అప్పుడు విభీషణుడు చిరునవ్వు నవ్వి దనుజనాథుడితో ‘‘రావణా! నిట్టూర్పులే మ్రోగడంగా, ఘన చింతయే గరళంగా, కోపం, చలం కోరలుగా, నిజనఖాలు ముణినికరం కాగా దారుణమైన సీతాకాల సర్పం నిన్ను ఎక్కడికి పోనిస్తుంది? అపకీర్తి అట! పాపం అట? సుఖానికి విపరీతం అట. ఈ చెడు త్రోవ విడిచిపెట్టు’’ అని పలికి అంతతో పోక ప్రహస్తుడితో ఈ కరణి పలికాడు.
‘‘పిడుగులవంటి రామ బాణాలు రెక్కలతో నీ వురమందు నాటి గాయపరిచేనాడు తెలుసుకొంటావు. ఇట్టట్టు మిడిసిపడుతున్నావు. ఇకమీద కరకు మాటలాడినట్లు కాదు. ఈ కుంభకర్ణుడు, ఈ కుంభ నికుంభులు, ఈ మహోదరుడు, ఈ మహాపార్శ్వుడు, ఈ ఇంద్రజిత్తు ఆ రాముణ్ణి యుద్ధంలో జయించేవారా? రాముడు ఎత్తి వచ్చాక మీరు ఎక్కడికి పోతారు? రావణుడికి అండగా, ఆ రాముడికి అడ్డపడుదురుగాక! వినండి. ఇంద్రుడు కాపడ వచ్చినా, దేవతలు రక్షింప ఏతెంచినా ప్రళయకాలాగ్ని రుద్రుడు ప్రోవవచ్చినా, కాల మృత్యువు కావవచ్చినా రావణుణ్ణి సంహరింపక ఆ రామ విభుడు పోవిడుచునా?
దనుజనాథుడిపై విల్లు ఎక్కిపెట్టినప్పుడు మనువంశాధిపుడు మన చేతులకు చిక్కుతాడా? ఫెళ ఫెళ ప్రజ్వలించే అగ్ని పిడికిట అణగుతుందా? ఉప్పొంగు ఉధధి ఉడిసిట అణగుతుందా? పాతాళ స్థలిని పట్టతరమా? గగనభాగాన్ని కట్టగలమా? దిక్కులను త్రెంప వశమా? ధూర్జటి వాలుత్రుంపవచ్చా? సూర్యడు అరచేత ఇమిడి పడి వుంటాడా? ఏమీ ఎరుగని మీతో మాట్లాడడం నిరర్థకం. దనుజాధిపతి మూర్ఖుడు. కామాతురుడు. మిముబోటి అవివేకులైన మంత్రుల దురాలోచనలవల్ల మడియడా? ఈ రావణుడు నా మాట వింటాడా? మీ మాటలు ఆలకించి నాశనం అవుతాడు కాని’’ అని మొగమోటమి లేకుండా వాక్రుచ్చాడు.
అప్పుడు ప్రహస్తుడు విభీషణుడి వివేకపు మాటలు కైకొనక ‘‘విభీషణా! ఇంతవరకు ఉరగులతో పోరి ఓడిపోము. సురలతో పోరాడి ఎప్పుడూ స్రుక్కము. యక్షులని ఎదిరించి ఎన్నడూ తలవంచము. రాక్షసుల చేత ఎన్నడు వెతలు పొందము. నరుడైన ఆ రామ విభుడికి మేము భీతి చెందుతామా? ఓడిపోతామా? ఏ విధంగా నువ్వు ఆ రామాదులని ఎరిగున్నావు? నీ నోట నేడింత వింతలు వింటున్నాము. మన రాక్షసుల లావు అంత తక్కువా?’’అని పలికాడు.
ఇంద్రజిత్తు విభీషణునకు తన లావు ఎరిగించుట
అంత దుర్మదగ్రంధి ఇంద్రజిత్తు- రాముడి తమ్ముడు లక్ష్మణుడి శరాగ్నిలో పడి కాలిపోనుండటంవల్ల ఆగ్రహించాడు. ‘‘విభీషణా! ఏ రూపంగానైనా మనస్సులో నీతిని తలపక నువ్వు భీతిల్లుతున్నావు. రాక్షస మహిమలు వూహింపగా మనలో హీనాతిహీనుడైనా రామలక్ష్మణుల్ని చంపనేరుస్తాడు. ముజ్జగములు పాలించువాడిని ఇంద్రుణ్ణి పట్టి చెరబెట్టునా? అతి వెల్ల యేనుగు చౌదంతి ఐరావతాన్ని పట్టుకొని దాని దంతాలు విరువలేదా? అగ్నిని అదలించాను. అంతకుణ్ణి నొప్పించాను. పాశిని మర్దించాను. శూలిని ఓడించాను. నేను విజృంభిస్తే నా చేత ఈ నరులు చావరా? నువ్వు పరమాణువులైన వారిని కొండలు చేసి పలుకుతున్నావు.
సప్త సమలుద్రాలని కలచి వేయమంటావా? మేరు మందరగిరుల్ని పిండీ గుండా చెయ్యమంటావా? ధరాతలాన్ని ఒక అంగలో దాటమంటావా? నేలను నింగిని ఏకం చేసి మీటమంటావా? జగాలను వంచమంటావా? మున్నీటిలో వనచరతతిని ముంచమంటావా? వేయి ఫణాలతో పుడమి భారాన్ని మోసే సర్పరాజు ఆదిశేషుణ్ణి పట్టి విషం పిండమంటావా? దిగ్గజాల తుండాలు పట్టి ఈడ్చుకొని తెమ్మంటావా? సూర్యచంద్ర బింబాలని నేల రాతునా? ఆజిలో నూతాలచేత వానరుల రక్తములు క్రోలించమంటావా? శరపరంపరలతో మిన్ను కప్పి వేయనా? పెడచేత పట్టి పుడిమిని మింటినీ నలిపి పొడి పొడి చేయమంటావా? దనుజ నాథుడి తమ్ముడివి- పెద్దవాడవు కనుక నిన్ను ఏమీ నిందించక మన్నిస్తున్నాను. మరొకడు ఈ రీతి పలికితే సైరిస్తానా?’’ అని నిష్ఠురోక్తులాడాడు.
-ఇంకాఉంది
అప్పుడు విభీషణుడు చిరునవ్వు నవ్వి దనుజనాథుడితో ‘‘రావణా!
english title:
ranganatha ramayanam
Date:
Wednesday, April 17, 2013