గత డిసెంబర్‌లో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక యువతి సామూహిక అత్యాచారానికి, హత్యకు గురవడంతో దేశవ్యాప్తంగా ఆవేదన, ఆగ్రహం, ఆందోళన పెల్లుబికింది. దానితో మహిళల రక్షణపట్ల ప్రభుత్వం స్పందించి, జస్టిస్ వర్మ నేత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది.
మహిళల రక్షణపట్ల దృష్టి కేంద్రీకరించిన దేశం ఇప్పుడు బాలల రక్షణ గురించి పట్టించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహిళలతోపాటు వివక్షతకు, అన్యాయానికి గురవుతున్న బాలలపట్ల దృష్టి కేంద్రీకరించవలసిన పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ముఖ్యంగా చదువుకోవలసిన వయస్సులో కర్మగారాల్లో, క్వారీలలో శారీరక పనులు చేయవలసి రావడం, అక్రమరవాణాకు గురికావడం విచారకరం.
14సంవత్సరాలలోపు బాలలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలన్న రాజ్యంగ లక్ష్య సాధన ఆమడదూరంలో ఉండిపోతున్నది. దేశంలో ప్రతి సంవత్సరం 40వేల మంది బాలలు కష్టతరమైన శారీరక శ్రమ అవసరమైన పనులలో బాల కార్మికులుగా మారుతున్నారు. ఇటీవలనే ఒక బంగారు తయారుదారివద్ద పనిచేస్తూ విషవాయువులు పీల్చి అస్వస్థతకు గురైన ఏడుగురు బాలలను కాపాడిన ఉదంతానికి సంబంధించిన వార్త చూశాము. ఇటువంటి సంఘటనలు దేశంలో తరచూ జరుగుతున్నాయి. 14 సంవత్సరాల లోపు వయస్సుగల బాలలను పనులలో నియమించుకోవడాన్ని చట్ట వ్యతిరేకం, శిక్షార్హం చేయడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం ఉద్దేశించిన బిల్లు ఒకటి ప్రస్తుతం పార్లమెంటు ముందున్నది. అయితే ఈ బిల్లులో అక్రమ రవాణాకు గురవుతున్న బాలల గురించిన ప్రస్తావన లేదు. ప్రమాదకరమైన పనులు చేస్తున్న బాలలను కాపాడినప్పుడు, వారికి పునరావాసం కల్పించే నిబంధనలు లేనే లేవు. ఈ రెండు అంశాలను సహితం పరిగణనలోకి తీసుకొని ఈ బిల్లును మరింత ప్రయో జనకరంగా, బాలల సంక్షేమానికి దోహదపడే విధంగా రూపొందింపవలసి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాలకార్మికులు భారతదేశంలో ఉన్నారు. వివిధ పరిశ్రమలలో 1.26 కోట్ల మంది బాలలు పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం గనులు, క్వారీలు, కర్మాగారాలు, అక్రమ రవాణా, రెస్టారెంట్లు, ఎంబ్రాయిడరీ వంటి పరిశ్రమలు, చివరకు ఇండ్లలో పనికోసం 44వేల మంది బాలలు వస్తున్నారు. అందుకు దోహదపడుతున్న వివిధ పక్రియలపట్ల కఠినమైన ఆంక్షలు విధించడంతోపాటు, జరిమానాలను సహితం నూతన బిల్లు ప్రతిపాదిస్తున్నది.
ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా గుర్తింపు పొందుతున్న భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడం కోసం, పనులు చేస్తున్న బాలలను చదువుకొనే విధంగా పాఠశాలల్లో చేర్పించడం కోసం ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. 14 సంవత్సరాలలోపు సమస్యగల బాలలను ఉద్యోగాలలో/పనులలో చేర్చుకుంటే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు రూ.3.5 లక్షల వరకు జరిమానాకు ఈ బిల్లు వీలు కలిగిస్తున్నది.
పేదరికం, కుటుంబ సమస్యలు కారణంగా బాలలు చదువుకోలేక పోతున్నారు. తల్లిదండ్రులతో కలిసి లేదా వారి ప్రోద్బ లంపై పనులలో చేరడం తప్పనిసరిగా భావిస్తున్నాము. చట్ట రూపకంగా బాలకార్మిక వ్యవస్థను నిషేధించినా, ఒక విధంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు ఆహా రం, కుటుంబ పోషణ కోసం పనులలోకి వెళ్లడం అనివార్యంగా భావిస్తున్నాము. ఆవిధంగా భావించడానికి వారనుభ విస్తున్న పేదరికమే కారణం. ఈ పరిస్థి తుల్లో బాల కార్మిక వ్యవస్థను అనుమతించే విధంగా సహనం ప్రదర్శిస్తున్నాం. ఇటువంటి పద్ధతికి ఈ బిల్లు ద్వారా తిలోదకాలిచ్చి బాల కార్మిక వ్యవస్థపట్ల రాజీలేని వైఖరిని అవలంబించడానికి ఈ బిల్లు దోహదపడగలదని ఆశిద్దాం. భారతదేశంలో ఈ బిల్లు ఒక చారిత్రాత్మక పరిణామం అని బాలలు - మానవ హక్కుల ఉద్యమకారులతోపాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ సహితం కొనియాడింది. ఈ బిల్లు తనకు వచ్చిన సమయం సహితం అనుకూలంగా ఉందని జాతీయ సలహామండలి సభ్యుడు ఎ.కె.శివకుమార్ భావిస్తున్నారు. బాల కార్మికుల ద్వారా తాత్కాలికంగా పొందే ప్రయోజనాలకన్నా, విద్య ద్వారా దీర్ఘకాలంలో పొందగల ప్రయోజనాలను ఈ బిల్లు ద్వారా గుర్తించినట్లయిందని ఈ బిల్లును రూపొందంచడంలో విశేషంగా కృషిచేసిన ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో ఎంతమంది బాలలు పనులు చేస్తున్నారు అనే దానికి నిర్దిష్టమైన గణాంకాలు లేవని గుర్తించాలి. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1.20 కోట్ల మంది 5 నుండి 14 సంవత్సరాల లోపు వయస్సుగల బాల కార్మికులు ఉన్నారు. అయితే 2009లో గణాంక మంత్రిత్వ శాఖ జరిపిన ఒకే సర్వే ప్రకారం బాల కార్మికులు 50 లక్షల మంది మాత్రమే ఉన్నారు. చాలా మంది బాలలు పాఠశాలల్లో చేరినా, నిత్యం తరగతులకు హాజరు కాకుండా పనులలోకి వెడుతున్నారు. దాంతో అటువంటి బాలలు చదువుకుంటున్న వారుగా గణాంకాలలో చేరుతున్నారు. ఐక్యరాజ్య సమితి వారి బాలల ఏజెన్సీ అయిన యూనిసెఫ్ అంచనా ప్రకారం భారతదేశంలో 14 సంవత్సరాలలోపు బాలల్లో 2.80 కోట్ల మంది పనిచేస్తున్నారు. వారిలో మూడింట రెండు వంతుల మంది తల్లిదండ్రుల భూములలోనే, ఇతరుల భూములల్లోనో వ్యవసాయ రంగం లో పనిచేస్తున్నారు. 1986లో రూపొందించిన బాల కార్మికుల చట్టం గనులు, రసాయనాలు వంటి ఎటువంటి ప్రమాదకర పరిశ్రమలలో అయినా 14 సంవత్సరాలలోపు బాలలు పనిచేయడాన్ని నిషేధించినది. 2006లో సవరించిన ఈ చట్టం 14 సంవత్సరాల లోపు బాలలను గృహాలలో పనివారిగా, రోడ్ల వెంబడి రెస్టారెంట్లు, టీ కొట్లలో కార్మికులుగా పనిచేయడాన్ని కూడా నిషేధించినది.
అయితే పూర్తిగా బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం పేదల కుటుంబాలకు హాని కలిగిస్తుంది అనే అభిప్రాయం దేశ విధాన రూపకర్తలలో వ్యక్తమవుతున్నది. పౌష్టికాహార లోపం ఎదుర్కొంటున్న కుటుంబాలు బాలల ఆదాయంపై రెండుపూట్ల అన్నం తినడానికి ఆధారపడవలసి వస్తుందనే వాస్తవిక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరో వంక చేతివృత్తులపై ఆధారపడుతున్న కుటుంబాలు తమ వృత్తి నైపుణ్యం తల్లిదండ్రుల నుండి పిల్లలకు అందించడానికి వారిని పనులలో వినియోగించుకోవడం తప్పనిసరి అని కూడా భావిస్తున్నారు. పేద కుటుంబాలకు అదనపు ఆదాయం కలిగించడానికి బాలలు పనిచేయడం అవసరమని చాలామంది నిజాయితీతో భావిస్తున్నారు.
2009లో తీసుకు వచ్చిన విద్యా హక్కు చట్టం దేశంలోని 6 నుండి 14 సంవత్సరాలలోపు వయసుగల బాలలు అందరికీ ప్రభు త్వం కల్పించిన ఉచిత విద్య పొందడం ప్రాథమిక హక్కుగా గుర్తించింది. దానితో 14 సంవత్సరాలలోపు బాలలు పనిచేయరాదని నిషేధించడం ఆ చట్టం అమలుకు అత్యవసరం కాగలదు. బాలల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో ప్రస్తుతం పార్లమెంటు ముందున్న బిల్లు కీలకమైన ఆయుధం కాగలదని భారతదేశంలో యూనిసెఫ్ వారి బాలల పరిరక్షణ కార్యక్రమం అధిపతి జోస్ బెర్గూవా అన్నారు. బాల కార్మిక వ్యవస్థను రాత్రికి రాత్రే పొగొట్టలేమని, సరైన చట్టం రూపొందంచుకోవడం అందుకు సహకరించగలదని ఆయన పేర్కొన్నారు. అయితే అసలైన సమస్య పటిష్టమైన చట్టాలను రూపొందంచడంలో గాకుండా వాటిని అమలుచేయడంలో వస్తున్నది చట్టాలను తీసుకురావడంపట్ల చూపుతున్న శ్రద్ధను మన పాలకులు అమలుపట్ల చూపడం లేదు. గత మూడేళ్లలో బాల కార్మిక చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన 4.5 లక్షల ఫిర్యాదులలో 10 శా తం కన్నా తక్కువగా మాత్రమే ప్రాసిక్యూషన్ వరకూ వెళ్ళడం ఈ సందర్భంగా గమనార్హం. సంపన్నులు తమ ఇళ్ళలో బాలలను పనికోసం నియమించుకుంటూ వారికి ఇళ్ళలో దొరకని మంచి ఆహారం, వస్త్రాలు, నివాస సదుపాయం కల్పిస్తున్నాం గదా అంటూ సమర్ధించుకుంటున్నారు. తాము ఆ బాలలను పనిలోకి తీసుకోకపోతే వారి జీవితాలు మరింత అధ్వాన్నంగా ఉంటాయి గదా అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఏదో సాకుతో నిత్యం ఏదో ఒక పనుల్లోకి బాలలను నియమించుకోవడం ఆగిపోవాలి అంటే పాలకులు రాజకీయ సంశిద్ధత అవసరం. అందుకు అవసరమైన చైతన్యాన్ని కల్పించే కృషి చేయవలసి ఉంది.
ఈ సందర్భంగా బాలలు అంటే ఏ వయసు వరకు అనే వివాదాన్ని పరిష్కరించాలి. మహిళలకు రక్షణ కల్పించే బిల్లు విషయంలో అంగీకారంతో శృంగారం జరిపే వయస్సు 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే పార్లమెంటులో నిరసన, అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం. రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలలోపు వారందరూ బాలలే. అయితే విద్యా హక్కు, బాల కార్మిక నిషే ధం చట్టాలు 14 సంవత్సరాలలోపు బాలలకు మాత్రమే వర్తింపు చేస్తున్నారు. ప్రమాదకర పరిశ్రమలలో బాలలతో పనిచేయిస్తేనే కార్మిక చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఈ వయస్సు వివాదంపై సమగ్ర సమాలోచనలు జరిపి, ఒకే సార్వజనిక పరిష్కారం కనుగొనాలి.
గత డిసెంబర్‌లో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక యువతి సామూహిక అత్యాచారానికి,
english title:
balala
Date:
Saturday, April 20, 2013