ఇబ్రహీంపట్నం (హైదరాబాద్), ఏప్రిల్ 20: విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లను ఇక నుంచి ఆధార్ (బయోమెట్రిక్ సిస్టమ్)తో అనుసంధానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని అరబిందో ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘ఆధార్ ఎనేబుల్డ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటిఎఫ్ పైలెట్ ప్రాజెక్ట్’ను సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించే స్కాలర్‌షిప్ వెరిఫికేషన్ ప్రక్రియ రోజుల తరబడి సాగుతుండటంతో సకాలంలో స్కాలర్‌షిప్‌లు రాక విద్యార్థులు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాక విద్యాసంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రెమాండ్ పీటర్ సారథ్యంలో ఆధార్ అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్టు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఇక నుండి భౌతిక తనిఖీలకు స్వస్తిపలికి, ఈ బయోమెట్రిక్ ఆధార్ ఎనేబుల్డ్ వెరిఫికేషన్ ద్వారా గంటల వ్యవధిలోనే విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన జేడీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ బయోమెట్రిక్ మిషన్‌లో విద్యార్థి ఈ-పాస్ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేయగానే విద్యార్థి వివరాలు చూపిస్తూ, పెండింగ్ ఫర్ ఆధార్ ఐడెంటిఫికేషన్ వస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థి ఆధార్ యూనిక్ ఐడింటిటీ నెంబర్ ఎంట్రీ చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకోగానే, వెరిఫికేషన్ పూర్తవుతుందన్నారు. బయోమెట్రిక్ ఆధార్ ఫింగర్‌ప్రింట్స్ వెరిఫికేషన్ పూర్తయిన వారం రోజుల్లోనే విద్యార్థుల ఖాతాల్లోకి స్కాలర్‌షిప్‌లు ప్రతి నెలా జమవుతాయని వివరించారు. ఈ స్కాలర్‌షిప్ వెరిఫికేషన్ కోసమే కాకుండా, విద్యా సంస్థల్లో హాజరు శాతం కూడా తెలుసుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఆధార్ ఫింగర్‌ప్రింట్స్ ప్రక్రియ దేశంలోని హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, త్రిపుర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోందని, అరబిందోలో నేడు ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలోని 12వేల విద్యాసంస్థలకు త్వరలోనే వర్తింప చేయనున్నట్టు ఆయన వివరించారు. స్కాలర్‌షిప్ పొందాలి అంటే ప్రతి విద్యార్థి 75శాతం హాజరు శాతం ఉండాల్సిందేనని, హాజరుశాతం తక్కువగా ఉంటే స్కాలర్‌షిప్‌లకు అనర్హులు అవుతారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మొదటగా అరబిందోతో ప్రారంభమైన ఆధార్ ఫింగర్‌ప్రింట్స్ ప్రక్రియను 9 కళాశాలల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులను స్కాలర్‌షిప్ తనిఖీ అధికారులుగా నియమించడం ద్వారా రోజులకొద్దీ ఆలస్యం అవుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడడంతోపాటు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అవకతవకలను నిరోధించగలుగుతామని తెలిపారు. ప్రతి విద్యార్థి సాధ్యమైనంత తొందర్లో ఆధార్ సంఖ్యను నమోదు చేయించుకుని కళాశాలలకు అందజేయాలన్నారు. స్కాలర్‌షిప్‌లు రాలేదని, ఎవరి చుట్టూ తిరగనవసరం లేదని, ఆధార్ ఫింగర్ ప్రింట్స్ ప్రక్రియలో ఆటోమెటిక్‌గా విద్యార్థి ఖాతాలోకి డబ్బులు జమ అయిపోతాయని తెలిపారు. కళాశాలకు చెందిన ఈసి 2వ సంవత్సరం విద్యార్థిని వౌనిక మొదటి ఆధార్ సంఖ్యను ఎంట్రీ చేసి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు. ఆధార్ సంఖ్య కలిగిన విద్యార్థులందర్నీ దాదాపు రెండుమూడు గంటల్లోనే ఈ సిస్టం ద్వారా అధికారులు తనిఖీ పూర్తి చేశారు.
అవకతవకలకు ఇక చెక్.. గంటల వ్యవధిలోనే తనిఖీలు పూర్తి * అరబిందో ఇంజనీరింగ్ కళాశాలలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు
english title:
pilot project
Date:
Sunday, April 21, 2013