ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినా మానవ సహజమైన బలహీనతలను జయించలేరు. ఎక్కడో ఒకసారి అవి బయటపడుతూ ఉంటాయి. వినటానికి చాలా సామాన్యంగా వుంటాయి. అందుకు కందుకూరి వారితో ప్రారంభిస్తే, ‘‘రాధికా స్వాంతనం’’ రాసిన ముద్దుపళని గురించిన నిందాపూర్వక వ్యాఖ్యలు చూడండి. ‘‘ఈ ముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికా స్వాంతనమను నాలుగశ్వాశముల శృంగార ప్రబంధము రచించెను. దీని తల్లిపేరు ముత్యాలు. ప్రతాపసింహుని ఉంపుడుగత్తె’’ కుల వృత్తికాగల వేశ్య అగుటచే ‘స్ర్తిజన స్వాభావికమైన సిగ్గువిడిచి...’’ అని పరిచయం చేసాడు. తన గ్రంథంలో మిగతా వారిని గురించి ఎక్కువ గౌరవంగా ప్రస్తావించి ముద్దుపళని విషయంలో కఠినమైన పదజాలాన్ని ఉపయోగించారు. కళాకారుల మీద వారి వ్యక్తిగతమైన కక్షలతో వారి జీవితంలోకి తొంగిచూసిన సంఘటనలు లేకపోలేదు. రావుబహద్దూరు కందుకూరి వీరేశలింగం పంతులు మీద కూడా. వీరేశలింగం గారికి మంగమ్మ చేసిన శుశ్రూష అనేకమైన అపార్థాలకు దారితీసింది. కొంత అపవాదుకూ కారణమైంది. వీరేశలింగం గారి కేసు అలాంటిదే. ఆమె ఏకాంతంగా వుండగా పంతులు ఆమె వీపు నిమిరేవారని, బెంగుళూరు ప్రయాణం, ఇద్దరూ మూడు మాసాలు ఒకే గదిలో వున్నారని కేసు... ఈ కేసు చాలా రోజులు గడిచింది. (ప్రకాశం పంతులు నా జీవిత యాత్ర నుంచి). ఇక వీర కమ్యూనిస్టు- శ్రీశ్రీనే తీసుకోండి. ఆయన ఎవరి ఆధిక్యాన్ని మెచ్చుకొనేవారు కాదు. చాలాసార్లు మానవ సహజమైన అసూయాద్వేషాలు కనపడుతూ వుండేవి. సమకాలీన కాలంలో మీకు సాటిగా ఎవరిని భావిస్తున్నారు (ప్రశ్నోత్తరాల శీర్షిక ప్రజ నుంచి) నాకు సాటి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నా సాటి నేనే. నన్ను తలదనే్న వాళ్ళు ఎందరో వున్నారు? నా కాలిగోటికి సరిపోని వాళ్ళూ ఉన్నారు. నాతో సమానులు మాత్రం సమకాలంలోనే కాదు- ఏ కాలంలోనూ లేరు. దీన్ని ఆత్మాభిమానం అంటారా? ఆత్మవిశ్వాసం అంటారా! (పేజీ 114) అదే ‘ప్రజ’లో మరో పేజీ. ఆచార్య రోణంకి అప్పలస్వామిని గురించి ప్రస్తావిస్తూ రోణంకి వారంటే, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ వంటి పాశ్చాత్య భాషల్లో గొప్ప పండితుడిగా భావిస్తాను. తెలుగులో వారి పాండిత్యాన్ని శంకిస్తా (పేజీ 308). శ్రీశ్రీ పురిపండాకు లేఖ రాస్తూ శివశంకరస్వామి సెగ సంకటాచారి అంటూ సంబోధిస్తూ (సెగ అంటే సుఖ వ్యాధి) శ్రీశ్రీ జవాబులు విరసం (ప్రచురణ) అదే పుస్తకం 102వ పేజీలో చల‘సాని’ ప్రసాదుకు ఉత్తరం రాస్తూ శ్రీరంగం నారాయణబాబు లాంటి సాహిత్య వికలాంగుణ్ణి మోస్తున్న ఆరుద్ర అందరూ నా దృష్టిలో అవ్యక్తులే. తిరుపతి వేంకట కవులకూ, కొప్పరపు కవులకు సంభవించిన వాద వివాదాలు ఇరవయ్యో శతాబ్ది పూర్వపు తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప ప్రాచుర్యం పొందిన విషయం జగద్విదితం. ప్రేరణ ఎంత చిన్నవైతేనేం అవి చినికి చినికి గాలివాన అయినాయి. అవి కొంత శాఖాస్వాభిమాన దురభిమాన తీర్పు ఈర్ష్యారూపంగా పరవశించాయి. అదే సందర్భంలో తన గురుదేవులను కించపరచారని 11 సంవత్సరాల బాలా కుమారుడు, సభాసదులు మెచ్చేలా సంపూర్ణ శతావధానం (గుంటూరు కాలేజీ శతావధానం) నిర్వహించిన బ్రహ్మశ్రీ శివరామశాస్ర్తీని విస్మరించలేం. తిరుపతి కవులు నరసరావుపేటలో అవధానం చేస్తూ ఓటమి సంభవించిందని చెప్పుకొచ్చారు మా శర్మ కొప్పరపు కథల ప్రతిభ అనే పుస్తకంలో (పేజీ 41). అదే సందర్భంలో తిరుపతి కవులను గురించిన నిందాపూర్వక వ్యాఖ్యలు. కొప్పరపు కథలను మెచ్చుకుంటూ తమ బంధుత్వాన్ని వీడలేక మా శర్మ వ్యాఖ్యలు కనిపిస్తాయి. (‘ఏనుగు నెక్కినాము ధరణీశులు మొక్కగ నిక్కిరాము’ అనే వాక్యాన్ని నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తూ). కథకుడు, అవధాన శేఖరుడు, తన అద్భుతమైన భాషా పటిమతో తెలుగు కథకు గుడి కట్టిన శ్రీపాద విషయంలోనూ ఒకసారి ఇలాగే జరిగింది. శ్రీపాదవారి శ్మశాన వాటిక గ్రంథాన్ని వెంకట కవులలో ఒకరు చూశారని, అది చాలా బావుందని (శే్లషగా) వ్యాఖ్యానించారు. అందుకు ఖేద పడిన శ్రీపాద- అంత బాగుంటే దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు’’ అని అన్నారు (శ్రీపాద అనుభవాలు జ్ఞాపకాలనుంచి). ఇక విశ్వనాథ వేలూరి, సమకాలీకులు. ఆయా రంగాలలో ఉద్దండ పండితులు ఎదుటపడినప్పుడు చిరునవ్వుతో పలకరించుకున్నా విశ్వనాధ, వేలూరిని వారి పాండిత్యాన్ని మెచ్చుకొనేవారు కాదు’’ అదే విషయాన్ని విశ్వనాథ తన జీవిత చరిత్ర (అసంపూర్ణం)లో చెపుతారు.
ఇక ‘చలం’గారు సరేసరి. ఒకరి పొత్తు గిట్టదు. తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలనుకోరు. చలానికి తగాదా పడటమే ఇష్టం. ‘‘యూనివర్సిటీ వారు నవలల పోటీ నిర్వహించారు. అందులో చలం కూడా తన మైదానాన్ని పంపాడు? మండవ జగ్గారావు లేఖ రాస్తూ (11-7-59) పోటీ కోసమైన ఆ నీతి పరులచేత, గొప్ప వారిచేత ఈ పుస్తకాన్ని చదివించాలని. సర్ రాధాకృష్ణన్‌గారు రికమెండ్ చేశారు. ఉన్నవ లక్ష్మీనారాయణగారు కూడా.. ‘ఇదే ఉత్తమ నవల’ కాని బహుమతి ఇచ్చే సాహసం లేదన్నారు. విశ్వనాథ, బాపిరాజు పోయి చలాన్ని తిట్టి బీదవారమని చెప్పి బహుమతి పంచుకున్నారు.
ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినా మానవ సహజమైన బలహీనతలను జయించలేరు.
english title:
kavi
Date:
Monday, April 22, 2013