‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు..’ అనే చందంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఒకే దెబ్బకు రెండు పార్టీలను గడగడలాడించేందుకు వ్యూహం పన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్న వివిధ పార్టీల తెలంగాణ ప్రాంత నాయకులకు గడువు విధించారు. ఈ నెల 27న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవమే చేరే వారికి చివరి గడువు అని ప్రకటించారు. ఆ తర్వాత మే మొదటి వారం లేదా ఆ నెల 15వ తేదీలోగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు టిఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించి ‘దడ’ పుట్టించారు. రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలనుద్దేశించే కెసిఆర్ ఈ ప్రకటన చేసి ఉంటారనే అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకూ అర్థమైంది. ఆ రెండు పార్టీల నుంచి కొంత మంది ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరనున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లో చేరవచ్చని ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు కొందరు భావించారు. కెసిఆర్ ఇక్కడ ద్విముఖ వ్యూహంతో ప్రకటన చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం అంతగా లేదని, టిఆర్‌ఎస్ కూడా ఉద్యమంలో చురుగ్గా లేదన్న వాదన ఉంది. తన ప్రకటనతో అలజడి సృష్టించి, ఉద్యమం బలహీనపడలేదని, పైగా ఉద్యమం తన చేతిలోనే ఉందని మరోసారి నిరూపించుకోవాలనుకున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీల్లో తన ప్రకటనలో ప్రకంపనలు సృష్టించాలనుకున్నారు. కెసిఆర్ అనుకున్నట్లే ప్రధాన పార్టీలో ప్రకంపనలు వచ్చాయి. కెసిఆర్ ప్రకటనతో కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథం తొలుత స్పందించారు. డాక్టర్ మంద నేరుగా కెసిఆర్ నివాసానికి వెళ్ళి సుదీర్ఘ మంతనాలు జరిపారు. దీంతో ఇక డాక్టర్ మంద ఎప్పుడైనా కాంగ్రెస్ గూటిని వదిలి గులాబీ కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జరిగింది. అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ ఎంపీలు రాజయ్య, జి. వివేక్ పేర్లు కూడా ‘తెర’పైకి వచ్చాయి. రాజయ్య ఈ ప్రచారాన్ని ఖండించకపోయినా, వివేక్ మాత్రం పొడిపొడిగా ఖండించారు. ఇంకేముంది తెలంగాణ ప్రాంతం లో కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇక టిఆర్‌ఎస్‌లోకి వలస ప్రారంభమవుతుందని భావించారు. కాంగ్రెస్, టిడిపిల విషయంలో తన వ్యూహం ఫలించిందని భావించిన కెసిఆర్ మర్నాడే తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్ కె. కేశవరావు నివాసానికి వెళ్ళి మంతనాలు జరిపారు. ఎంపి డాక్టర్ మంద కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. విషయం ఏమిటంటే, టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆలస్యం చేయరాదని, జాప్యం చేస్తే వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నట్లు అవుతుందని, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మీరు బాధ పడినా ప్రయోజనం ఉండదని కెసిఆర్ వారికి చెప్పారట. కెసిఆర్ సృష్టించిన తుపాను ప్రభావం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి తాకింది. పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫోన్ చేసి పార్టీ నుంచి ఎవరూ వలస వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఆజాద్ ఆదేశంతో రంగ ప్రవేశం చేసిన బొత్స కెకే నివాసానికి వెళ్ళారు. రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి, ఎంపీ వివేక్ ప్రభృతులు ఆ సమావేశానికి హాజరయ్యారు. సున్నితమైన తెలంగాణ అంశాన్ని పరిష్కరించే దిశగా పార్టీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నదని బొత్స వారికి సెలవిచ్చారు. బొత్స పాత మాటే తప్ప కొత్త అంశం ఏమీ చెప్పలేదని వారు పెదవి విరిచారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని వారు బొత్సను హెచ్చరించారు. తెలంగాణపై స్పష్టమైన సమాధానం చెప్పలేదని వారు బొత్సపై చిటపటలాడారు. ఇంత కంటే ఎక్కువ బొత్స చెప్పలేరన్న విషయమూ వారికి తెలియంది కాదు. చివరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాష్ట్ర పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు జోక్యం చేసుకున్నారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఢిల్లీకి పిలిపించి గురువారం ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు. పార్టీనీ వీడి ఎవరూ వెళ్ళకుండా చూడాలని ఆయన వారికి సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని రాహుల్ వారికి హితబోధ చేశారు.
ఇక కెసిఆర్ ద్విముఖ వ్యూహం ఫలితంగా కాంగ్రెస్‌పైనే కాకుండా తెలుగు దేశం పార్టీపై కూడా భారీగానే ప్రభావం పడింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది టిడిపి నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరాలనుకున్నా, ఇప్పుడే చేరడం ఎందుకూ? ఎన్నికల ముందు చేరవచ్చని భావించారు. కానీ కెసిఆర్ రాజకీయ ఎత్తుగడ వారి ఆలోచనకు భిన్నంగా ఉంది. ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందన్నట్లు, ఆలస్యం చేస్తే సీటు పోతుందేమోనన్న భయంతో టిడిపి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కెసిఆర్‌తో మంతనాలు జరిపారు. అంతేకాదు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కెసిఆర్‌ను కలిసి మంతనాలు జరిపిన కొద్ది క్షణాల్లోనే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సదరు ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేశారు. రెండు ప్రధాన పార్టీలను కెసిఆర్ గడగడలాడించాలనుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి, తదితర పార్టీలను కెసిఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసి తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కెసిఆర్ ఎత్తుగడ వేశారు, కానీ తీవ్ర విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టి, రాజకీయంగా ఇతర పార్టీలను దెబ్బ తీయలనుకుంటున్నారని తెలుగు దేశం ముఖ్య నాయకులు, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ప్రభృతులు విమర్శల బాణాలు సంధించారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహం వారిదే.
‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు..’ అనే చందంగా తెలంగాణ రాష్ట్ర సమితి
english title:
oja debbaku
Date:
Saturday, April 20, 2013