1. జీవితం తననెందుకు కన్నదని అతనాలోంచాడు
మరొకరి శ్వాసమీద బ్రతికేందుకు తానొక నీడని కాదనీ
ఈ ఉదయం తాజాగా మొలకెత్తిన బంగారు కిరణాన్ననీ అనిపించిందతనికి
కిరణాలు వాటంతట అవి పుడతాయనీ
పుట్టించేవేవైనా నీడలై మిగులుతాయనీ
తన నమ్మకాలు చేరలేని లోలోపలి స్వచ్ఛతలో మెరిసింది
2. తనని తనలాగే
దుఃఖించమనీ, నవ్వమనీ, కోపించమనీ, శపించమనీ, దీవించమనీ
జీవితం అతన్ని కన్నది
అంతుతెలియని దాహం పుట్టించే, మోహం పుట్టించే జీవితం
అతని అనుభవం కోసమే తన చిత్ర విచిత్ర మెరుపుల మాలికలని
అతనికన్నా ముందు సృష్టించి అతన్ని ఇక్కడికి విడిచింది
తనవైన కళ్లతో తనకై సృష్టించిన ఇంద్రియజాల ప్రపంచాన్ని చూడమనీ
తనదైన దేహంతో, ఆకలితో, ప్రశ్నలతో ప్రపంచమంతా పరిగెత్తమనీ
ఎవరూ చూడనిచోట తనదైన చిరునవ్వునీ, కన్నీటినీ,
ఏకాంత సంగీతాన్నీ పదిలపరచమనీ
విడిచి వెళ్లేలోగా కాస్తంత వెలుతురునో, చీకటినో,
వీలయితే ఖాళీనో లోకానికి కానుక చెయ్యమనీ
జీవితం అతని చెవిలో జాగ్రత్త చెప్పి మరీ సృష్టించుకొంది
3. జీవితం తననెందుకు కన్నదో తొలిసారి కళ్లు తెరుచుకున్నాయతనికి
తన నియమాలు ఇతరుల్నెలా బాధిస్తాయో,
వాటిమధ్య తన నెట్లా బంధించుకొని
కమురు వాసనల గాలిని శ్వాసిస్తున్నాడో
జీవితం అతని చెవిలో చెప్పి మృదువుగా మొట్టింది
నిన్నటి స్వేచ్ఛా సూత్రం ఇవాళొక కొత్త సంకెల అవుతుందనీ
ప్రవాహాన్ని జీవించడమంటే ప్రవహించటమేననీ
తెరుచుకొంటున్న కళ్లముందు వాలుతున్న వానతెరలా,
వెలుతురులా తెలిసింది అతనికి
4. గతించిన కోటి తొలి ఉదయాల, రానున్న తొలి ఉదయాల తాత్పర్యమేమిటో
తననీ, ఇతర్లనీ, అనేకానేక ద్వంద్వాలనీ జీవితం ఎందుకు కన్నదో
అమాయకత్వంలా, అద్దంలా, ఆకాశంలా విచ్చుకొన్న ఈ ఉదయం
అతనికి నిజంగా బోధపడింది.