ఒక వృద్ధ హీరో తన కుటుంబంనుంచి నాలుగో హీరోను పత్రికల ద్వారా పరిచయం చేస్తూ ‘మా వాళ్లకు చివరంటా ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయం. మా వంశంలో ఎవరు హీరోలయినా అందర్నీ ఆశీర్వదిస్తునే ఉంటా’ అని ప్రకటించుకున్నారు. ఎప్పటికీ నటించేది మేమే మీరు కాదు, చూసేది మాత్రం మీరే మీలో ఎవరినీ నటులను కానివ్వం అన్న వాస్తవాన్ని మరెవర్నో గిల్లుతూ చెప్పారు. ఏతావాతా జనం తెలుసుకోవాల్సింది తేల్చుకోవాల్సింది మనం చూస్తూ వాళ్లని పోషిస్తున్నాం. వారికీ, తెరవెనక వారికీ ఉపాధి కల్పిస్తున్నాం. వారినో అవతార పురుషులుగా భావించి అభిమానం పేరుతో కాళ్లుచేతులు విరగ్గొట్టుకోవడం మూర్ఖత్వం. పోషించడమే ఎక్కువ వారిని. మూడు గంటల సినిమా చూసిన తర్వాత మరో సినిమాకు ముందు వారి గురించి ఆలోచించడమంత అవివేకం, అజ్ఞానం, వెనకబాటుతనం వేరే ఉండదు. సినిమా చూసిన తర్వాత ఆ టికెట్టు ముక్క బయటకు రాగానే పారేస్తాం, మరో సినిమాకు అది పనికిరాదు కనుక.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్
పాఠశాలల్లో మరుగుదొడ్లు అవసరం
ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవంటే హతవిధీ... ఉపాధ్యాయులు, విద్యార్థులు చెట్లచాటుకూ, పుట్లచాటుకూ పోవాల్సి రావడం దారుణం. లఘుశంక అయితే ఫర్వాలేదు గానీ ‘దీర్ఘశంక’ అయితే పరిస్థితి ఏంటి? ఏ ‘డయేరియా’నో / ‘డీసెంట్రీ’నో దాపురిస్తేనో! పేరు గొప్ప ఊరుదిబ్బగా వుంది విద్యాశాఖ విషయం. టాయిలెట్‌ల వసతి కల్పిస్తేనే ‘ఆగస్టు 15’, ‘జనవరి 26’ జరుపుతాం.. లేదంటే లేదు, అంటే చర్యలుంటాయేమో ఉపాధ్యాయులు చూడాలి. పిల్లల్తో కలిసి ఉద్యమించాలి.
- కాళిదాసు, కావలి
జీవిత చరిత్రలు పంపండి
మహానీయుల జీవిత చరిత్రలు భావితరాలకు అందించాలని ‘కథన కుతూహలం’ గ్రంథాలయం సంకల్పించింది. తమ పెద్దలకు సంబంధించిన జీవిత చరిత్రలు కలిగిన వారసులు గ్రంథాలయం కొరకు ఒక కాపీని గ్రంథాలయమునకు అందజేయగలరు. పరిశోధకులకు సహాయపడగలరు.
- వేలూరి కౌండిన్య, విజయవాడ
వౌలిక వసతులు కల్పించండి
విశాఖపట్నానికి శివారులో జాతీయ రహదారికి ఆనుకొని వున్న గాజువాకలో పెక్కు భారీ పరిశ్రమలు, వందల ఎకరాల్లో విస్తరించి వున్న ఎక్స్‌పోర్టు జోను, చిన్న తరహా పరిశ్రమలతో అలరారుతున్నది. వేల ఎకరాల్లో విస్తరించినది అయిన ఆటోనగర్, స్టీల్ సిటీ, గంగవరం పోర్టు, స్టార్ హోటళ్ళు, 8 ఎసి సినిమా హాళ్లు, వందకు పైగా బంగారం, బట్టల షాపులు రెండు భారీ రిటైల్ సూపర్ మార్కెట్లు, విశాలం అవుతున్న రోడ్లు, డ్రైనేజీలు, పెరిగిన ఆస్తిపన్నులు ఇన్ని ప్రత్యక్షంగా గాజువాకలో పెరుగుతూ పక్కా సిటీ లక్షణాలు కనిపిస్తుంటే, ఎప్పుడో జివిఎమ్‌సి హామీయిచ్చిన వౌలిక వసతులు పూర్తికాలేదు. కనుక అవి అన్నీ నెరవేరిన పిదపే అనకాపల్లి, బీమిలి పట్టణాలను జివిఎమ్‌సిలో విలీనం చెయ్యాలనడం వాటి పెరుగుదలకి అడ్డగించడమే అవుతుంది.
- యల్లాప్రగడ మల్లన్న, గుల్లలపాలెం
లక్షలు జీతం తీసుకుంటూ...
తూ.గో. జిల్లాలో బిక్కవోలు, ద్వారపూడిల మధ్య కెనాల్ రోడ్డు సుమారు పదిహేను కిలోమీటర్ల మేర రోడ్డు పెద్ద పెద్ద కుంతలతో భయంకరంగా తయారై వాహన చోదకుల పాలిట మృత్యుకూపంగా మారింది. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కనీసం ఉన్నత న్యాయస్థానమైనా కల్పించుకుని ప్రభుత్వాన్ని ఆదేశించాలని మనవి.
- టి.నాగ్వేరర్, అనపర్తి
ఇది మీకు తగునా?
ఏప్రిల్ 17వ తేదీ ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమై ‘్భరీ ఎన్‌కౌంటర్’ వార్తలో ‘మీ వ్యాఖ్యలు’ కలిపి రాశారు. ఎదురు కాల్పులపై అనుమానాలు అంటూ పదిమంది మావోయస్టులు మృతి చెందగా, పోలీసుల్లో ఏ ఒక్కరూ మృతి చెందకపోవడం కనీసం ఎవరికీ స్వల్ప గాయాలు కూడా కాకుండా...అంటు పలువులు, పరిశీల కులు మాటలను రాశారు. ఇట్టి వ్యాఖ్యలు దేశ వ్యతిరేక శక్తులకు వూతమిచ్చేవిగా ఉన్నాయ. పౌర హక్కుల సంఘాల పేరిట, హింసాత్మక సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉన్నవారు వాడే భాష అది. పోలీసు చర్యలను రాజ్యి హింసగా చిత్రీకరించి, వారిపై ద్వేషాన్ని రగుల్కొల్పడం క్రమంగా పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో ఆ పౌరహక్కుల సంఘం ఒక భాగం. అందుకు అనుగుణంగా కొన్ని పత్రికలు వ్యవహరిస్తుంటాయ. బాధ్యతాయుతమైన మీ పత్రిలో అటువంటి వ్యాఖ్యలు ప్రచురించడం దురదృష్టకరం. అనేక మంది పౌరులను, పొట్టన పెట్టుకుంటూ అనునిత్యం రక్తసిక్తం చేస్తున్న సాయుధ విద్రోహ శక్తులను సమర్ధించడం తగదు.
- బి.ఎస్. శర్మ, వారాసిగూడ
ఒక వృద్ధ హీరో తన కుటుంబంనుంచి నాలుగో హీరోను పత్రికల ద్వారా పరిచయం చేస్తూ ‘మా వాళ్లకు చివరంటా ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయం.
english title:
a
Date:
Saturday, April 20, 2013