....................
రావూరికి జ్ఞానపీఠ్
వరించిన సందర్భంగా...
రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్ళు’ నవలను యాభయ్యేళ్ళ క్రితం రాసేనాటికి సినిమా రంగం అంతో ఇంతో మంచి స్థితిలోనే ఉంది. అయితే, పై వెలుగులు కాక లోపటి చీకట్లు, పైపై మెరుపులు కాక లోలోని మరకలు రావూరి భరద్వాజ సునిశిత దృష్టినుంచి తప్పించుకోలేకపోయాయి. బహుశా ఈ వైరుధ్యాల చిత్రణలో భరద్వాజ ప్రదర్శించిన ప్రతిభకు జ్ఞానపీఠం లభించిందని భావించవచ్చు.
......................
ఒక కాంచనమాల, ఒక సావిత్రి, ఒక కాంచన, ఒక సిల్క్‌స్మిత - ఒకరిద్దర్ని వదిలేస్తే నటీమణుల బతుకు తెరమీద మోదాంతం, తెరవెనుక విషాదాంతం. వెండితెరమీద వేషాల కోసం ప్రయత్నించే అమ్మాయిలు ఒక్క ముందడుగు కోసం రెండు తప్పటడుగులు వేసే దుస్థితి సినిమా రంగంలో వుంది. ఈ దారుణ పరిస్థితుల్లో సాధించే తారాస్థాయి నటీమణుల విషయంలో క్షణికం. కుటుంబంలోనూ, సమాజంలోనూ, సినిమా రంగంలోనూ - పురుషాధిక్యత, డబ్బు వలలు పన్ని వాళ్ళను బలిపశువుల్ని చేస్తాయి. మాటలతో ఉచ్చులు పనే్న గిరీశం వంటి బతకనేర్చిన నక్కలు, తోడేళ్ళు సినిమా రంగంలో కోకొల్లలు. సాంకేతిక ప్రజ్ఞ, సృజనాత్మక ప్రతిభల మేళవింపుతో చలనచిత్రం ఒక కళగా ముఖ్యంగా ప్రజా సమూహాలను ప్రభావితం చేసే మాధ్యమంగా తిరుగులేని శక్తిని సాధించింది. రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్ళు’ నవలను యాభయ్యేళ్ళ క్రితం రాసేనాటికి సినిమా రంగం అంతో ఇంతో మంచి స్థితిలోనే ఉంది. అయితే, పై వెలుగులు కాక లోపటి చీకట్లు, పైపై మెరుపులు కాక లోలోని మరకలు రావూరి భరద్వాజ సునిశిత దృష్టినుంచి తప్పించుకోలేకపోయాయి. బహుశా ఈ వైరుధ్యాల చిత్రణలో భరద్వాజ ప్రదర్శించిన ప్రతిభకు ఈ యేడు జ్ఞానపీఠ పురస్కారం లభించిందని భావించవచ్చు.
ఎన్నో ఆశలతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన యువతి మంగమ్మ తెర కోసం ‘మంజరి’గా పేరు మార్చుకోవడంతో జీవితం క్రమక్రమంగా మారిపోతుంది. అయినా ‘మంగమ్మ’గా ఒక మనసు మూలలో బతుకుతూనే వుంటుంది. మనసు చంపుకుని సాధించిన సామర్థ్యం, పెంచుకున్న సహజ సంబంధాలు మంజరిని సినీమాయా ప్రపంచంలో నిలదొక్కుకునేటట్లు చేసిన మాట నిజమే. చుట్టూవున్న సమాజం మీద కసితో ఇంకా ఇంకా పైకి ఎదగాలనే ప్రయత్నాలు విజయవంతమైన మాటా నిజమే. అగ్రశ్రేణి నటీమణిగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలోకీ తొంగిచూసింది. అక్కడ ఆగలేక బాంబే వెళ్ళి హిందీ సినిమాలో కూడా సత్తా చాటుకుంది. తన చుట్టూ మూగిన ఈగలలాంటి వారిని పోషించింది. కాలేజీ స్థాపన వంటి ప్రజాహిత కార్యక్రమాల్లో ముఖ్యపాత్ర వహించింది. అమెరికా వెళ్ళి అక్కడి అగ్రశ్రేణి నటీనటులతో సమస్థాయిలో తిరిగే గౌరవం సంపాదించింది. కాని, ఆమే చివరి ఘట్టంలో అన్నట్టు ‘జీవితంలో విషాదం డబ్బు లేకపోవడం కాదు, మనల్ని ప్రేమించేవాళ్ళు లేకపోవడం. మనం ప్రేమించటానికి ఎవరూ దొరక్కపోవడం...’
ప్రేమరాహిత్యం అన్నది స్ర్తికి ఆత్మహత్యా సదృశం. తన అంతం కోసం, నటనా చాతుర్యం కోసం, డబ్బు కోసం ప్రేమిస్తున్నట్టు నటించేవాళ్ళ మధ్యన ఖైదీగా మగ్గిపోయింది. అగ్రశ్రేణి తారగా ఆమె సాధించుకున్న స్థానంనుంచి నెట్టేయటానికి కుట్రలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో దొంగనోట్ల వ్యవహారం, బ్లూఫిల్మ్ వ్యవహారం ఆమెను బందీని చేసి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ‘పాకుడురాళ్ళు’ పతనావస్థకు చేర్చాయి. ఫలితం సినీనటి మంజరి ఆత్మహత్య.
రావూరి భరద్వాజ ఈ వస్తువుకు కళాత్మక రూపం ఇవ్వటంలో పూర్తిగా సఫలీకృతమయ్యారు. కారణం ఈ అంశం మీద పూర్తి అధికారం వారు సాధించగలిగారు. అంటే సినిమాయా జగత్తులో వారు కొంతకాలం తిరుగాడారు. ఆద్యంతం పాత్రల మధ్య సాగే సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. ఒక పాత్ర నైజాన్ని సంభాషణ - స్వగతం రెండూ వెల్లడిస్తాయని భరద్వాజ నిరూపిస్తారు. దీంతో రచయిత కంఠస్వరం కూడా పాఠకుడికి అంతరాత్మ సందేశంలాగా వినిపిస్తుంది. రచనా కాలం నాటికి కొడవటిగంటి కుటుంబరావు వంటి అగ్రశ్రేణి రచయితల మూలంగా ‘వాస్తవికత’ ఒక సాహిత్య విలువగా బలపడింది. కుటుంబరావు కూడా సినీ ప్రపంచపు మాయాజాలాన్ని కొన్ని రచనల్లోను, ‘ఎండమావులు’ నవలలోనూ చిత్రించారు. భరద్వాజ కూడా సినీ జగత్తుకు సంబంధించిన గ్లామర్‌లో చిక్కుకోకుండా ‘పాకుడురాళ్ళు’ నవలను రూపొందించారు. కనుక అది ఒక సజీవ రచన కాగలిగింది. జీవిత పరిస్థితులు సృష్టించిన రచయిత రావూరి భరద్వాజ సవాళ్ళను ఎదుర్కోవటానికి సాహిత్య సృష్టి ఒక జీవితావసరమైనప్పుడు ఆ సాహిత్యం తప్పనిసరిగా విలక్షణమయినదే అయివుంటుంది.
ఒక్క మాటలో - సమకాలీన తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన రచయిత రావూరి భరద్వాజ. మట్టివాసన గిట్టనివాడు మంచి రచయిత కాలేడు.
రావూరికి జ్ఞానపీఠ్ వరించిన సందర్భంగా..
english title:
m
Date:
Monday, April 22, 2013