మొహాలీ, ఏప్రిల్ 16: ఐపిఎల్-6 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు షాక్ ఇచ్చింది. మొహాలీలోని సొంత మైదానం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పిసిఎ) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 4 పరుగుల తేడాతో నైట్ రైడర్స్‌ను ఓడించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవెన్ విజయంలో కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ గోనీ (42) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టులో కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ నాన్ స్ట్రైకింగ్ ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (41), మనన్ ఓరా (17), డేవిడ్ హస్సీ (12) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. అయితే పంజాబ్ స్కోరు 99 పరుగుల వద్ద ఉండగా హస్సీతో పాటు అజర్ మహమూద్, గురుకీరత్ సింగ్‌లను వరుసగా పెవిలియన్‌కు చేర్చి సునీల్ నారాయణ్ ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం కొద్దిసేపటికి డేవిడ్ మిల్లర్ (20) సచిత్ర సేనా నాయకే బౌలింగ్‌లో నిష్క్రమించడంతో పంజాబ్ జట్టు 109 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో దూకుడుగా ఆడిన మన్‌ప్రీత్ గోనీ 18 బంతుల్లోనే మూడు సిక్సర్లు మరో నాలుగు ఫోర్ల సహాయంతో 42 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. గోనీ నిష్క్రమణ అనంతరం ప్రవీణ్ కుమార్ (1) జాక్ కాలిస్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా పియూష్ చావ్లా (11), పర్వీందర్ ఆవానా (0) అజేయంగా నిలిచారు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కెప్టెన్ గౌతమ్ గంభీర్ (60), ఇయాన్ మోర్గాన్ (47) రాణించినప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మన్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. యూసుఫ్ పఠాన్ (13), రజత్ భాటియా (16) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే నిష్క్రమించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన నైట్ రైడర్స్‌కు ఇది మూడో పరాజయం.
సునీల్ నారాయణ్ ‘హ్యాట్రిక్’ వృథా
english title:
n
Date:
Wednesday, April 17, 2013