* గౌరవం (బాగోలేదు)
తారాగణం: శిరీష్, యామీగౌతమ్, ప్రకాష్‌రాజ్, ఎల్బీశ్రీరాం, నాజర్, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: థమన్
నిర్మాత: ప్రకాష్‌రాజ్
దర్శకత్వం: రాధామోహన్
ఊరందరిది ఓదారి అయితే ఉలిపిరి పిట్టది మరోదారి అన్న చందంగా కథను ఎంచుకున్నట్లు అనిపిస్తుంది ‘గౌరవం’తో తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్. ఎందుకంటే సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాలనుండి పరిచయమయ్యే వాళ్లంతా సాధారణంగా యాక్షన్ చిత్రాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని అలరించాలనే తలంపుతో కథల్ని ఎంచుకుంటారు. కానీ తెలుగులో పెద్ద నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ చిన్న పుత్రుడు అల్లుశిరీష్ మాత్రం పూర్తి భిన్నంగా ఒక సామాజిక సమస్య ఇతివృత్తంగా ఉండే కథతో హీరోగా పరిచయం అవడానికి ప్రయత్నించడం విశేషం. మరో విశేషం ఏంటంటే మొదటి సినిమానే వేరే నిర్మాణ సంస్థలో చేయడం. ఇక చిరంజీవి మేనల్లుడి హోదాతోపాటు సోదరుడు అల్లు అర్జున్ తమ్ముడు అనే అంశాలు ఉండటంతో శిరీష్ ‘గౌరవం’ సినిమాకు విడుదలకు ముందే కావలసినంత ప్రచారం వచ్చింది. దీనికితోడు దక్షిణాది నటుల్లో అత్యంత ప్రతిభావంతుడైన వారిలో ఒకరిగా గుర్తింపుఉన్న ప్రకాష్‌రాజ్ ‘గౌరవం’ సినిమాను నిర్మిస్తుండటం.. సినిమాలు చేయడంలో మంచి అభిరుచి, పరిణితి ఉన్న తమిళ దర్శకుల్లో ఒకరిగా పేరున్న రాధామోహన్ దర్శకత్వం చేస్తుండటం వంటి అంశాలు కూడా ‘గౌరవం’ సినిమా ప్రచారానికి ఎంతో సహకరించాయి. కథలోకెళితే...గౌరవ హత్యలు (హానర్ కిల్లింగ్స్) నేపథ్యంగా కథ సాగుతుంది. గత రెండుమూడేళ్లనుండి ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఈ తరహా హత్యలు ఎక్కువగా జరుగుతుండటంతో ఈ పాయింట్‌ను ఆధారం చేసుకుని గౌరవం కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. కథ పరంగా హీరో అల్లు శిరీష్ అమెరికాలో స్థిరపడ్డ వ్యాపార కుటుంబానికి చెందినవాడు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే ఆఫీస్ పనిమీద అమెరికానుండి హైద్రాబాద్ వస్తాడు. పని ముగిసిన తరువాత హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ క్లాస్‌మేట్ శంకర్‌ను కలుసుకుందామని ఎస్‌యంపల్లి వెళ్తాడు. స్నేహితుణ్ణి కలుసుకుందామని వెళ్లిన హీరోకు తన స్నేహితుడు సొంత ఊరిలోనే కనిపించకుండాపోతాడు. తన స్నేహితుడు ఏమయ్యాడు..? ఎందుకు శంకర్ కనిపించకుండా పోయాడు అని హీరో చేసే అనే్వషణలో చివరకు శంకర్ కులాంతర ప్రేమే కారణమని తెలుసుకుంటాడు. సృష్టికి ప్రతిసృష్టిచేస్తున్న యుగంలో కూడా కుల గజ్జిని కొంతమంది మూర్ఖులు వదులుకోవడానికి సిద్ధంగాలేరని హీరో తెలుసుకుంటాడు. గ్రామాల్లో కులం ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఎక్కువ కులానికి చెందిన ప్రకాష్‌రాజ్ అతని కొడుకు పాత్రల వ్యక్తిత్వాలతో చూపించడంలో దర్శకుడు కొంతవరకే విజయవంతమయ్యాడు. అలాగే భారతీయ సమాజంలో తెలివైనవాళ్లు చేసిన కులం కుట్రకు తక్కువ కులంవాళ్లు ఎలా ఆత్మన్యూనతకు...దోపిడీలకు గురి అవుతున్నారో శంకర్ తండ్రి పాత్ర చేసిన ఎల్బీశ్రీరాం ద్వారా చూపించారు. తక్కువ కులంవాడిని ప్రేమించిందనే కారణంతో ప్రకాష్‌రాజ్ కొడుకు.. తన చెల్లిని.. ఆమె ప్రియుణ్ణి నరికి చంపే సన్నివేశం.. ఈ దేశంలో కుల పిచ్చితో ఊగిపోయే రక్తపిశాచుల మనస్తత్వానికి అద్దం పడుతుంది. అలాగే ‘గౌరవం’ అనేది కులంతో రాదు.. ప్రవర్తనతో వస్తుంది అనే పరిణితి చెందిన హీరో పాత్ర మార్పును కోరుకుంటున్న నవయుగపు యువత ఆలోచన ధోరణికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. కుల పిచ్చి ముదిరి చివరకు సొంత చెల్లిని నరికి చంపిన కొడుకుని కాల్చి చంపిన ప్రకాష్‌రాజ్ తండ్రి పాత్ర.. రెండుమూడు తరాల మానసిక సంఘర్షణకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. కథ అంతా బావున్నట్లే అనిపిస్తుంది కానీ.. భారతీయ సమాజాన్ని శాసిస్తున్న కులం..కులాంతర ప్రేమల పరిణామాల్నీ చూపడంలో దర్శకుడు రాధామోహన్ లోతుగా సన్నివేశాల్నీ స్పృశించకపోవడం పెద్ద లోపం. అంతకుమించిన మరో ఘోరం ఏంటంటే.. ఎక్కడో అమెరికాలో ఉంటున్న హీరో..తన స్నేహితుడు కోసం ఒక పల్లెటూరు వచ్చి ప్రాణాలకు తెగించి నిజాలు అనే్వషిస్తాడు. హీరో పాత్ర చిత్రీకరణపరంగా చూసినప్పుడు బావుందనిపిస్తుంది. కానీ..హీరో తన జీవితానే్న పణంగా పెట్టి తన స్నేహితుడికోసం చేసే పరిశోధన ఆడియన్స్‌కు భావోద్వేగపరంగా అనుసంధానం చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో, అతని స్నేహితుడి మధ్య.. వాళ్ల స్నేహబంధం విలువను..తీవ్రతను తెలియజేసే సన్నివేశాలు ఒక్కటి కూడా లేకపోవడమే ప్రధాన కారణం. అసలు సినిమా కథకు మూలమైన పాయింట్‌ను గాలికి వదిలివేసి నేలవిడిచిసాము చేశారు. హీరో అమెరికానుండి ఇక్కడకు వచ్చి ఏదో పనిలేక చేస్తున్నట్లు ఉంటుందే కానీ.. తన ఆత్మీయ మిత్రుడికోసం, అతని కుటుంబం కోసం.. అతని వర్గం కోసం పోరాడుతున్నట్లు అసలు అనిపించదు. ఇది సినిమాకు పెద్ద మైనస్. దీనికితోడు వినోదం జీరోస్థాయిలో ఉండటం. దీంతో ‘గౌరవం’ సినిమా సగటు చిత్రం కంటే తక్కువగానే మిగిలిపోయింది. హీరోగా మంచి కథను ఎంచుకున్నప్పటికీ శిరీష్ ఎమోషన్స్ పండించటంలో ఏ మాత్రం ప్రతిభ చూపలేకపోయాడు. తెరపైకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లేకుండానే దూసుకొస్తున్న నేటి యువతరం హీరోలముందు శిరీష్ పూర్తి తేలిపోయాడు. నృత్యాలపరంగా చెప్పుకోవడానికి అతడిలో ఏమీలేదు. దర్శకుడు ఎంచుకున్న ప్రతి నటుడితో నటన బాగా చేయించుకోగలిగాడు (అల్లు శిరీష్‌తోతప్ప) కానీ.. కథ, కథనం విషయంలో శ్రద్ధ చూపకపోవడం ప్రేక్షకులకు శాపం. ఇక ఉన్నంతలో హీరోయిన్ యామీగౌతమీ ఫరవాలేదనిపించింది. థమన్ నేపథ్య సంగీతం ఓకె అనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బావున్నాయి. చివరకు కులం కోసం మనిషిని చంపుకోవడంలో అర్థంలేదు.. మనిషిని బ్రతకనివ్వడంలో ‘గౌరవం’ వుందనే సందేశం మాత్రమే ఆలోచింపచేస్తుంది. కానీ, ఏం లాభం? ఏది ఏమైనా ఇలా..తొలి చిత్రమే అల్లు శిరీష్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చడం దురదృష్టకరం.