
నవవసంత ఆగమనము ధర్మ పరిపాలనకు ఆధ్యుడైన శ్రీరాముని నవరాత్రులు ప్రారంభం ఒకేసారి జరుగుతాయి. శిశిరంలో ఆకురాలి లేలేత పల్లవాలు చిగురించేవేళ ‘రామనామామృత మహిమ’ తెలుసుకోవటము, స్మరించుకోవటం ఆనందదాయకమే.
‘కూజంతం రామ రామేతి ....వాల్మీకి కోకిలం’ అని భారతీయులకు అత్యంత ఆదరణీయమైన రామాయణం ప్రారంభంలో చెబుతుంది. కోకిల వంటి వాల్మీకి మహర్షి గళములోనే కాదు ప్రతి భక్తుని హృదయంలో స్థిరమైన వాడే ఆత్మారాముడు. విష్ణుమూర్తి దశావతారాల్లో సంపూర్ణ అవతారంగా గుర్తింపుపొందింది రామావతారం. ‘రామో విగహవాన్ ధర్మః’ అన్నట్లు ధర్మ, సత్య వాక్పరిపాలనకు, క్రమశిక్షణకు, నీతి నియమ పాలనకు ఆలవాలమైనది రామాయణము - రామనామము. అందుకే భారతంలో వ్యాసులవారు అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామాల్లో కూడా రామనామ మహిమ వెల్లడించారు. పార్వతీదేవి విష్ణు సహస్రనామ పారాయణం శక్తిలేనివారికి సూక్ష్మంలో మోక్షం పొందే మార్గం ఏమిటని శివుణ్ణి ప్రార్థిస్తే.....
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే రామనామం ఉపదేశించాడట శివుడు.
రామ శబ్దము పరికించి చూసినట్లైతే ‘ర- అ - మ’ అను మూడు వర్ణాల కలయిక ఈ పదము. ‘ర’అగ్ని బీజాక్షరము- శత్రువును అజ్ఞానమనే చీకట్లను, పాపాలను భస్మం చేసి వెలుగులనిస్తుంది. ‘అ’ అక్షరం ప్రకాశ ప్రతాపాది గుణములు గలదని ఏకాక్షర నిఘంటువులు చెబుతాయి. ‘మ’ వర్ణం ఆనందానికి, లక్ష్మీ సంపదకు, అమ్మవారికి సంకేతం. శత్రు సంహారియై పాపం నాశనం చేసి, అజ్ఞానపు చీకట్లను తొలగించి వెలుతురునివ్వటం ద్వారా సుఖ సంతోషాది సంపదలివ్వగలశక్తిగలది ‘రామ’ శబ్దము. అందుకే దీనిని తారక మంత్రం అంటారు. సంస్కృత శబ్దమంజరిలో తొలి పదం ‘రామ’ శబ్దమే.
రమతే ఇతి రామః రమంతే ఇతి రామః అని వ్యుత్పత్తి అర్థం చెబుతుంది. వసంత ఋతువులో లేత పచ్చని చెట్లతో కూడిన ఆరామాల్లో వాల్మీకి కోకిల రాగాలు రామనామాలై పరవశింపజేస్తాయి.
‘‘రామ నామ పఠన రమణచే వాల్మీకి, పరగ బోయడైన బాపడాయె’ అన్నది తెలుగు పద్యం- రామనామం నిత్యం పఠనవల్ల సకల కష్టాలు తొలగి సౌభాగ్యాలు కల్గిస్తాయని పెద్దల వచనం. అందుకే దశరథుడు పుత్రకామేష్ఠి చేసి సంతానం పొందిన తర్వాతమొదటి శిశువుకు వసిష్ఠ మహర్షి ఆదేశంతోనే ‘రాముడు’ అని పేరు పెట్టాడట. ‘రామనామము నోటరా - తలువాని జన్మము భూమిలో వ్యర్థమురా’ అని రామదాసు కీర్తనలు చెబుతున్నాయి. ఈ శ్రీరాముని ఆరాధించేభక్తులు చైత్రశుద్ధి ప్రతిపద ఉగాది రోజు నవరాత్రులు ప్రారంభసూచకంగా కలశస్థాపన చేస్తారు. పునర్వసు నక్షత్రం, నవమి తేదీనాడు శ్రీరాముని పుట్టినరోజు. ఆ నాడే శ్రీరామునికి సీతతో వైభవంగా కల్యాణం చేయటంతో ముగిస్తారు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ పరమభక్తుడు తులసీదాసు రామచరిత మానస్‌లో భక్తితో పాడుతారు. నిత్య జీవితంలో ఎంతో విలువైన రామనామం తలవటం భారతీయుల సంప్రదాయం. నమస్కారం చేసినపుడు ‘రాం రాం’ అనటం జానపద తెగల అలవాటు. ‘‘అయ్యో రామచంద్రా’’ అనటం, ‘రామ రామ’ అని చెవులు మూసుకోవటం నిత్యం కన్పిస్తుంటాయి, విన్పిస్తుంటాయి. ‘‘తాగరా శ్రీరామ నామామృతం- శ్రీరామ నామాలు శతకోటీ- ఒక్కొక్క పేరే బహుతీపి- బహు ప్రీతి’’ వంటి సినీ గేయాలూ బహుళ ప్రచారంలో ఉన్నాయి.