‘వ్యక్తిత్వ వికాసం’ అనేది మనుషుల మనసులకు చెందిన ఒక లోతైన అధ్యయన పరిశీలన. ఇది మన ‘మైండ్ పవర్’ మీద ఆధారపడి ఉంటుంది. మానసికమైన ఎదుగుదల ఇందులో క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆలోచనా సరళిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి- దీని మూలాలు మనకు బాల్యంలో దొరుకుతాయి. జన్మతః వచ్చే శారీరక ఎదుగుదలతోపాటు, అవయవాల పొందిక ఇక్కడ ముఖ్య భూమికను పోషిస్తుంది. దీనిలో ఒక ప్రధాన భాగమే బుద్ధి అనే మన వివేచనా శక్తి. ఈ వికాసం బాల్య దశలో సక్రమంగా అమలు జరిగితే భవిష్యత్తు అంతా పూలబాట అవుతుంది.
పుట్టుకతోనే ప్రతి జీవికి కొద్దో గొప్పో తెలివితేటలు సహజంగానే సంక్రమిస్తాయి. జన్యుపరమైన లోపాలను అధిగమిస్తే బాల్యానికి మించిన స్వేచ్ఛా పూరితమైన, అందమైన జీవితానికి మించిన ఆనందం మరెక్కడా కనిపించదు. ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల పాఠశాలకు బందీగా అవుతున్న నేటి పిల్లల విషయంలో ఇది కొంత శాపగ్రస్త జీవితంగానే భావించాలి. భవిష్యత్తును సుందరవనంగా తీర్చిదిద్దుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరం. విద్యార్థి దశలోనే జిజ్ఞాసను రేకెత్తించే ప్రేరణ మన పరిసరాలు, వాతావరణ పరిస్థితులు నుంచే ఊపిరి పోసుకొని అవగాహనా స్థాయిని ఏర్పరచుకుంటాయి. మనోవిశే్లషణకు చెందిన అభ్యాసన ప్రక్రియ ఈ ప్రాథమిక దశనుండే మొదలవుతుంది. ‘చిల్డ్రెన్ సైకాలజీ’ విషయానికొస్తే ముందుగా మనం మననం చేసుకోవాల్సిన మనస్తత్వ శాస్తవ్రేత్త ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’. మానసిక వయస్సుకు, శారీరక ఎదుగుదలకు మధ్య ఒక పరిపక్వ దశ వచ్చేవరకూ వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ ఫ్రాయిడ్ తన పరిశోధనలో భాగంగా ఒడిసి పట్టుకున్నాడు. వ్యక్తిత్వ జీవితానికి సంబంధించి అనేక ముద్రలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన మీద పడుతుంటాయి. వాటి ప్రభావంలో పడి జీవితంలో అనుకరించే వారు కోకొల్లలు. అందులో లోటుపాట్లను, గుణదోషాలను సక్రమ రీతిలో సంగ్రహించి మన భావాలకు అనుగుణంగా భవిష్యత్తులో మలచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే వ్యక్తిలో అంతర్లీనమైన ప్రతిభా పాటవాలు నిద్రాణస్థితి నుంచి మేల్కొని ఆలోచనలు సవ్య దిశలో ప్రయాణించడం మొదలవుతుంది. మానసికమైన ఈ ఎదుగుదల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది.
విద్య ఆవశ్యకత..
చదువు విషయానికొస్తే జ్ఞాన సముపార్జన గుర్తుకొస్తుంది. ‘విద్యలేనివాడు వింత పశువు’ అన్న నానుడిని గుర్తుకు తెచ్చుకుంటే దీని ఆవశ్యకత మనకు అవగతమవుతుంది. విశ్వకవి రవీంద్రానాథ్ ఠాగూర్ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో చెట్ల నీడన జరిగే విద్యాబోధనకీ, ఆధునిక కాంక్రీటు భవనాల గది గోడల మధ్య సాగే క్రమశిక్షణ విధానానికి పోల్చి చూస్తే చాలా అంతరం రూపుకడుతుంది. విద్య వ్యాపారమయమైన ఇప్పటి సామాజిక వ్యవస్థలో బుద్ధి వికసించడానికీ, మానసికంగా ఎదగడానికీ అంతర్గతమైన సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ స్థితికి దిగజార్చిన పరిస్థితులను అధ్యయనం చేస్తే సరికొత్త ప్రతికూల అంశాలు వాటంతటవే బయటపడతాయి. మన వ్యక్తిగత అభిరుచులను బట్టి కూడా పరిస్థితులు ఆధారపడి ఉంటాయి.
నానాటికీ యాంత్రికమైపోతున్న ఉరుకులు, పరుగుల జీవితంలో మాతృభాష ఉనికిని కోల్పోతున్న పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. వీటికి కారణాలేవైనా, తృప్తి లుప్తమైపోతున్న సందర్భాలు మన అవగాహనకు అందక, వ్యక్తిత్వ వికాస దశ స్థాయి వర్తమానంలో క్షీణించిపోతున్నదనే చెప్పాలి. ఈ క్షీణదశ నుంచి వ్యక్తిత్వ ఎదుగుదల దిశగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకోవాలి.
వ్యక్తిగత ఎదుగుదలకు కొన్ని జాగ్రత్తలు..
శైశవ దశలో అనుకరణ ప్రధానాస్తమ్రైతే, కౌమార దశలో స్వీయ పరిశీలనతోపాటు వ్యక్తిగత ప్రేరణ, పునశ్చరణ, విధేయత వికాస దశకు కొత్త ద్వారాలు తెరుస్తాయి. ఇది కీలక పరిణామాలకు దారితీసే ప్రధాన సందర్భం. టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా జాగరూకతతో, మెలకువతో వ్యవహరిస్తూ పిల్లలతో సన్నిహితంగా, సున్నితంగా మెలగవలసిన తరుణం. జ్ఞానార్జనకు ఇదే కీలకమైన మెట్టు. దీనిని సృజనాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలిగితే మానసికమైన ఉన్నత ఎదుగుదల క్రమపద్ధతిలో జరిగి వ్యక్తిగత వికాసానికి దిశా నిర్దేశనం చేసినట్టవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల సమస్యలనైనా తనకు అనువుగా మార్చుకునే స్థితికి విద్యార్థిని సమాయత్తం చెయ్యాలి.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అనేక ప్రతికూల పరిణామాలు విద్యార్థినీ విద్యార్థుల ఎదుగుదలకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఆధునిక పాశ్చాత్య పోకడలు విద్యార్థుల ఆలోచనా సరళిలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాయి. వీటిపట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ‘సెక్స్ ఎడ్యుకేషన్’ పరంగా విద్యార్థుల అవగాహనా స్థాయిని పెంచడంతోపాటు, ఇంటర్‌నెట్, సైబర్‌కేఫ్‌లు ప్రదర్శించే కొన్ని వికృత పైశాచిక సైట్ల విషయంలో అందరూ మెలకువతో వ్యవహరించాల్సి వుంది. ఈ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వేగంలో ఇంటర్నెట్ వినియోగం ఉత్తమ ఫలితాలతోపాటు దుష్పరిణామాలను కూడా వేగవంతం చేస్తూ వస్తోంది. పిల్లలు మానసికంగా ఎదిగే క్రమంలో సమాజం చుట్టూ అల్లుకుంటున్న నీలినీడల స్థితిగతుల పర్యవసానాలను వాళ్ళ స్థాయికి అర్థమయ్యేలాగా చూచాయగా వివరణాత్మకంగా బోధించి, తగు జాగ్రత్తలను పాటించే స్థాయికి మలచగలగాలి.
ఇక వ్యక్తిగతమైన విషయానికొస్తే ఈ కౌమార దశలో ఉండే పోటీతత్వం, వేగవంతం, ఆత్మన్యూనతా భావాలు, అసూయాద్వేషాలు బీజప్రాయంలోనే తొలగించి తగినంత జ్ఞానచికిత్స చెయ్యాలి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వీరగాథలు, నీతిశతకాలు, పాటలు, పద్యాలు, సామెతలు, బాల సాహిత్య రచనల పట్ల మక్కువను చూపించే విధంగా పఠనాభిలాషను పాఠ్యాంశాల బోధనలో భాగంగా విధిగా చేర్చాలి. దృశ్య, శ్రవ్య కళలపట్ల ప్రాధాన్యతను పెంపొందించి పిల్లలు ఆచరించేలా ప్రోత్సహించాలి. వ్యాసరచన, వక్తృత్వ అంశాలతోపాటు క్రీడలపట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించాలి. వీటితోపాటు పోషకాహర విలువల పట్ల ఆసక్తిని కలిగించేలాగా కృషి చెయ్యాలి. ఈ రకమైన ప్రేరణలవల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు ధైర్యసాహసాలు, త్యాగం, దేశభక్తి, సేవానిరతి భావాలు చోటుచేసుకొని వాళ్ళ భవిష్యత్తుని ఉజ్జ్వలంగా, ఉన్నతంగా, ఆశాజనకంగా తీర్చిదిద్దినవాళ్ళమవుతాం!
‘వ్యక్తిత్వ వికాసం’ అనేది మనుషుల మనసులకు చెందిన ఒక లోతైన అధ్యయన పరిశీలన.
english title:
gold
Date:
Saturday, April 20, 2013