Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అద్వైతం (కథ)

$
0
0

ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఆనందరావుగారి దగ్గరికి ప్రయాణమైనా ఓ చిత్రమైన ఉద్వేగం. ఆయన, ఆయన ఇల్లు.. ఓ పల్లెటూరి ప్రశాంత దేవాలయ దర్శనంలా ఉంటుంది నాకు. ఆయనతో గడుపుతుంటే పసిపిల్లల నిష్కల్మషమైన బోసినవ్వు చూసినట్టు ఉంటుంది. అది లౌకికమే అయినా, ఏదో దైనందిన జీవితానికి వేరుగా అనిపించే మరో స్థాయి అనుభవం. నా భావన ఇదే అయినా ప్రత్యక్షంగా ఆయన, ఆయన తీరు చాలా సామాన్యంగా, అతి మామూలుగానే అనిపిస్తుంది. నాకూడా రామ్మూర్తి ఉన్నాడు. నిజానికి వాడి కూడా ఉన్నది నేను. ఏలూరు నుంచి వాడి కారులోనే బయలుదేరాం. వాడికీ నాలాగే ఆనందరావుగారంటే ఇష్టం. నాకన్నా వాడికే ఆయన దగ్గర చనువు కొంచెం ఎక్కువ.
కిందటిసారీ మేమిద్దరమే వెళ్ళాం... మూడేళ్ళైపోయింది. కావాలనుకుంటే వాడికి గంట ప్రయాణం.. కానీ వాడూ ఈ మూడేళ్ళుగా వెళ్ళలేదట.
మేం వెళ్ళేటప్పటికి ఆనందరావుగారు వరండాలోనే ఉ న్నారు. ‘‘రండి... రండి.. చాలా రోజులకి’’ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు. యథావిధిగా మంచి కాఫీ వచ్చింది. కాఫీ తాగడం పూర్తయ్యేలోపు పరస్పరం పలకరింపులు పూర్తయ్యాయి.
‘‘మానకుండా నువ్వు కథలు రాస్తున్నావు రాజూ.. సంతోషం’’ అన్నారు నా వేపు చూస్తూ. మూడేళ్ళు కలుసుకోకపోయినా, తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. నా ప్రతి కథ గురించీ ఆయనకి తెలుసు.
ఆనందరావుగారూ కథలు రాసేవారు. ఆ యన రాసింది మొత్తం ఆరు కథలే. ఆ కథలన్నీ నాకు బాగా గుర్తే. దరిదాపు ఇరవై ఏళ్ళయింది ఆయన కథ రాసి. ఓ రకంగా కథారచనే మా పరిచయానికి కారణం.
కథలు రాస్తున్న కొత్తలో నేను రాసిన ఓ కథ ఆనందరావుగారికి చూపించాలంటే రామ్మూర్తే నన్ను ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. రామ్మూర్తి నాకన్నా రెండేళ్ళు పెద్దయినా ఇద్దరం ఏలూరు కాలేజీలో కలిసి చదువుకున్నాం.
ఆ రోజు నా కథ గురించి, ఇతర విషయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు నన్ను ఆనందరావుగారికి దగ్గర చేశాయి. పాతికేళ్ళపైగా మా అనుబంధం అలా సాగుతోంది. ఎక్కువగా మంచి గురించే మాట్లాడ్డం, దానికి భిన్నంగా చెప్పటం, తప్పనిసరైతే వీలున్నంత మృదువుగా చెప్పటం- ఆయనలో నాకు నచ్చిన విషయం. అందుకే ఆయనతో గడిపే సమయం హాయిగా ఉంటుంది. ఏ మాత్రం అలజడిగా ఉండదు.
ఆనందరావుగారు కథలు రాయటం మానేసినా, రచనని వదల్లేదు. ఈ ఇరవై ఏళ్లుగా... అచ్చుల్లో పేజీ, రెండు పేజీలలో వివిధ పత్రికల్లో ఆయన రాస్తున్న వాటికి ఏ పేరు నిర్ణయించాలో నాకు అర్థం కాలేదు.
ఆయనకో గమ్మతె్తైన ఒడుపు చిక్కింది. అవి పూర్తిగా వ్యాసాలు కావు. విమర్శలూ కావు.. పరిచయాలు కావు.. అన్నింటి కలగలుపు. కొన్ని ఆయన అనుభవాలు...మరికొన్ని ఇతరుల అనుభవాలు. కొన్ని ఆయన చదివినవి.. మరికొన్ని ఇతరులు చెప్పగా విన్నవి. కొన్ని ఊహలు.. కొన్ని అందమైన కలల్లాంటి భావనలు.. వెరసి.. స్నేహంగా, ఇష్టంగా ఓ వ్యక్తి నిస్సంకోచంగా మనతో పంచుకునే అనుభూతులు.. అవి నాకు కొత్తగా, చాలా ఇష్టంగా ఉంటున్నాయి. నాలాగే ఇంకా చాలామందికి అవి అలాగే అనిపిస్తున్నాయని- వాళ్ళే చెప్పగా విన్నాను.
తన రచనల గురించి ఆనందరావుగారు మాట్లాట్టం చాలా తక్కువ. ఎక్కువ ఆయన మాట్లాడేది రకరకాల మనుషుల గురించి. వాళ్ళకి తారసపడిన చిత్రమైన పరిస్థితులు... అప్పటి వారి ప్రవర్తన. మానవ నైజంలోని అనంత వైచిత్రి.. ఇవే ఆయనకి అభిమానమైన విషయాలు.
మాతో మాట్లాడుతున్న ఆయన మధ్యలో లేచి లోపలికి వెళ్ళి కొన్ని పుస్తకాలు తెచ్చారు.
‘‘ఇవి.. నువ్వు చదివితే బావుంటుంది... కూడా తీసికెళ్ళు, ఇవ్వటం మరిచిపోతానని ఇప్పుడే తెచ్చా’’ అన్నారు.
‘‘లోపల ఇంకా చాలా ఉన్నాయి. నీకు నచ్చినవి నువ్వూ తీసికెళ్ళరా...’’ అన్నారు రామ్మూర్తితో.
సాధారణంగా ఆ ఊరు దాటి ఎక్కడికీ వెళ్ళరు ఆయన. ఆ ఇల్లు దాటి వెళ్ళటమూ తక్కువే. ఎప్పుడైనా వారానికో, పది రోజులకో వెడితే తన పొలానికి, తోటకి వెడతారు.
అయినా ఆయనకి అందే సమాచారం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల నుంచి రకరకాల మిత్రులు ఫోన్‌లో మాట్లాడుతారు. కొంతమంది తరచుగా వచ్చే వాళ్ళున్నారు. ఆయనకి నచ్చినవి, ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికే రావటం విశేషం.
‘‘ఎప్పుడూ మేం రావటమేనా? నువ్వూ కదిలి ఈ ఊరు దాటి రావచ్చుగా!’’ అని రామ్మూర్తి కొంచెం నిష్ఠూరంగా ఒకటి రెండుసార్లు అనకపోలేదు.
‘‘రావచ్చురా... రాకూడదని కాదు.. ఎందుకో ఊరు కదలాలనిపించదు...’ అంటారే తప్ప ఆ విషయంగా మరే చర్చకి తావివ్వలేదు. వీలున్నంతవరకూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళుండాలన్నది ఏదో ఆయనలో బలంగా ఉంది.
ఇలా ఎప్పుడేనా బైటికి వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనానికి ముందు వాడికి నచ్చింది పుచ్చుకునే సరదా రామ్మూర్తికి ఉంది. ఆనందరావుగారి దగ్గర అభ్యంతరాలు చాలా తక్కువ. అందువల్ల రామ్మూర్తి తనకి కావాల్సింది చక్కగా తీసుకున్నాడు. తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాం. భోజనాల దగ్గర ఆనందరావుగారి టేబుల్ మేనర్స్, భోజనాన్ని రుచిగా తినేలా కాకుండా, రుచిని తృప్తిగా ఆస్వాదించేలా ఉంటుంది. బరువైన భోజనంతో గెస్ట్ రూంలో పడుకున్న మేం నిద్దర లేచేటప్పటికి సాయంత్రపు చల్లదనం ఎంతో హాయిగా ఉంది.
ఆనందరావుగారి ఇంటి చుట్టూ రెండెకరాల విశాల ఆవరణ ఉంది. ఆ ఆవరణలో తూర్పు వైపు మొక్కల దగ్గరున్న ఆయన దగ్గరకెళ్ళాం.
‘‘ఒంటరిగా ఏం చేస్తున్నావురా? మమ్మల్ని పిలవలేకపోయావా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘పడుకున్నారుగా.. అయినా నేను ఒంటరిగా ఎక్కడున్నాను?’’ అన్నారు.
చుట్టూ చూశాం.. ఎవరూ లేరు.
‘‘ఈ చెట్లతో కబుర్లు చెపుతున్నాను..’’ అన్నారు మా అయోమయం చూసి.
‘‘చెట్లతో కబుర్లేవిట్రా... వేళాకోళమా?’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘వేలాకోళం కాదురా.. నిజమే.. మొక్కలకి ప్రాణం ఉంది.. జీవం ఉంది. ఆ గుర్తింపుతో ప్రవర్తిస్తుంటే నాకు అవి మాట్లాడుతున్నట్టు... నా మాటలకి బదులు పలుకుతున్నట్టు అనిపిస్తుంది...’’ అన్నారు నవ్వుతూ.
‘‘చాదస్తమో... భ్రమో... నాకు బావుంది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. నువ్వూ ప్రయత్నించి చూడు... బావుంటే సరే... లేదంటే ఒదిలేయ్...’’ అన్నారు అదే నవ్వుతో.
ఇనే్నళ్ళుగా ఆయన ఆ పరిసరాల్లోనే ఉంటూ సంతృప్తిగానే ఉన్నారు. ఆయనలో ఏ ఆరాటం కనపడదు. తన పద్ధతే గొప్పదన్న భావనగానీ, వ్యక్తీకరణ గానీ మచ్చుకైనా లేవు.
‘‘ఇదే కాదు రామ్మూర్తి.. నా అనుభవంలో చాలా విషయాలు భ్రమో, నిజమో తెలియనివి చాలా ఉన్నాయి. తెలుసుకోవటం అంత తేలిక్కాదు. అది అంత అవసరమనీ నాకు అనిపించలేదు. ‘సత్యశోధన’ అని మనవాళ్ళు చాలామంది అంటారు. మన జీవితం చుట్టూ అల్లుకుని ఉన్న వాటిని సరిగా గుర్తించి పాలుపంచుకుంటే చాలనిపిస్తుంది నాకు..’’ అన్నారు. ఆ తర్వాత ఆయన మాటల్లో ఆ గుర్తింపుకి దగ్గరగా ఉన్న కొన్ని విషయాల ప్రస్తావన వచ్చింది.
వాటి గురించి చెపుతున్నపుడు అవేవో నిగూఢమైనవి, ప్రత్యేకమైనవి అన్న భావన ఆయనలో లేదు. ఆ మాటలు చాలా సామాన్యమైన వ్యక్తుల గురించి.. సంఘటనల గురించే.. తేడా అల్లా మనం గుర్తించటంలోనే. అవసరాన్ని మించిన ఆశ, ఆరాటం మనని ఎంతగా బాధపెడుతున్నాయో, మనకి అందుతున్న ఆనందాన్ని పట్టించుకోకపోవటం ఎంత అసంతృప్తి కలిగిస్తోందో చెపుతున్నారు.
ఈ ఇరవై ఏళ్ళుగా ఆనందరావుగారు రాస్తున్నవి వేరే వేరే అంశాలు అనిపించినా, అంతస్సూత్రంగా ఓ ధార వుంది. జీవన నాణ్యతకి సంబంధించిన వౌలిక ధార అది.
నెలకి పదివేలు ఆదాయం ఉన్న వ్యక్తికి డబ్బు సరిపోదు. మూడులక్షల ఆదాయం ఉన్న వ్యక్తికీ సరిపోదు. ఎవరికీ దేనికి పది నిముషాలు తీరిక లేదు. మళ్లీ గంటలు గంటలు టీవీ ముందో, లాప్‌టాప్‌తోనో గడుపుతారు. జీవితం గడుపుకోవటానికి కష్టపడేవాళ్ళం. కష్టపడటమే జీవితం అన్న నూతన సూత్రాలు, ఆర్థికమంత్రాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వ్యక్తుల మధ్య ఇరుకుదనం పెరుగుతోంది. ఏ విషయం ప్రస్తావనకి వచ్చినా ‘ఈ రోజుల్లో ఇది మామూలే. మనం చెయ్యగలిగిందేమీ లేదు’ అన్న ఉదాసీనత. వీటినే సామాన్య సంఘటనల రూపంలో, వ్యక్తుల నడవడిగా రాస్తున్నారు ఆనందరావుగారు. ఉన్నంతలో జీవితాన్ని మరింత ఆనందంగా మార్చుకునే అవకాశాల గురించి అందరికీ గుర్తింపు పెరగాలన్నది ఆయన తపన.
రామూర్తి, ఆనందరావుగారు కలిసి చదువుకున్నారు. చాలా దగ్గర స్నేహితులు. స్కూలు చదువు అయ్యేవరకు ఒకే పరిసరాల్లో పెరిగారు. అయినా ఇద్దరి పద్ధతుల్లో ఎంతో తేడా.
ఆనందరావుగారిలా ఆ పల్లెటూళ్ళో ఉండటం తనికి ఇష్టం లేదని ఏలూరులో స్థిరపడ్డాడు రామ్మూర్తి. డబ్బుకి లోటులేదు. పిల్లలు బాగానే స్థిరపడ్డారు. అయినా ఎందుకో కిందటిసారి నేను వచ్చినప్పటికన్నా బాగా చిరాగ్గా వున్నాడు. ఆ విషయం ఆనందరావుగారి దృష్టిలో పడింది. తెల్లారి లేచాక కాస్సేపు ఇంటిముందు మొక్కల మధ్య తిరిగాం.
టిఫిన్ చేసి ఇంక మేం బైలుదేరడమే. టిఫిన్ చేస్తుండగా.. ‘‘ఎందుకురా.. మరీ అలా ఉన్నావు?’’ అనడిగారు రామ్మూర్తిని ఆనందరావుగారు.
‘‘ఎందుకేమిట్రా..? నీకు అన్నీ బాగున్నాయి. అందరూ అంతేననుకుంటావు. జీవితం ఏం బావుందిరా..? కడుపున పుట్టిన ముగ్గురిలో ఒకడూ నా మాట వినడు. వాళ్ళకి ఏది తోస్తే అదే. వాళ్ళు తలోచోట. నేను, నా పెళ్ళాం ఇరవై నాలుగ్గంటలూ ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకుంటూ ఏలూరులో.. పెద్దా చిన్నా అన్న గౌరవం, తల్లిదండ్రుల మాట వినాలన్న జ్ఞానం, చచ్చేకాలంలోనైనా మమ్మల్ని పట్టించుకోవాలన్న జాలీ లేవు వాళ్ళకి... ఇదీ ఒక బతుకే..’’ అన్నాడు.
రామ్మూర్తి ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉన్నారు. మూడోవాడు జలంధర్‌లో ఉన్నాడు. వాళ్ళతోటి, వాళ్ళ పిల్లలతోటి కలిసుండే జీవితం కరువైందన్న అసంతృప్తి. వాళ్ళు రాలేరు, వీళ్ళు వెళ్ళలేరు. చాలా కుటుంబాల్లో, చాలామంది పెద్దవయసు వాళ్ళ జీవితాల్లో ఉన్న సమస్యే. కొంతవరకూ ఆ బాధ నాకూ ఉంది.
అంతా విన్నా ఆనందరావుగారు ‘‘మనం చదువుకున్న రోజులు, నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు గుర్తున్నాయిరా నీకు?’’ అని చాలా నెమ్మదిగానే అడిగారు.
అప్పటి సంగతులు నాకూ తెలుసు. రామ్మూర్తి ఒక్కడే సంతానం. ఇష్టారాజ్యంగా పెరిగాడు. తల్లీ తండ్రీ అంటే ఎంతో ప్రేమ. అస్తమానం వాళ్ళ గురించే మాట్లాడేవాడు. అయినా తన చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, పెళ్లి విషయంలో తల్లిదండ్రుల మాట ఒక్కటీ లెక్కచెయ్యలేదు. డబ్బు సంపాదన మీద, ఆర్థికంగా పైకి రావటం మీద వాడి ఆరాటమే వాడికి ముఖ్యంగా తోచింది. ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్పి బాధపడేవాడు. తల్లీ తండ్రికి కావాల్సినట్టు ఉండలేకపోయానన్న బాధ ఉండేది.
వాడన్న మాటేమిటి! కొంతవరకూ నేనూ అంతే. కథలు, సినిమాలంటూ అర్ధరాత్రి వరకూ తిరిగేవాణ్ణి. ‘తొందరగా ఇంటికి రారా.. పొద్దునే్న లేవరా...’ అని అమ్మా, నాన్న ఎంత మొత్తుకున్నా ఒక్కనాడూ వినలేదు.
‘‘అప్పటి మన పద్ధతులు మనకి ముఖ్యం అనిపించాయి. ఇప్పుడు మాత్రం పిల్లలదే తప్పంటాం. సరే, ఇద్దరు కొడుకులు విదేశాల్లో వున్నారు. నువ్వు, మీ ఆవిడా అక్కడికి వెళ్ళి సౌకర్యంగా ఉండలేరు. జలంధర్ వెళ్ళొచ్చుగా.. వెళ్ళవు. వాడే సెలవు పెట్టి పెళ్లాం పిల్లలతో రావాలి. అన్నీ నీకు సౌకర్యంగా జరగాలి. అలా జరగకపోవటం పిల్లల తప్పు.. అంతేనా?’’ అన్నారు ఆనందరావుగారు. రామ్మూర్తి సమాధానం చెప్పలేదు. మరి కాస్సేపటికి మేం ప్రయాణమయ్యాం.
బయలుదేరుతున్న మా కారు దగ్గర నిలబడి ‘‘రావటానికి వీలు కుదరాలనుకో. వీలు కుదిరిన వెంటనే వస్తూండు. నువ్వొస్తే వీడూ వస్తాడు’’ అన్నారు రామ్మూర్తి వైపు చూస్తూ. ఆయన మాటలో, చూపులో, చేతలో ఆప్యాయత. మా కారు కనుమరుగయ్యేవరకూ బయట నిలబడిన ఆయన చెయ్యి ఊపుతూనే ఉన్నారు.
రామ్మూర్తి ముఖం తేటపడింది. మేం ఓ పదిమైళ్ళు ప్రయాణం చేశాక, రామ్మూర్తి నా వైపు చూస్తూ.. ‘‘నాకు ఎప్పుడూ అంతగా అర్థం కాదు గానీ, వాడిలో ఏదో గొప్పతనం వుంది రాజూ. వాడి మాటల్లో బలం, మనం పెద్దచిక్కులని అనుకున్నా వాటిని కూడా తేలిగ్గా విడగొట్టేస్తుంది’’ అన్నాడు.
నాక్కూడా తేలిగ్గానే ఉంది. జీవితం మెరుగుపట్టానికి వలసవెళ్ళటం ఎప్పట్నించో వున్నదే. పిల్లల్నే తప్పుపట్టటం ఎక్కువైపోతోంది. ప్రతిమాటకీ ముందు వాళ్ళకి తల్లిదండ్రులంటే ప్రేమ లేదనుకోటం అలవాటైపోయింది. వాళ్ళు మనకి దగ్గరగా లేరన్నదే మన బాధ. కానీ వాళ్ళకి చాలా వాటినుంచి దూరంగా ఉన్న బాధ వుంది. విశ్రాంతి నుంచి, కన్నవాళ్ళనుంచి, పుట్టి పెరిగిన పరిసరాల నుంచి, స్నేహితుల నుంచీ... ఇలా సంపాదన కోసం చాలావాటికి దూరంగా బతుకుతున్నారు. పరాయివాళ్ళ గురించే కాదు.. మన పిల్లల గురించి కూడా. మనం ఒకటి, వాళ్ళొకటిగా ఆలోచిస్తున్నాం. పిల్లల సంపాదన అండతో ఎంతో ధైర్యం. విశ్రాంతి లభించిన పెద్దవాళ్ళు చాలామందే వున్నారు. కానీ, ఆ విషయాన్ని అంతగా గుర్తించటం లేదు మనం.
తప్పు ఒకరిదే కాదు. అవధులు దాటిన జీవితానిది. ఎక్కడైనా, ఎవరైనా ఈ సృష్టిక్రమంలో కొంచెం అటూ ఇటూగా అందరం సమానమే. వీలున్నంతవరకూ దగ్గరగా బతకటమే... అదే ఆనందరావు గారి అంతస్సారం.

వి.రాజా రామమోహన రావు,
3-1-73/1/ఎ,
రాంశంకర్ నగర్, రామంతాపూర్,
హైదరాబాద్- 500 013.

ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఆనందరావుగారి దగ్గరికి ప్రయాణమైనా ఓ చిత్రమైన ఉద్వేగం.
english title: 
a
author: 
- వి.రాజా రామమోహన రావు

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>