* సెన్సెక్స్ 774 పాయింట్లు, నిఫ్టీ 254 పాయింట్ల లాభం
* మళ్లీ 19వేల స్థాయిని అందుకున్న బిఎస్‌ఇ సూచీ
* వడ్డీరేట్లు తగ్గుతాయనే విశ్వాసంతో కొనుగోళ్లపై మదుపర్ల దృష్టి
* మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిన పసిడి, చమురు ధరల పతనం
* వారాంతపు సమీక్ష
=============================
ముంబయి, ఏప్రిల్ 20: దేశీయ స్టాక్‌మార్కెట్లలో గడిచినవారం మదుపర్లు భారీ కొనుగోళ్లతో దుమ్మురేపారు. అంతకంతకూ దిగజారుతున్న ప్రధాన ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో రాబోయే ద్రవ్యవిధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంకు తగ్గిస్తుందనే విశ్వాసం మదుపర్లలో పెరగడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్ 774 పాయింట్లు పుంజుకుని ఈ ఏడాదిలోనే ఒక వారంలో అత్యధిక లాభాలను నమోదు చేసింది. గత ఏడాది నవంబర్‌లో 833 పాయింట్ల మేర సెనె్సక్స్ పెరగగా, ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయిలో ఎగిసింది. అంతేగాక మళ్లీ సెన్సెక్స్ సూచీ 19వేల స్థాయిని అందుకుంది. అటు నిఫ్టీ సైతం 254 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగా రం, చమురు ధరల్లో నమోదైన పతనం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న ఆసియా దేశాల్లో ఈ పతనంతో అధిక కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యలోటు తగ్గే వీలుండటం మార్కెట్ లాభపడేందుకు దోహదం చేసింది. ఇక మార్చిలో టోకు ధరల సూచీ ఆధారంగా ఉన్న ద్రవ్యోల్బణం మూడేళ్ల కనిష్టానికి దిగజారుతూ 6.84 శాతం నుంచి 5.96 శాతానికి పడిపోవడంతో ద్రవ్యోల్బణం గణాంకాలనే ప్రాతిపదికగా చేసుకుని ద్రవ్యవిధానాన్ని సవరిస్తున్న ఆర్‌బిఐ.. మున్ముందు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందనే నమ్మకం మదుపర్లలో బలపడింది. దీంతో వడ్డీరేట్లతో ముడిపడి ఉన్న బ్యాంకింగ్, నిర్మాణ రంగ షేర్లకు పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతకుముందు చిల్లర ద్రవ్యోల్బణం కూడా క్షీణించిన నేపథ్యంలో తగ్గుముఖం పట్టిన ప్రధాన ద్రవ్యోల్బణం ప్రభావం మే 3న ఆర్‌బిఐ ప్రకటించే వార్షిక ద్రవ్యవిధానంపై తప్పక ఉంటుందని మదుపర్లు విశ్వసించారు. దీంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అయితే డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ పెరుగుతుండటంతో ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక గడిచినవారం మార్కెట్ ట్రేడింగ్‌ను పరిశీలిస్తే సోమ, మంగళవారాల్లో లాభాలను నమోదుచేసిన మార్కెట్లు..బుధవారం స్వల్ప నష్టాలను చవిచూశాయి. గురువారం తిరిగి లాభాలబాట పట్టగా, శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో గడిచినవారం మొత్తంగా 773.90 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ చివరకు 19,016.46 వద్ద ముగియగా, 254.55 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ఆఖరికి 5,783.10 వద్ద నిలిచింది. ఇక అనుకూల వాతావరణంతో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) గడిచినవారం 1,484.77 కోట్ల రూపాయల పెట్టుబడులను దేశీయ స్టాక్‌మార్కెట్లలోకి తరలించారు. కాగా, అత్యధిక లాభాలను అందుకున్న షేర్లలో ఎస్‌బిఐ 10.18 శాతంతో ముందుండగా, ఆ తర్వాత మహింద్ర అండ్ మహింద్ర, భారతీ ఎయిర్‌టెల్ 9.55 శాతం, ఒఎన్‌జిసి 8.44, లార్సెన్ 8.33, మారుతి 8.26 శాతంగా ఉన్నాయి. నష్టపోయిన షేర్ల లో ఐటి దిగ్గజం టిసిఎస్ అత్యధికం గా 4.04 శాతం, విప్రో 3.82 శాతంగా ఉన్నాయి. ఆయా రంగాలవారీగా బిఎస్‌ఇలో బ్యాంకింగ్ రంగం 7.50 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ 5.80, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి 5.26, ఆటో 5.02 శాతం చొప్పున పుంజుకున్నా యి. టర్నోవర్ పరంగా అంతకుముం దు వారంతో పోల్చితే గడిచినవారం క్షీణత నమోదైంది. బిఎస్‌ఇ 8,242.21 కోట్ల రూపాయలు, ఎన్‌ఎస్‌ఇ 46,9 97.76 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు బిఎస్‌ఇ టర్నోవర్ 8,560.94 కోట్ల రూపాయలు, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 47,70 5.31 కోట్ల రూపాయలుగా ఉంది.
దేశీయ స్టాక్‌మార్కెట్లలో గడిచినవారం మదుపర్లు భారీ కొనుగోళ్లతో
english title:
markets
Date:
Sunday, April 21, 2013