1927 జూలై 5న తాతగారి ఊరు ‘మొగులూరు’లో జన్మించారు భరద్వాజ. ఐదవ యేట తాడికొండలో అక్షరాభ్యాసం జరిగింది. చదువంటే భరద్వాజకు ఎంతో ఇష్టం. అయితే దారిద్య్రం అడ్డుపడింది. చదువుకు స్వస్తి చేసి యువజన కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తల్లిదండ్రులకు కోపం వచ్చింది. పనీపాటా లేకుండా బలాదూరుగా తిరిగే నువ్వు ఇక ఇంటికి రానక్కర్లేదని గెంటేశారు. కూటికోసం పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా కూడా పనిచేశాడు. చెరువు గట్లమీద, గుడిమెట్ల మీద పడుకునే వాడు. ‘కాదేది కూలికనర్హం’ అన్నట్లు ఏ పనైనా చేసేవాడు. కలప అడితిలో రంపం కోశాడు. కమ్మరి దగ్గర గాలి తిత్తులు ఊదాడు. సమ్మెట వేశాడు. క్రమంగా నాటకాలపై ఆసక్తి పెంచుకొని చిన్నచిన్న వేషాలేశాడు. లైబ్రరీలో పుస్తకాలు చదవాలనుకున్నాడు. అయితే నెలకు నాలుగణాలు చందా కడితే గానీ పుస్తకాలు ఇవ్వనన్నాడు లైబ్రేరియన్. ఆర్థిక స్తోమత లేని భరద్వాజ బాధను అర్ధంచేసుకున్న కొల్లూరి వెంకటేశ్వర్లు అనే శ్రేయోభిలాషి ఓ సంవత్సరం చందా మూడు రూపాయలు కట్టి చదువుకోమన్నారు. ఆ కృతజ్ఞతతోనే తన ‘పాకుడురాళ్లు’ నవలను ఆయనకు అంకిత మిచ్చి రుణం తీర్చుకున్నాడు భరద్వాజ. పగలంతా కూలి పని, రాత్రంతా పుస్తక పఠనం. క్రమంగా పద్యాలు రాయడం మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అప్పటికి 17 సంవత్సరాల భరద్వాజ తనకు 18 సంవత్సరాలని అబద్ధం చెప్పి మిలిటరీలో చేరాడు. 1945లో యుద్ధం ముగిశాక భరద్వాజ తిరిగి రోడ్డున పడ్డాడు.
1946లో నెల్లూరుకు చేరుకున్నాడు. ఆచార్య రంగాచారి సిఫార్సుతో జమీన్ రైతు వారపత్రికలో చేరాడు. అప్పుడే అనేక మంది సాహితీవేత్తలతో పరిచయాలు కలిగాయి. ఆత్రేయ (సినీ రచయిత) 8 పేజీల పుస్తకాన్ని అచ్చువేస్తే, అందులో ‘బక్కిడొక్క’ అన్న చిన్న కవిత రాశాడు భరద్వాజ. ఆ తర్వాత దీనబంధు వారపత్రికలో చేరాడు. విప్లవ భావాలు గల భరద్వాజ కులాంతర వివాహానికి సిద్ధమయ్యాడు. ‘రోహిణి’ అనే అనాధను పెళ్లాడాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. దీంతో నెల్లూరు వదిలేశాడు. అయితే ‘రోహిణి’ని మరిచిపోలేక తన నీలకలువలు, పంకజం, కలియని బాటలు అన్న కథల్లో ‘రోహిణి’ని నాయికను చేశాడు. ఆ తర్వాత రోహిణి పేరుతో ఓ ప్రచురణ సంస్థను కూడా ప్రారంభించి ప్రేమ రుణం తీర్చుకున్నాడు.
భరద్వాజకు పిల్లనియ్యడానికి భయపడేవారట. ఉద్యోగం లేదు సద్యోగం లేదు. పైగా నాస్తికుడు. పెద్దల భరోసాపై మల్లయ్య తన రెండో కూతురు కాంతాన్నిచ్చి 1948 మే నెలలో పెళ్లిచేశారు. ఈ పెళ్లికి మునిమాణిక్యం నరసింహారావు కూడా హాజరయ్యారట. ఆ తర్వాత భరద్వాజ తెనాలికి చేరుకున్నాడు. పిమ్మట మద్రాసుకు వెళ్లి చందమామలో ఉద్యోగం చేశాడు. తర్వాత అభిసారిక, జ్యోతి, చిత్రసీమల్లో పనిచేశాడు.
ఆ సమయంలోనే మద్రాసులో సినిమా వాళ్లతో పరిచయాలు పెరిగాయి. రత్నంగారి కలాల కంపెనీలో ఉద్యోగం దొరికింది. చాలీచాలని జీతంతో మద్రాసులో రోజులు గడపలేక హైదరాబాదుకు వచ్చేశాడు. ‘యువ’ మాస పత్రిక సంపాదకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో భరద్వాజ జీవితానికి ఓ స్థిరత్వం కలిగింది. చదువు లేకపోయినా గౌరవాలు పెరిగాయి. అవార్డులు, రివార్డులు వచ్చాయి. విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు కూడా వచ్చింది. ఆ తర్వాత ‘తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్త’గా కేంద్ర సమాచార ప్రచార శాఖలో చేరారు.
జర్నలిస్టుగా నిలదొక్కుకొని, సాహితీవేత్తగా పరిమళించాడు. రవీంద్రనాధ్ ఠాగూర్, గుడిపాటి వెంకటచలం రచనలంటే భరద్వాజకు ఎంతో యిష్టం. తరచి చూస్తే భరద్వాజ రచనల్లో పరోక్షంగా వీరి ప్రభావం కనిపిస్తుంది. చలం పురూరవ నాటకంలో వరూధిని కోసం నిరీక్షించే పురూరవుడ్ని మన భరద్వాజలో కూడా చూడొచ్చు. వరూధిని పురూరవుడ్ని వదిలి వెళ్తుంది. పురూరవుడు వరూధిని నిరీక్షణలో గడుపుతాడు. భరద్వాజ కూడా తనను వదిలి వెళ్లిన ‘కాంతం’ నిరీక్షణలో కాలం గడుపుతున్నాడు. వాక్య నిర్మాణం, భావవ్యక్తీకరణలో చలం అనుసరించిన మార్గాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం భరద్వాజ స్మృతి వాక్యాల్లో చూడొచ్చు.
1927 జూలై 5న తాతగారి ఊరు ‘మొగులూరు’లో జన్మించారు భరద్వాజ.
english title:
a
Date:
Monday, April 22, 2013