై ప్రత్యేక దృషి సారించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచి ఆ ప్రభుత్వానికి కూడా తమ వంతు సహకారం అందించేందుకు అందించి సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాదిమాబాద్ జిల్లాకు చెందిన తాను అలహాబాద్‌లో బి టెక్ చేసిన అనంతరం ఎన్‌టిపిసి, రైల్వేలలో సివిల్ ఇంజనీరుగా పనిచేశానన్నారు. అలాగే 2010 ఐపి ఎస్ బ్యాచ్‌లో సెలక్టయిన అనంతరం ఎపిపోలీసు అకాడమీ హైదరాబాదులోను, నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో శిక్షణ పొందానన్నారు.