** ఎన్.హెచ్ 4 (ఫర్వాలేదు)
తారాగణం: సిద్ధార్థ్, ఆశ్రీతాషెట్టి, కెకె మీనన్, అవినాష్, సురేఖావాణి, కిషోర్, నరేన్, దివ్య స్పందన, దీపక్, వివేక్, కార్తీ, తదితరులు.
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
నిర్మాతలు: బి.సుబ్రహ్మణ్యం, సురేష్ ఎస్.
దర్శకత్వం: మణిమారన్
చిత్ర కథకి పేరు సరిపోతుందా? లేదా? అన్న కోణంనుంచి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం ప్రేక్షకుల్ని ఆకట్టుకోడమే పరమావధిగా సినిమాకి టైటిల్స్ ఇచ్చేసే ఈ కాలంలో ఎంచుకున్న కథకు నూటికినూరుపాళ్లు సరిపోయేలా ‘ఎన్‌హెచ్ 4’అంటూ పేరుపెట్టడంతోటే దర్శక నిర్మాతలకు మంచి అభిరుచి ఉన్నదన్న సంగతి అందరికీ అర్థమైంది.
చిత్ర కథ అంతా పేరుకు తగ్గట్లే జాతీయ రహదారి (ఎన్‌హెచ్-నేషనల్ హైవే) మీదే నడుస్తుంది. ఒకే కాలేజీలో చదువుకుంటున్న రితిక (ఆశ్రీతాషెట్టి) ప్రభు (సిద్ధార్థ్)ల మధ్య ముందు ప్రేమ అన్నది లేకపోయినా అనంతర పరిణామాలవల్ల దగ్గరవుతారు. ఆ దగ్గరవడం ఎంత దగ్గరంటే కాలేజీలో ఆఖరి పరీక్ష అయిన తర్వాత ‘నన్ను తీసుకువెళ్లిపో’ అని రితికే, ప్రభునడిగేంతవరకూ... అలా తీసుకువెళ్లడం (వ్యావహారిక భాషలో కిడ్నాప్) వల్ల మినిష్టర్ తండ్రి మనుషుల్ని తప్పించుకోవాలంటే తొందరగా బెంగుళూరు (అబ్బాయి- అమ్మాయి చదువుతున్న కాలేజీ ఉన్న నగరం) నుంచి అబ్బాయి వెళ్ళాలనుకున్నా నగరం (చెన్నై)కు దగ్గరదారి ‘ఎన్‌హెచ్ 4’ కనుక అదే దారిలో వెళతారు. అనుకున్నట్లే ఆ మినిష్టర్ తండ్రి (అవినాష్) వీళ్లని పట్టుకు రమ్మని ఎసిపి మనోజ్ (కెకె మీనన్)ను పురమాయిస్తాడు. అతను ఈ ప్రేమికుల్ని ఎలా పట్టుకున్నాడు? అలా పట్టుకునే ప్రయత్నాన్ని ప్రభు ఎలా ప్రతిఘటించాడు? ఎలా అధిగమించాడు? అన్న దాంతో కథ ముగుస్తుంది. కథ చూస్తూంటే ఇంత చిన్న లైన్‌తో రెండు గంటల పదకొండు నిమిషాలు ఎలా థియేటర్లో కూర్చోగలం అని మీకనిపించవచ్చు. కానీ వెట్రిమారన్ స్క్రీన్‌ప్లే మహిమవల్ల కూర్చున్న సీటుముందువరకూ వచ్చి చూస్తాం. దర్శకుడి గొప్పదనమేమిటంటే కావల్సినన్ని డ్యూయెట్లు, ఇప్పటి యూత్ సినిమాల్లో మాటల మాటున వచ్చే బూతుల్ని వినియోగించుకునే ఆస్కారమున్నా ఆ ఛాయలకు ఏమాత్రం పోకపోవడం. ఇంకో చెప్పుకోతగ్గ అంశమేమిటంటే మామూలుగా కథ ఏ ప్రాంతంలో జరిగినా స్థానిక భాషను మరచి చిత్రానికి చెందిన భాషనే వినియోగిస్తారు. కానీ ఇందులో అలాకాకుండా కథాపరంగా బెంగుళూరులో జరుగుతుంది కనుక అక్కడి స్థానిక భాషనే (కన్నడం) ఉపయోగించడం, ప్రేక్షకుల సౌకర్యార్థం తెలుగు సబ్ టైటిల్స్‌లో ఆ మాటలను అనుకరించి వేయడం జరిగింది. అయితే ఆ ఫ్లో అలాగే కొనసాగి ఒకచోట చిత్రంలో పాత్ర తెలుగులో మాట్లాడినా దీనికీ ‘తెలుగు’ సబ్ టైటిల్స్ వేయడమూ జరిగింది. అందుకు ఉదాహరణగా ఒక పాత్ర ‘రెండు నిమిషాల్లో కుప్పంలో ఉంటా’ అని తెలుగులోనే అంటుంది.
కానీ దాన్నికూడా తెలుగు టైటిల్స్‌తో తెరపై చూపుతారు. చిత్రంలో సమాంతరంగా ఎసిపి మనోజ్ భార్య వాయిస్‌తో వారి ప్రేమ వ్యవహారం తెలుపుతూ వుండడం జరుగుతుంది. కానీ ఆమెను తెరపై చూపరు. ఆమె కనపడినంత ప్రభావాన్ని సెల్‌ఫోన్ సంభాషణల ద్వారా అద్భుతంగా పండించారు. సాధారణంగా ఫ్లాష్‌బ్యాక్‌లు ఎంత నేర్పుగా కథలో ఒదిగేలా చూపినా ఎక్కడో అక్కడ కొంతలోకొంతైనా గందరగోళానికి గురవుతాయి. కానీ ఇందులో అలాంటి ఫ్లాష్‌బ్యాక్‌లు చాలా ఉన్నా, ఎక్కడా అస్పష్టతకు ఆస్కారమివ్వలేదు. అయితే కథ నడవడంకోసం పోలీసు విభాగం ఇలాంటి సందర్భాలలో వ్యవహరించే తీరు తదితరాల్లో దర్శకుడు కొంత వెసులుబాటు తీసుకున్నారు. ఉదాహరణకు అలా సుదీర్ఘంగా జరిగే కిడ్నాప్ ఎపిసోడ్‌లో వెదుకులాడే పనికివెళ్లే వాహనాల టైర్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సినిమాలోలా హీరో ఏవో మేకులు/ గాజుపెంకులూ వేసేస్తే ఆగిపోయే టైపులో పోలీసువారుండరు. కానీ సాధ్యమైనంతవరకూ లాజిక్‌నూ దృష్టిలో పెట్టుకున్నాడనడానికి, అమ్మాయికి మేజర్ (18ఏళ్ల వయసు) ఏజ్ రావడం, దాంతో ఆమెనెవరూ నిర్బంధించలేరు.. అన్న వాటిపై దృష్టిపెట్టడాన్ని చెప్పుకోవచ్చు. అయితే అన్ని సినిమాల్లోలాగే ఇందులోనూ యువతరం.. అందులోనూ విద్యార్థి దశలోని వారు తప్పనిసరిగా ‘మందు’కు బాగా అలవాటుపడినవారే అన్నట్లు హీరో బ్యాచ్ అంతా చాలా దృశ్యాల్లో ‘అదే’ ధ్యాసతో ఉంటారు. ఈ ఆలోచనాసరళి చాలా ప్రమాదకరం. ఎందుకంటే విద్యార్థుల సీన్లు తప్పనిసరిగా ‘మందు’ నేపధ్యమై అయ్యుండాలి అన్న విషయం అందరి మెదళ్లలోనూ ఇలాటి వాటివల్ల నమోదైపోతుంది కనుక. ఈ సినిమాలో ఇంకో అడుగుముందుకేసి చిత్ర ప్రారంభ సన్నివేశాల్లో ఓ పాత్రతోటి తాగడం, తిరగడం.. లాంటివి చెయ్యకపో తే ఇంత దూరం వచ్చి కాలేజీలో చేరడమెందుకు? అని మాట్లాడిస్తారు. ఇది చాలా అనారోగ్యకర పోకడ. ఇక నటీనటుల విషయానికొస్తే సిద్ధార్థ్, ఆశ్రీతాషెట్టి, కె.కె.మీనన్‌ల పాత్రల్లో ప్రథమ తాంబూలమివ్వతగ్గ నటనను మీనన్ ప్రదర్శించారు. ఒకపక్క నేరస్థుల పట్ల వ్యవహరించే కఠిన ధోరణినీ, ప్రేమికుల కథ విని వారు చేస్తున్నది కరక్టేఅన్న భావనను పలికించడంలోనూ, కన్న తండ్రీ కూతుర్ని అవసరమైతే, ‘ఖతం’చెయ్యి అని హుకుం జారీచేసినప్పుడు విస్తుపోయిన విధానాన్ని పరమోన్నతంగా మీనన్ పలికించారు. సిద్ధార్థ్ ఇప్పటివరకూ తనపై ఉన్న ‘లవర్ బోయ్’ బ్రాండ్ నుంచి వేరుపడాలని ఈ విభిన్న సినిమాను ఎన్నుకున్నట్లున్నారు. ఆ దిశగా సిద్ధార్థ్ శాయశక్తులా చేసినా పూర్తిస్థాయి యాక్షన్ హీరో అనిపించుకోడానికి ఇంకా కొన్ని మెళకువలు పాటించాల్సి వుంది. రితికగా ఆశ్రీత తన పరిధిలో బానే చేసింది. ముఖ్యంగా తనవల్ల మిత్ర బృందం చిక్కుల్లో ఇరుక్కుంటోందని తెలిసి తనే స్వచ్ఛందంగా తాను ఆ దారినుంచి వెళ్లిపోతానని బాధాతప్త హృదయంతో వెల్లడించిన తీరులో పరిణితి చెందిన నటనను పలికించారు మిగిలిన పాత్రల పరిధి తక్కువ. ప్రకాష్‌కుమార్ బాణీల్లో ‘నీవెవరో, నేనెవరో’పాట బావుంది. చిత్రంలో మరో మెచ్చుకోతగ్గ అంశం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని (ఎవరు ఎక్కడినుంచి మాట్లాడినా వారున్న ప్రదేశం కనుక్కోవడం, సెల్‌కుండే అంతర్జాతీయ నెంబరు, వాయిస్ మేచింగ్...) విషయాన్ని చర్చించడం. పూర్తిగా వినియోగించుకోవడం. చిత్ర బృందానికి చిత్రంపై ఉన్న పరిపూర్ణ నిబద్ధతనైనా దృష్టిలో పెట్టుకుని ఒకసారి చూసి ప్రోత్సహించతగ్గ మంచి ప్రయత్నం ‘ఎన్‌హెచ్ 4’ అనడంలో సందేహం లేదు.