న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఇన్నాళ్లూ కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయనుకుంటే శనివారం మళ్లీ పసిడి ధరలు పరుగులు ప్రారంభించాయి. ఢిల్లీ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల పుత్తడి ధర అంతకుముందు ట్రేడింగ్‌తో పోల్చితే 500 రూపాయలు పెరిగి రూ.27,100కు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగినది రూ.26,900లుగా ఉంది. క్రితం రోజు కూడా 24 క్యారెట్ల పసిడి 250 రూపాయలు ఎగిసింది. గడిచినవారం రోజుల్లో జరిగిన ట్రేడింగ్‌లో తొలి నాలుగు సెషన్లలో పుత్తడి ధరలు 3,250 రూపాయల మేర క్షీణించాయి. కాగా, బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటంతో రిటైలర్ల నుంచి అత్యవసర కొనుగోళ్లు పెరిగాయని, ధరలు మరింత తగ్గుతాయేమో అనుకున్నవారంతా తాజా పరిణామాలతో పసిడి మార్కెట్ల వైపు పరుగులు తీస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక న్యూయార్క్‌లో మళ్లీ ఔన్స్ బంగారం ధర 1,400 డాలర్ల మార్కుకు చేరింది. 1.4 శాతం పెరిగి 1,412.40 వద్ద నిలిచింది. దేశీయంగానూ ఎమ్‌సిఎక్స్‌లో 10 గ్రాములు 26,069 రూపాయలకు ఎగిసింది. మరోవైపు పుత్తడి ధరలు తిరిగి పెరుగుదల బాట పట్టగా, వెండి ధరలు మాత్రం క్షీణ దశలోనే ఉన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా వెండి కిలో 100 రూపాయలు దిగజారింది. ఫలితంగా 45,300 రూపాయలకు చేరింది. ఇక పరిశ్రమ వర్గాలు వెండి ధర ఇంకా తగ్గుతుందనే భావనతో కొనగోళ్లకు దిగడం లేదు. గత ఐదు సెషన్లలో వెండి కిలో ధర 7,200 రూపాయల వరకు తగ్గడం పరిశ్రమ వర్గాల ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐరోపా ఖండంలోని సైప్రస్ దేశం ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన వద్దనున్న బంగా రు నిల్వలను అమ్మేందుకు సిద్ధపడుతోందనే ప్రచారం మార్కెట్‌లో ఒక్కసారిగా ధరల పతనానికి కారణమైంది. బంగారానికి ఉన్న డిమాండ్‌తో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి దేశం బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడాలంటే భారీగా పేరుకుపోయిన రుణాలను తీర్చేందుకు బంగారం అమ్మకాలకు తెర లేపాలనే సైప్రస్ భావన అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. దీంతో మార్కెట్‌లోకి భారీగా బంగారం తరలివచ్చే అవకాశాలుండటంతో ముందుగా తాము బంగారంపై పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చన్న మదుపర్ల ఆలోచన పసిడి ధరలను కిందికి దించేసింది. దీంతో ఇన్నాళ్లు భారీ స్థాయలో బంగారంపై పెట్టిన పెట్టుబడులను మదుపర్లు ఆత్రుతగా లాగేసుకోవడంతో మార్కెట్‌లో ధరలు దిగిరాక తప్పలేదు.
ఢిల్లీలో 10 గ్రాములు రూ.27,000 * క్రితం ముగింపుతో పోల్చితే రూ.500 అధికం
english title:
gold price
Date:
Sunday, April 21, 2013