వాషింగ్టన్, ఏప్రిల్ 20: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఎఫ్‌డిఐలను పెంచేందుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిదంబరం వారం రోజుల కెనడా, అమెరికా దేశాల పర్యటనలో ఉన్న విష యం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే శనివారం ఆయన పీటర్సన్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యా రు. అక్కడ అడిగిన పలువురి ప్రశ్నలకు చిదంబరం స్పందిస్తూ ‘అధికార యుపిఎ ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడానికే తొలి ప్రాధాన్యతను ఇస్తుంది. ఏప్రిల్ 22న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇందులోని ప్రభుత్వ అజెండాలో బీమా రంగలో ఎఫ్‌డిఐ పరిమితిని పెంచడానికి తొలి ప్రాధాన్యత.’ అన్నారు. అయితే ఎఫ్‌డిఐ పరిమితి 26 శాతం నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదన బిల్లు ఆమోదానికి కొంత అడ్డంకిగా మారుతోందన్నారు. ఈ ఒక్క విషయంలో ప్రతిపక్షాలు తమదారిలోకి వస్తే బిల్లు సునాయసంగా ఆమోదం పొందుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలతో బీమా పరిశ్రమ జరిపే చర్చలు బిల్లు ఆమోదానికి దోహద పడనుందన్న ఆయన ఈ బిల్లును ఆమోదింపజేయగలననే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశంలో వృద్ధిరేటు లేనిదే సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండదన్నారు. ఇదిలావుంటే వాషింగ్టన్‌లో గురువారం బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు సమావేశమైన తర్వాత అందులో చర్చించిన అంశాలపైనా చిదంబరం ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన సన్నాహక పనులు 12 నెలల్లో పూర్తవుతాయని, బ్రెజిల్‌లో జరగబోయే బ్రిక్స్ దేశాల సదస్సుకు ముందే ఈ బ్యాంకుపై ఓ తుది నిర్ణయం కూడా వెలువడుతుందన్నారు. ‘బ్రెజిల్‌లో జరగబోయే బ్రిక్స్ దేశాల సదస్సుకు ముందే బ్రిక్స్ బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.’ అన్నారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంకులతో గురువారం జరిగిన సమావేశం నేపథ్యంలో శుక్రవారం బ్రిక్స్ బ్యాంకు అవసరాన్ని మరోమారు బ్రిక్స్ ఆర్థిక మంత్రులు పునరుద్ఘాటించారు. (చిత్రంలో) వాషింగ్టన్‌లోని ఐఎమ్‌ఎఫ్ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొని బయటకు వస్తున్న చిదంబరం
* కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టీకరణ
english title:
fdi
Date:
Sunday, April 21, 2013