ఆలోచనా సులోచనాలు
-కూర చిదంబరం
పుటలు: 136, వెల: రూ.60/-
ప్రతులకు: పాలపిట్టబుక్స్,
16-11-20/6/1/1
403, విజయసాయి రెసిడెన్సీ
మలక్‌పేట, సలీంనగర్,
హైదరాబాద్- 500036.
చుట్టూ వున్న పరిస్థితుల్ని చూసినప్పుడు, వార్తాపత్రిక చదువుతున్నప్పుడు, సొంత వూరు వెళ్లినప్పుడు, ఏదో సన్నివేశం కంటపడినప్పుడు, ఒక గ్రంథం అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రయాణంలో వున్నప్పుడు, గొప్పవారిని కలిసినప్పుడు, ఇంకా ఇలాంటి అనేకానేక సందర్భాల్లో మనకు ఒక అనుభూతి కలుగుతుంది. అది తళుక్కుమంటుంది. తర్వాత మరుపుల మడతల్లోకి తరలిపోతుంది. కాని ఈ గ్రంథ రచయిత కూర చిదంబరం ఆ అనుభూతి గురించి ఆలోచించి విలక్షణ సంవిధానంతో దానిని లఘు వ్యాసరూపంలో అక్షరబద్ధం చేయడంలో సిద్ధహస్తుడు.
ఇందులో యాభై తొమ్మిది లఘు వ్యాసాలున్నాయి. సగటున రెండు పుటలున్న వ్యాసానికి కథ, గల్పిక, యాత్రా వృత్తాంతం, భావధార వంటి విషయ ప్రక్రియా గుణాలు సంతరింపజేయడంలో రచయిత ప్రతిభ ఆవిష్కృతమవుతుంది. సమాజం పట్ల స్పష్టమైన దృక్పథం, నిశిత పరిశీలన, లోతైన ఆలోచన, సృజన శీలం, జనహిత కాంక్ష, రచనా కౌశలం ఇందుకు దోహదం చేకూర్చాయి. ప్రతి వ్యాసంలోను సందేశమో, మంచి మాటో, చమత్కారమో, ఆసక్తికర అంశమో నిక్షిప్తమై వుంటుంది. కథనరీతి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సాధారణంగా ఈ లక్షణం మామూలు వ్యాసప్రక్రియలో కనిపించదు. రచయిత స్వగ్రామం కరీంనగర్ జిల్లా వేములవాడ. 1950 ప్రాంతంలో అది ఎలా వుండేదో, దాని ప్రత్యేకతలేమిటో అయిదు వ్యాసాల్లో ఆత్మీయ స్పర్శతో చిత్రించారు. ఆ వూరి సహజ సౌందర్యాన్ని, వాతావరణాన్ని నెమరువేసుకుంటూ ‘‘నేటి తరం వారు తమ బాల్యంలో ఏమి పోగొట్టుకుంటున్నారో తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది’’ అని అంటారు. అప్పట్లో ఆలయం కోనేరు స్థితిని ఇలా చమత్కరించారు. ‘‘ఊరంతటికీ, గుడికీ, వచ్చే జనానికీ ఒకే చెరువు, జలాశయం, ధర్మగుండం స్నానానికీ, పానానికీ, బట్టలుతుక్కోవటానికీ, భక్తజనుల పాపప్రక్షాళనకూ, మహిషాసురావతారాల క్రీడాస్థలీ అదే.’’ అక్కడి మూలవాగు ప్రస్తావన తెచ్చి ‘‘నదులు తీరాల్ని విడదీయటం లేదు కలుపుతున్నాయి’’అనే సదుక్తితో వ్యాసం ముగిస్తారు. పిల్లలకు తెలుగులో నీతి పద్యాలు నేర్పవలసిన ఆవశ్యకతను సోదాహరణంగా విశదం చేస్తూ, ఇంగ్లీషు రైమ్స్ పిల్లల్లో ‘నెగెటివ్’ భావాలు పెంచుతాయనే కారణంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యాలయాల్లో వాటిపై నిషేధం విధించిన సంగతి వెల్లడించారు. ఒక వార్త ఆధారంగా రాసిన వ్యాసం ఇలా ప్రారంభమవుతుంది. ‘‘అమ్మా ధనలక్ష్మిని తెచ్చాం’- ఇంటి వసారాలోకి నలుగురు అన్నదమ్ములు ప్రవేశిస్తూ వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లినుద్దేశించి వేసిన కేక’’. ఇది కథలాగా నడుస్తుంది. ఇది పంజాబ్ రాష్ట్రం మన్నా జిల్లాలోని ఒక తెగలోవున్న ‘బహుభర్తృత్వం’ ఆచారానికి సంబంధించింది. చివర్లో ‘‘మానవ సంబంధాల్ని నిర్ణయించేవి వావివరుసలు కావు, ఆర్థికావసరాలు’’ అంటారు. తాలిబన్లు బామియాన్ బుద్ధవిగ్రహాల్ని ధ్వంసం చేసినందుకు బాధపడుతూ ‘‘మంచి అయినా చెడుఅయినా మానవ చరిత్రను పరిరక్షించుకుని ముందుతరాల వారికి అందించటం మన కర్తవ్యం’’అని ఉద్బోధిస్తారు. ‘ఎఫ్.డి.ఐ’ విధానాన్ని నిరసిస్తూ ‘‘మనమందరం సంఘటితంగా నిలబడి విదేశీ పెట్టుబడులు ఈ (రీటైల్) రంగంలోకి రాకుండా అడ్డుకోవాలి. మన భవితను మనం కాపాడుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. కుమార్తె వుంటున్న కాన్పూరుకు రైల్లోవెళ్తూ తన అనుభవాల్ని ఒక వ్యాసంలో రసస్ఫోరకంగా చెప్పారు. సత్యసాయి సందర్శనంతో కలిగిన అలౌకికానందాన్ని ఒక వ్యాసంలో భక్తిపారవశ్యంతో వివరించారు. జాయ్‌సేన్ రచించిన ‘కానె్సప్ట్ ఆఫ్ కంప్లీట్ రివిజన్’ గ్రంథం చదివి అందులోని ఆశ్చర్యజనకమైన విషయాలను మరో వ్యాసంలో తెలియజెప్పారు. మంచిశైలిలో కూర్చిన ఈ గ్రంథం జిజ్ఞాసువులైన పాఠకుల్ని తప్పక ఆకట్టుకుంటుంది.