ముంబయి, ఏప్రిల్ 20: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యునికేషన్స్ (ఆర్‌కామ్) లిమిటెడ్‌లో భాగమైన రిలయన్స్ గ్లోబల్‌కామ్ లిమిటెడ్‌లో వాటా విక్రయానికి సంబంధించి పిఇ ఫండ్స్ కన్సార్టియంతో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు ఆర్‌కామ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు కూడా రిలయన్స్ గ్లోబల్‌కామ్ లిమిటెడ్‌లో వాటా అమ్మకానికి సంబంధించి బహ్రెయిన్ టెలికమ్యునికేషన్స్ కో (బటెల్కో)తో ఆర్‌కామ్ చర్చలు జరిపింది. కాగా, పిఇ ఫండ్స్ కన్సార్టియంతో జరుగుతున్న చర్చలు మే నెలాఖరుకల్లా పూర్తవుతాయనే ఆశాభావాన్ని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆర్‌కామ్ వ్యక్తం చేసింది. కాగా, గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 37,000 కోట్ల రూపాయల రుణ భారాన్ని మోస్తున్న ఆర్‌కామ్..ఆ రుణ భారాన్ని ఈ వాటా విక్రయంతో కొంతైనా పూడ్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే గ్లోబల్‌కామ్‌లో 80 శాతం వాటాను ఆర్‌కామ్ అమ్మేసే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే పిఇ ఫండ్స్ కన్సార్టియంలో సమేనా క్యాపిటల్ సంస్థ ఉండగా, ఈ కన్సార్టియంలో ఉన్న ఇతర సంస్థల పేర్లను ఆర్‌కామ్ తన ప్రకటనలో వెల్లడించలేదు. అలాగే బటెల్కోతో జరిపిన చర్చలు ఎందుకు ముందుకెళ్లలేదనేదానిపై కూడా ఆర్‌కామ్ వివరణ ఇవ్వలేదు.
ముగింపు దశకు చేరుకున్న చర్చలు * వెల్లడించిన ఆర్‌కామ్
english title:
global com
Date:
Sunday, April 21, 2013