స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు ఎగరవేయడం తప్ప ఫలితం శూన్యం! అరవై అయిదు సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి. మరి పేదరికం మాత్రం తాండవం చేస్తోంది! కనీసం ఒక పూట అయినా ఆహారం లేక పస్తులతో మాడి బతుకు భారంగా వెళ్లబుచ్చే కుటుంబాలు ఎన్ని? గ్రామసీమలు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నది. మంచినీరు దొరక్క మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి అవస్థపడే ప్రత్యక్ష నిదర్శనం కనిపిస్తుంది. స్వాతంత్య్రం కొరకు ప్రాణం ధనం అర్పించి ఫలాన్ని అందించిన మహా పురుషులు ఎంతటి త్యాగధనులో మాటలలో చెప్పేది కాదు! స్వార్ధపరులు రాజకీయ చదరంగంలో విషపావులుగా ఎత్తుకుపైఎత్తు వేస్తూ వాయిదాల పద్ధతి అయిదేళ్లకోసారి అధికార కుర్చీకోసం కుస్తీపడుతూ కుర్చీ ఎక్కిన వారు నిలువు దోపిడీతో ప్రజల రక్తమాంసాన్ని జలగలా పీల్చి వేస్తున్నారు. దేశంలో విచ్చలవిడిగా అవినీతి అడుగడుగునా అంగలు వేస్తున్న నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చింది బొజ్జరాయుళ్లకి కాక మరెవరికి?
-కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
శిక్షాస్మృతి (ఐపిసి)ని తిరగరాయాలి
ఇప్పటి అవినీతి పద్ధతులు, నేరాలకు, అక్రమాలకు, చేసే తప్పుడు పనులకు 50 సంవత్సరాల క్రితం వ్రాయబడిన, పీనల్‌కోడ్ ప్రస్తుతం పనికి రాదు. సెక్షన్లలోని జుల్మానాలు, శిక్షలు ఆనాటికి, అప్పటి రోజులకు సరిపోవచ్చు. కాని ఈరోజుకు ఆ జరిమానాలు, శిక్షలు చాలా తక్కువ. 50 సంవత్సరాల క్రితం రూ.500/-లు జరిమానా వుంటే, అది ఇప్పుడు కనీసము రూ.5,000/-లైనా వుండాలి. అదే విధంగా జైలు శిక్ష కాలాన్ని కూడ పెంచాలి. నేరస్థులు జుల్మానాలకు, జైలు శిక్షలకు భయపడటం లేదు. పోలీసు వ్యవస్థన్నా, కోర్టులన్నా భయం లేదు. మహారాష్టల్రో శాసనసభ్యులే రాజకీయ గూండాలై, పోలీసు అధికారినే బహిరంగంగా కొట్టడం జరిగింది. దేశమంతా సిగ్గుతో తలదించుకునే పని చేశారు. అదే పోలీసుల రక్షణలో బ్రతుకుతున్న రాజకీయ నాయకులు, పోలీసులనే వ్యతిరేకిస్తే, వ్యవస్థ ఏవౌతుందో ఆలోచించాలి. కోర్టుల ఆధీనంలో పోలీసు వ్యవస్థ వుండాలే గాని రాజకీయ నాయకుల చేతుల్లో గాదు. మారిన కాలానుగుణంగా జరిమానాలు, శిక్షలు మారాలి. ఇండియన్ పీనల్ కోడ్ తిరగ వ్రాసి శిక్షలు, జరిమానాలు పెంచాలి. జరిమానాలు, శిక్షలు నేరస్థుడు భయపడే రీతిలో వుండాలి. అలా కానప్పుడు మానభంగాలు, రేప్‌లు, కూనీలు, అమాయకుల ఆస్తుల దోపిడీలు సర్వసాధారణము అవుతాయి. ప్రజల ఆస్తులకు రక్షణ వుండదు. పోలీసులకే రక్షణ లేకుండా పోయే రోజులు రావటం సిగ్గుచేటు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
నిస్వార్థపరులనే గెలిపించాలి
ఎందరో త్యాగధనులు నిస్వార్థపూరితంగా ఎనలేని పోరాటాలు చేసి, జీవితాలను బలిదానం గావించి మనకు స్వాతంత్య్రం తీసుకువచ్చారు. ప్రజలందరూ కుల, మత, వర్ణ, వర్గ బేధాలు లేకుండా సంక్షేమ ఫలాలు సమానంగా అనుభవిస్తూ హాయిగా జీవితం గడిపేందుకు అనువుగా చక్కని రాజ్యాంగాన్ని తయారుచేసి ఇచ్చారు. కాలక్రమేణా త్యాగధనుల కాలం అంతరించి స్వార్థపరులు, దోపిడీదారులు, వ్యాపారస్థులు రాజకీయాలలో ప్రవేశించి దాని స్వరూపం మార్చేసారు. ప్రజల సొమ్మును నిస్సిగ్గుగా స్వాహాచేస్తూ తమ, తమపై ఆధారపడిన భజనపరులను అభివృద్ధి చేసుకోడానికే పదవులు, అధికారం ఉపయోగించుకుంటున్నారు. పేదవాడి జీవన విధానంలో ఏమాత్రం మార్పులేకపోగా రాజకీయ నేతలు వేల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకుంటున్నారు.రాజకీయం స్వార్థపరులకు అడ్డాగామారింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. ప్రజలందరూ మేల్కొని అక్రమదారులను, అవినీతిపరులను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలి. నిస్వార్థపరులనే గెలిపించాలి. ప్రజల సొమ్ము దోచేవారికి ఏ దుర్గతి పడుతుందో ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా నిరూపించాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
పనికిమాలిన చర్చ
పనిలేనివాడు పిల్లి తల గొరిగినట్లుగా ఉంది ఈ మంత్రివర్యుల ఆలోచనా ధోరణి.దేశంలో ఇంక ఏది పరిష్కరించవలసిన సమస్య లేనట్లుగా మంత్రులు ప్రవర్తిస్తున్నారు. ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవన విధానం శారీరక ఆరోగ్యస్థితిని బట్టి ఆడపిల్లలు శృంగారమునకు అర్హులవుతారు. వారి శరీరంలో మార్పు సజముగా జరుగుతూ ఉంటుంది. అంతేకాని దీనికి వయసు నిర్ణయించుట ఇసుక నుండి తైలము తీయుట వంటిది. ఇటువంటి అనాలోచిత చర్యలకు కాలం వెళ్ళబుచ్చేబదులు అవినీతి నిర్మూలనకు, పేదలిక నిర్మూలనకు,ప్రతీ వానికి కూడు గూడు గుడ్డలకు లోటు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటే మంచిది. పనికిమాలిన పనులకు పార్లమెంటు చర్చావేదిక కాకూడదు.
- ఓలేటి నారాయణశాస్ర్తీ, కాకరపర్రు
స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు ఎగరవేయడం తప్ప ఫలితం శూన్యం!
english title:
s
Date:
Wednesday, April 17, 2013