చాపంబుట్టుచు బుట్ట జచ్చుచు మహా చండాల సంసార పా
రావారంబున గూలి తాజెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో
నేపం బొందక యేను నీవనుట తానే జ్ఞానమో శ్రీ మహా
దేవా యట్టి కుతర్కముం గలదె చింతింపంగా సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా! చావడం కోసం పుడ్తూ, పుట్టడం కోసం చస్తూ నీచమైన ఈ సంసారార్ణవంలో కూలి తాను చెడిపోయనందుకు మంచిమనిషిగా తాను అంతరంగంలో అసహ్యపడడానికి బదులుగా నీవే నేను (త్వమేవాహం) అంటే సో2 హం అని అనడం ఏమి జ్ఞానం? శ్రీ మహా దేవా! ఆలోచిస్తే (ఎక్కడైనా ) ఇలాంటి కుతర్కం ఉంటుందా?
శివుని గురించి ఆలోచించకుండా ఎపుడూ ఈ సంసారంలో ఉండే సుఖాలను చూసి వాటికోసం వ్యామోహం చెందుతూ ఇక్కడే పుడ్తూ, చస్తూ ఉండడమంటే అది నిజమైన అజ్ఞానమే. అలాకాక పరమాత్మను తెలుసుకొని ఆ పరమ శివుడికోసం అహర్నిశమూ యాతనపడి శివసాయుజ్యదృష్టిని అలవర్చుకుని శివునికోసం పరితపిస్తే ఆ సుఖమే, అంటే ఆ ఆనందం శాశ్వతమైనది కదా. దానికోసం ప్రతివారు ఆలోచించాలి అని శివభక్తుల భావమని కవి అంటున్నారు.
సర్వేశ్వర శతకములోని పద్యమిది