‘భూమి సేకరణ’ బిల్లుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అంగీకారం కుదరడం వ్యవసాయదాలకు కొంత ఊరట కలిగించగల పరిణామం. ‘ప్రపంచీకరణ’ మనదేశంలో వ్యవస్థీకృతమైన తరువాత దాదాపు రెండు శతాబ్దులలో సంభవించిన ప్రధాన వైపరీత్యం పొలాలు పారిశ్రామిక వాటికలుగా మారిపోవడం. గ్రామాలు అదృశ్యమైపోయి ఆ స్థలాలలో కర్మాగారాలు, కాలుష్య కేంద్రాలు అవతరిస్తుండడం, ప్రత్యేక ఆర్థిక మండలాల -సెజ్‌లు- చట్టం వల్ల దాపురించిన మరో అనర్ధం. బ్రిటిష్ దురాక్రమణదారులు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకోసం 1895లో రూపొందించిన భూమి సేకరణ చట్టమే ఇప్పటి వరకూ అమలు జరుగుతుండడం వ్యవసాయంపై ప్రపంచీకరణ శక్తుల దాడిని కొనసాగడానికి దోహదం చేస్తోంది. 1895 నాటి భూమి సేకరణ చట్టం కాలదోషం పట్టిందని ఆ చట్టం వంచనకు ప్రతీక అని అనేకసార్లు సుప్రీంకోర్టు అభిశింసించడం ప్రస్తుతం కొత్త చట్టాన్ని రూపొందడానికి నేపథ్యం! కొత్త బిల్లు చట్టబద్ధమైనట్టయితే వ్యవసాయ భూమిని ప్రభుత్వాలు నిరంకుశంగా లాక్కొనడానికి వీలుండదు. ఒరిస్సాలోని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో ప్రస్తుతం ‘పోస్కో’ సంస్థ ఉక్కు ఫ్యాక్టరీకోసం జరుగుతున్న భూమి సేకరణకోసం వందలాది ఎకరాలలోని తమలపాకు తోటలను పెంచిన రైతుల కళ్ళముందే ప్రభుత్వ అధికార్లు నరికివేశారు. అడ్డు వచ్చిన కృషీవల కుటుంబాలను పోలీసులు లాఠీలతో చితకబాదారు. కొత్త బిల్లు చట్టమైనట్టయితే ఒక గ్రామంలోని ఎనబయి శాతం మంది వ్యవసాయ భూమి యజమానులు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ పల్లెలో ప్రభుత్వం వారు పారిశ్రామిక ప్రయోజనాలకోసం ‘సేకరణ’ కార్యక్రమం మొదలు పెట్టడానికి వీలుంది. రైతులను పరస్పరం విభజించి కొందరిని మభ్యపెట్టి పారిశ్రామికవేత్తలకోసం భూమిని స్వాధీనం చేసుకోగల వీలు ప్రభుత్వాలకు ఉండదు. వ్యవసాయ భూమికున్న వాణిజ్యపు విలువ -మార్కెట్ రేటు-కు నాలుగు రెట్లు గ్రామీణులకు పరిహారంగా చెల్లించినప్పుడు మాత్రమే వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడానికి కొత్త బిల్లు వీలు కల్పిస్తోంది. అందువల్ల పొలాలను పోగొట్టుకునే రైతులకు గతంలోకంటె ఎక్కువ పరిహారం లభించగలదు. ఇదికూడ రైతన్నలకు ఆనందదాయకమైన పరిణామం. పట్టణప్రాంతాలలో సైతం భూమిని కోల్పోయేవారికి మార్కెట్ రేటు కంటె రెండు రెట్లు పరిహారం చెల్లించాలన్నది నూతన నిబంధన.
పారిశ్రామికవేత్తల కోపానికి, ప్రధానంగా ‘పోస్కో’, ‘వేదాంత’ వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ఆగ్రహానికి గురయి పర్యావరణ మంత్రిత్వశాఖ నుండి గ్రామీణ అభివృద్ధి విభాగానికి జయ్‌రామ్ రమేశ్ బదిలీ అయిన తరువాతనే భూమి సేకరణ బిల్లును రూపొందించే కార్యక్రమం ఊపందుకుంది. ‘్భమి సేకరణ’కు ఒక బిల్లును, భూమిని కోలుపోయే వారికి పునరావాసాన్ని ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడానికి మరో బిల్లును అప్పటికే ప్రభుత్వం రూపొందించింది. ఇలా విడివిడిగా బిల్లులున్నందువల్ల రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిని, పునరావాసాన్ని కల్పించకముందే భూములను, లాక్కొనేందుకు వీలుండేది. కానీ జయరామ్ రమేశ్, గ్రామీణ మంత్రిగా, ఈ రెండింటినీ సమీకృతం చేసి ఒకే భూమి సేకరణ ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం బిల్లును రూపొందించగలిగారు. దీనివల్ల భూమిని కోల్పోయే రైతులకు మొదట ప్రత్యామ్నాయ ఉపాధిని, పునరావాసాన్ని కల్పించాలి. తరువాతే భూమిని ప్రభుత్వం కానీ, పారిశ్రామిక వేత్తలు కానీ స్వాధీనం చేసుకోగలరు. ఇలా పునరావాసాన్ని ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడంలో భూమిని స్వాధీనం చేసుకొనే పారిశ్రామిక వాణిజ్య సంస్థలు కూడ బాధ్యత వహించాలన్న నిబంధన కొత్త బిల్లు 2011 నుండి కూలబడి ఉండడానికి ప్రధాన కారణం. ఆ ఏడాది జూలైలో బిల్లును రూపొందించినప్పటినుంచీ పారిశ్రామిక వర్గాలవారు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ వ్యతిరేకత కారణంగానే 2011 సెప్టెంబర్ నుండి బిల్లు పార్లమెంటులో పడి ఉంది. గత మేనెలలో బిల్లును పార్లమెంటరీ ఉపసంఘానికి సమర్పించారు కూడ! ఇప్పుడు అంగీకారం కుదిరిన బిల్లు ముసాయిదా నుండి ఈ నిబంధనను తొలగించారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు. వ్యవసాయ భూమిని కాజేస్తున్న పారిశ్రామిక వేత్తలు పునరావాస ప్రత్యామ్నాయ ఉపాధి బాధ్యతను నిర్వర్తించడం న్యాయం. మార్కెట్ వెలకు నాలుగు రెట్లు పరిహారాన్ని రైతులకు చెల్లించడం బాగుంది కానీ మార్కెట్ వెల ఎంత? అన్నది ఎవరు నిర్ధారిస్తారు? ఎలా??
మార్కెట్ వెలకు ఆరురెట్ల పరిహారాన్ని రైతులకు చెల్లించాలన్నది 2011 జూలైలో రూపొందించిన బిల్లు ముసాయిదాలోని ప్రధాన అంశం. కానీ దీన్ని నాలుగు రెట్లకు కుదించడానికి అన్ని పార్టీల వారు ఆమోదం తెలపడం పారిశ్రామిక సంస్థల, ప్రధానంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ఒత్తడికి నిదర్శనం. ఉత్పాదక వ్యయం కంటె సేవావ్యయం కంటె పదిరెట్లు అవకాశం దొరకని చోట్ల, వంద రెట్లుగా ధరను నిర్ణయించి ఇరవై ఏళ్ళకు పైగా దేశాన్ని దోచిన బహుళ జాతీయ సంస్థలు మార్కెట్ వెలకంటె పదిరెట్లు రైతులకు, భూములను కోల్పోయేవారిని పరిహారంగా చెల్లించినప్పటికీ పాప పరిహారం జరగదు. మహా సంకరమైన ‘బిటి’ పత్తివిత్తనాలను కిలో మూడువేల ఐదువందల రూపాయల ధరకు అనేక ఏళ్ళపాటు ‘మోన్‌సాంటో’ కంపెనీ రైతులకు అంటగట్టింది. న్యాయస్థానాల జోక్యంతో ఆ తరువాత ప్రభుత్వాలు ఈ ధరను సగానికి తగ్గించాయి. ఇప్పు డు కూడ నాలుగు వందల యాబయి గ్రాముల పత్తి విత్తనాల ధర దాదాపు వెయ్యి రూపాయలు. మొబైల్ సెల్యూలార్ ఫోన్ కంపెనీల దోపిడీ మరింత ప్రసిద్ధం. ఈ దోపిడీ సొమ్మంతా ఆయా సంస్థలు తమ దేశాలకు తరలించాయి. బంగారం పరిమాణం నిరంతరం పెరగవచ్చు. భూమి పరిమాణం పెరగదు. 2011లో బిల్లు ముసాయిదా రూపొందగానే భూమి గబ్జా ముఠాలు దేశమంతటా పుట్టుకురావడం మరో వైపరీత్యం. మార్కెట్ వెలకంటె ఆరురెట్ల సొమ్మును కైవసం చేసుకొనే అవకాశం ఉంది కాబట్టి బిల్లు చట్టమయ్యేలోగా రైతులను మభ్యమెట్టి భారీగా భూములను కొనడానికి ఈ ముఠాలు రంగ ప్రవేశం చేశాయి. అందువల్ల సేకరణకు యోగ్యమైన వ్యవసాయ భూములు ఈ ముఠాల ఆధీనంలోకి వచ్చాయి. ఇప్పుడు చెల్లించే పరిహారం మార్కెట్ వెలకంటె నాలుగు రెట్ల స్థాయికి దిగిపోయింది. ఇందులో సగం 2011 నాటి నిజమైన వ్యవసాయదారులకు చెల్లించాలన్న నిబంధన హర్షణీయం. కానీ 2011 తరువాత భూములు కొన్నవారికి వారు రైతులకు చెల్లించిన ధరను, వడ్డీని మాత్రమే చెల్లించి మిగిలిన పరిహరం మొత్తం నిజమైన వ్యవసాయదారులు చెల్లించే విధంగా నిబంధనలను మార్పు చేయాలి. 2011 జూలై నుండి చట్టం అమలులోకి వచ్చే సమయం వరకూ గడిచిన కాలానికి ఈ నిబంధనలను వర్తింప చేయాలి. ప్రతి గ్రామంలోను, వందశాతం భూమి యజమానులు ఒప్పుకున్న తరువాతనే ఆ గ్రామ వ్యవసాయ భూమిని పరిశ్రమలకు మళ్ళించాలన్నది 2011 నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరిక! ఎనబయిశాతం మంది అంగీకారం ఉంటే చాలునన్నది 2011 నాటి ముసాయిదాలోని మాట! అంగీకరించని ఇరవైశాతం మంది రైతుల భూములను బలవంతంగా సేకరించరాదన్న నిబంధన నైనా కొత్త ముసాయిదాలో చేర్చాలి. వ్యవసాయక్షేత్రాలు పారిశ్రామిక వాటికలు గ్రామాలలో పక్కపక్కనే ఉండడానికి వీలు కల్పించాలి..
‘భూమి సేకరణ’ బిల్లుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య అంగీకారం కుదరడం వ్యవసాయదాలకు కొంత ఊరట కలిగించగల పరిణామం.
english title:
r
Date:
Saturday, April 20, 2013