Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉమ్మడి విద్యావిధానమే శ్రేయస్కరం

$
0
0

నేడు విద్య ప్రైవేటు, పబ్లిక్ రంగంగా నిలువునా చీల్చబడింది. ఏ రంగం విద్య ద్వారా సమాజానికి అందించవలసిన విలువలను అందించలేక పోవడంతో సమాజంలో అనేక అపసస్య ధోరణులు ప్రబలుతున్నాయ. రెండు దశాబ్దాల క్రితం సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులలో గూడ ఏ ఒక్కరు మానసికంగా ఆందోళనకు గురియై ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదు. పైగా తమకు నచ్చిన రంగంలో వ్యవసాయమైనా, కుల వృత్తిలోనైనా, వ్యాపారంలోనైనా ఇతరత్రా ఏ రంగంలోనైనా రాణించారు.
ఎప్పుడైతే విద్యారంగం ప్రైవేటీకరించబడుతూ వ్యాపారీకరించబడిందో అప్పటినుండే విద్యాలక్ష్యాలు పక్కతోవ బడ్తూ, విద్య ద్వారా విద్యార్థులకు అందించవలసిన నైతిక విలువలు, మానవ విలువలు అందించబడకపోవడంవలన కొంతమంది విద్యార్థులు మానసిక బలహీనులై అల్ప విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడడం, కొంతమంది అనైతిక చర్యలకు పాల్పడడం, కొంతమంది రకరకాల వికృత చేష్టలకు పాల్పడడం జరుగుతోంది. చదువులంటే కేవలం ఇంజనీరో, డాక్టరో, టీచరో ఏదో ఒక ఉద్యోగం కొరకే అన్నట్లు ‘ఉద్యోగ కేంద్రీకృత విద్య’గా తయారై కుల వృత్తులను గానీ, ఇతరత్రా స్వయంగా జేయగలిగే అనేక వ్యవసాయిక, వ్యాపార పరమైన వాటిని లెక్కలోకి తీసుకోకపోవడం జరుగుతున్నది. కష్టించి పనిచేయాలనే తత్త్వం, సమాజసేవ చేయాలనే స్పృహ నుండి ప్రైవేట్ విష వ్యాపార చదువులు విద్యార్థులను దూరం చేయడం జరుగుతుంది. పెద్దలపై గౌరవభావం, స్ర్తిలను గౌరవించడం, వృద్ధులను ఆదరించడం, తోటి మానవులపై సానుభూతితో వ్యవహరించడం నయాధనికులతోపాటు, అన్ని వర్గాలలోని ప్రజల్లో లోపిస్తున్నది. మనిషి విలువను ‘మనీ’తో లెక్కకట్టే అమానవీయత పెంచి, పోషించబడి, శాశ్వతీకరణ దిశలో ముందుకెళ్తున్నది. అందుకే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నవి. తిన్నదరగక చచ్చేదొక వర్గమయితే, తిండి దొరకక చచ్చేదొక వర్గం. బహుళ అంతస్థుల భవనాలు ఒకవైపు నిర్మాణమవుతుండగా, మంచినీళ్ళు కొనుక్కోలేని, కనీస నివాస గృహాలు లేని లక్షలాది మంది నికృష్ట జీవనం వెళ్లదీయడం నగరాలలోనూ, గ్రామాలలోనూ నేడు కన్పిస్తుంది.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఇంకా అనేక రకాల అసమానతలను రూపుమాపడానికే కాక, దేశంలోని అవినీతిని ఎదుర్కోవడానికి స్ర్తిలపై జరిగే అఘాయిత్యాలను తగ్గించడానికి సంఘంపై, దేశంపై గౌరవ భావంతో ప్రతి మనిషిని మనిషిగా గౌరవించే వ్యక్తుల నిర్మాణానికి, వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణానికి అసలైన ఆయుధం మంచి విద్యావిధానం. అదే 1964-66లో దౌలత్‌సింగ్ కొఠారి సూచించిన ఉమ్మడి పాఠశాల విద్యావిధానం. పాలక ప్రతిపక్షాలు ఉమ్మడి పాఠశాల విద్యావిధానాన్ని అవలంభించకపోవడం వలననే నేడు సమాజంలో అనేక రకాల అకృత్యాలు, అరాచకాలు, తద్వారా అవినీతి సమాజం, నైతిక విలువలు లేని సమాజం ఏర్పడుతున్నదనేది గ్రహించకపోవడం సిగ్గుచేటు. ఉన్నోడికి ఒక రకమైన విద్య, లేనోడికి ఒక రకమైన విద్య ఆర్థిక స్థాయినిబట్టి చదివే విద్యావిధానానికి చరమగీతం పాడకపోతే సమాజం మరింత నైతిక విలువల సంక్షోభానికి గురియై డబ్బున్నోడు డబ్బులేనోడు ఎవరూ తృప్తిగా, శాంతిగా బతికే పరిస్థితులు రాబోయే కాలంలో ఉండవనేది గ్రహించాలి. ఇప్పటికే అనేక మంది పశువులకంటే హీనంగా ప్రవర్తించే సంఘటనలకు పాల్పడడాన్ని మనం నిత్యం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అన్ని రంగాల ప్రక్షాళనకు మంచి విద్యావిధానం ఊతమిస్తుంది. కావున మేధావులు, ప్రజాసంఘాలు కలసికట్టుగా ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉమ్మడి పాఠశాల విద్యావిధానానికై కృషిచేయాలి. అన్ని స్థాయిల్లో అందరికి ఉచిత విద్యకై ఉద్యమించాలి.

నేడు విద్య ప్రైవేటు, పబ్లిక్ రంగంగా నిలువునా చీల్చబడింది.
english title: 
ummadi
author: 
- గడీల సుధాకర్‌రెడ్డి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles