ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్ర్తి ఉంటుందన్న వాడుకలో ఎంత నిజం వుందో భరద్వాజగారి సహధర్మచారిణి ‘కాంతమ్మ’ను చూస్తే తెలుస్తుంది. ‘సహధర్మచారిణి అనే భావనకు రూపంవస్తే అది కాంతమ్మ అవుతుందంటాడు’ భరద్వాజ. కాంతమ్మగా ఉన్నప్పుడు కూడా పూజించాడు. ఆరాధించాడు. ఆమె లేనప్పుడు కూడా కాంతమ్మను ఆరాధిస్తూనే వున్నాడు. భరద్వాజ దృష్టిలో కాంతమ్మకు దైవానికి మధ్య భేదం లేదు. దైవం, కాంతమ్మల మధ్య అభేదాన్ని దర్శించగలిగిన ముని భరద్వాజ.
‘‘మొదటి తల్లిపేరు - లేమి (దరిద్రం) నా రెండవ తల్లి పేరు - కాంతం’’ (్భర్య) అంటాడు. భగవంతుడ్ని దర్శించగలిగిన భరద్వాజ భార్యలో తల్లిని చూడగలగటం గొప్ప విషయం కాకపోవచ్చునేమో గానీ భర్తకు తల్లిలా మనగలిగిన కాంతమ్మ మాత్రం నిజంగా ధన్యురాలు. సతీ వియోగంతో పరమశివుడు పడిన దుఃఖం ఎటువంటిదో తెలీదు గానీ భరద్వాజ పడిన దుఃఖం మాత్రం అక్షరాలుగా ప్రవహించి అయిదు స్మృతి రచనలుగా అవతరించాయి. కాంతమ్మను గుర్తుచేసుకుంటూ ఏకాంతంలో భరద్వాజ రోజూ రాసుకున్న డైరీలే ఈ స్మృతి రచనలు. అవి 1. నాలోని నువ్వు 2. అంతరంగిణి 3. ఐతరేయం 4. అయినా ఒక ఏకాంతం 5. ఒకింత వేకువ కోసం, ఇవన్నీ కూడా స్మృతి కావ్యాలుగా ప్రసిద్ధికెక్కాయి. భరద్వాజ సతీమణి కాంతమ్మగారు 1986 ఆగస్టు 1వ తేదీన మరణించారు. ఆరోజు నుండి భరద్వాజ డైరీలు కాంతమ్మ స్మృతితో తడిసి ముద్దయ్యాయి. బోయవాడి శోకం శ్లోకమై రామాయణానికి నాంది పలికితే, సతీవియోగ శోకం భరద్వాజను కదిలించి కన్నీటి కావ్యమైంది. తనలో అర్ధ భాగమైన అర్ధాంగి దూరమైతే పడే బాధ ఎంత దుర్భరంగా వుంటుందో భరద్వాజ ‘నాలోని నువ్వు’లో అనుభవించాడు. 1987 జనవరి నుండి 1987 డిసెంబర్ వరకు భరద్వాజ రాసుకున్న డైరీల సంపుటి ‘అంతరంగిణి’. భార్య దూరమై దుఃఖ తీవ్రత పెరిగిన వైనం ఇందులో కనిపిస్తుంది. బాధా తీవ్రత నుంచి తేరుకుంటూ లౌకిక వాసనల్ని మరచి అలౌకిక లోకంలో విహరిస్తాడు భరద్వాజ. కాంతమ్మలో దైవాన్ని సందర్శించడం ఇందులో ప్రధానమైంది. టాగూర్ గీతాంజలిలో మాదిరిగా దైవంతో మొరపెట్టుకోవడం, దైవాన్ని వేడుకోవడం ఇందులో చూడొచ్చు.
కాంతమ్మగారి వ్యక్తిత్వాన్ని ‘ఒకింత వేకువ కోసం’లో పరిపూర్ణంగా దర్శిస్తాడు. భరద్వాజ ప్రాపంచిక దృక్పథాన్ని సామాజిక చేతనను యిందులో స్పష్టంగా చూడొచ్చు. అలాగే భార్య కాంతమ్మపై దుఃఖం క్రమంగా కరుగుతూ సామాజిక వేదనగా మారడం గమనించవచ్చు. భార్య పోయిన అయిదేళ్లూ భరద్వాజ వియోగంలోనే ‘యోగాన్ని’ అనుభవించాడు. భార్యలో బిడ్డనీ, తల్లినీ, చెల్లినీ, నెచ్చెలినీ చూడగలగటం భరద్వాజకే చెల్లింది. దుర్భరమైన పేదరికంలో కూడా వెన్నంటి వున్న భార్య... ప్రాపంచిక ఈసడింపులతో, సమస్త దారిద్య్రాలతో నిండిపోయినా తన బతుకును పునీతం చేసిన భార్య... అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా పరలోకానికి వెళ్లిపోతే? (అదీ తను లేని సమయంలో) ఎదురయ్యే దుఃఖ భారాన్ని తట్టుకొని నిలబడటానికి భరద్వాజ అనుభవించిన వివిధ మానసిక దశల్ని ఈ అయిదు కావ్యాల్లో దర్శించవచ్చు.
రవీంద్రుడి సౌందర్య పిపాసకు సామాజిక స్మృహను జోడించడం భరద్వాజ ప్రత్యేకత. భరద్వాజ జీవితంలో ఎన్నో ఈతి బాధల్ని అనుభవించాడు. పేదరికంలో మగ్గిపోయాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు. భంగపడ్డాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎదురొడ్డి నిలిచాడు. పడిలేచిన కెరటమయ్యాడు. స్వసుఖం కంటే లోకం ఆనందాన్ని కోరుకున్నాడు. ‘‘ఆకలి, దరిద్రం, అజ్ఞానం, దోపిడి ఇవి లేని సమాజం కావాలి. నేను సుఖపడ గలిగేది సంతోషం. నా చుట్టూ ఉన్నవారూ సుఖపడితే కలిగేది ఆనందం’ అంటారు భరద్వాజ. దుర్భర దారిద్య్రంలో పుట్టినా... మనసున్న మారాజు ఆయన. పుట్టెడు దుఃఖంలో మునిగినా... అందులోని ఆనందాన్ని వెదుక్కునే వౌనముని భరద్వాజ. ‘‘నేనిప్పుడు రాముడ్ని, పార్వతి లేని పరమశివుడ్ని. ఎందరెందరున్నా, అందరి మధ్యా ఒంటరివాడ్ని’’ అంటారు భరద్వాజ. తనకు ప్రాణప్రదమైన ‘కాంతం’ లేని ఏకాంతంలో ఈ స్మృతి రచనలు చేశానని చెప్పుకున్నా నిజానికి ఏకాంతంలో కూడా కాంతాన్ని దర్శించగలిగిన ద్రష్ట భరద్వాజ. జ్ఞానపీఠ అవార్డు పొందిన ఆనందాన్ని పంచుకోడానికి అర్ధాంగి కాంతమ్మ పక్కన లేకపోయిందే’ అన్న బాధ తప్ప ప్రస్తుతం భరద్వాజకు ఇతరత్రా అసంతృప్తి ఏదీ లేదు.
ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్ర్తి ఉంటుందన్న వాడుకలో ఎంత నిజం వుందో భరద్వాజగారి సహధర్మచారిణి ‘కాంతమ్మ’ను చూస్తే తెలుస్తుంది.
english title:
k
Date:
Monday, April 22, 2013