హైదరాబాద్, ఏప్రిల్ 20: సినిమాకున్న శక్తి అద్భుతమైనదని, ఆ కళలో అన్ని కళలు నిక్షిప్తమై ఉన్నాయనీ, కళాకారులకు సేవ చేయడం సమాజ సేవగా తాను భావిస్తానని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి-టివి-9 జాతీయ అవార్డులు 2011, 2012 సంవత్సరాలకుగాను హైదరాబాద్ శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. అన్ని భాషల నుంచి తారలు దిగివచ్చి వేదికను వినీలాకాశంలా మార్చివేశారు.
ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమకు వందేళ్లు పూర్తవుతున్నాయనీ, ఈ విశిష్ట సందర్భంలో తన జీవితాన్ని కళాకారుల సేవలో తరించడానికి పూనుకున్నానని సినిమాకున్న శక్తి దేనికీ లేదని అన్నారు. ఈ విషయాన్ని నమ్మే వ్యక్తిగా కళలను ప్రేమించి అభిమానించి ఆస్వాదిస్తున్నానని, గత 40 సంవత్సరాలుగా సినిమావాళ్లను, కళాకారులను తాను ప్రేమిస్తూ వారిని గౌరవిస్తున్నానని, జాతీయస్థాయిలో తెలుగువారికి అవార్డుల పరంగా గుర్తింపు రావడంలేదని అందుకు ప్రతిగా తెలుగువారి సత్తా చూపేవిధంగా ఈ అవార్డులను తాను ఏర్పాటు చేశానని వివరించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా, బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’లో శ్రీరాముడుగా, షిర్డిసాయిలో ‘సాయిబాబా’గా నాగార్జున, ఇంగ్లీషు వింగ్లీషు చిత్రంలో తన వయస్సును జయించిన శ్రీదేవిలాంటి వారందరూ ఇక్కడకు రావడం సంతోషదాయకమని, తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాలని, సమాజసేవ పరమావధిగా తాను కళాసేవ చేస్తున్నానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని వందేళ్ల సినిమాకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నటుడు కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు, శతృఘ్నసిన్హా, శ్రీదేవిలకు లైఫ్‌టైమ్ అచ్చీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. 2011, 2012 సంవత్సరాలకు గాను ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందానికి, దివంగతులైన గాయకుడు పి.బి.శ్రీనివాస్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించగా గాయని సుశీల అందుకున్నారు. గాయని కౌసల్య, మాటల రచయిత ఖదీర్‌బాబు, కన్నడ దర్శకుడు కిషన్ శ్రీకాంత్, అర్జున్, సనలకు అవార్డులు అందించారు. అదేవిధంగా 2011 సంవత్సరానికి గాను ఉత్తమనటుడుగా బాలకృష్ణ, ఉత్తమ హీరోయిన్ తమన్నా, ఉత్తమ దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత యలమంచలి సాయిబాబు, ఉత్తమ గాయకుడు కార్తీక్, గాయని రమ్య, ఉత్తమ్ విలన్‌గా మంచులక్ష్మీ, రాజన్న చిత్రానికి, నిర్మాతకు, నటుడు నాగార్జునకు, బాలనటి అన్నీకు స్పెషల్ జూరీ అవార్డులు ప్రకటించారు. 2012 సంవత్సరానికిగాను ఉత్తమ నటుడు నాగార్జున, ఉత్తమ హీరో రామ్‌చరణ్, ఉత్తమ హీరోయిన్ అనుష్క, ఉత్తమ దర్శకుడు పూరీ జగన్నాధ్, నిర్మాత మహేష్‌రెడ్డి, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, మద్దాలి వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, కె.రాఘవేంద్రరావులు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో రాణిముఖర్జీ, అమీషా పటేల్, మోహన్‌బాబు, జీనత్‌అమన్, జయసుధ తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) టిఎస్సార్-టివి9 పురస్కారాల ప్రదానోత్సవంలో ప్రముఖ నటి శ్రీదేవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి
* సమాజసేవే పరమావధిగా కళాసేవ * టిఎస్సార్-టివి9 జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో సుబ్బరామిరెడ్డి
english title:
cinema
Date:
Sunday, April 21, 2013