ఈ మట్టి మనదే
(కవితా సంపుటి).
కవి : ఎస్.ఆర్.పృథ్వి,
వెల: రు.75,
ప్రతులకు :
శ్రీమణికంఠ బుక్ సెంటర్,
మెయిన్‌రోడ్, రాజమండ్రి-1
ఎస్. ఆర్.పృథ్వి చాలా అనుభవంగల కవి. మినీ కవిత్వంతో ప్రారంభించి, రుబారుూలు రాసి, దీర్ఘ కవితను ప్రచురించి, నానీలు వెలువరించిన కవి. సాహితీ కార్యకర్తగా, సంపాదకునిగా, చైతన్యమూర్తిగా పేరు పొందిన కవి. తాజా కవితా సం పుటి ‘‘ఈ మట్టి మనదే’’ని మట్టిమనిషి, నా ఆత్మీయులు డా.ఎన్.గోపి
గారికి అంకితమివ్వడం సంతోషం! పృథ్వి అంటే... అద్దేపల్లి రామమోహనరావు లేకపోతే ఎలా? ఆయన ముందుమాటలు పృథ్వీ అంటే ఏ మిటో తెలియబరుస్తాయి.
‘‘నిత్యనూతన నేర్పరి మా పృథ్వి/ కవిత రాయురీతి కమ్మగాను’’ అన్న ధర్మరాజుగారి మాటలు చాలావరకు నిజమే. మొత్తం 52 కవితలు గల సంపుటి ఇది.
‘‘అదొక అదృశ్య జ్వాలాక్రిమి/ మనిషి ఆలోచనమీదే దాని కన్ను...’’ అంటూ మనిషి స్వార్థాన్ని బలాన్ని చిత్రీకరించారు.
‘‘హోదాల మెట్లు దిగివచ్చి/ సామాన్యుడి గుమ్మంలో
భిక్షాపాత్ర అయ్యే సమయం..’’- ఏమిటీ సమయం?
ఎన్నికల సమయం. రాజకీయ నాయకుల కుళ్ళును ఎండగట్టారు కవి పృథ్వికి లేక పరిజ్ఞానం బాగా వుంది. లేకపోతే-
‘‘కొందర్ని లాలించటం కోసం/ కొన్ని నిర్ణయాలు గాడి తప్పుతాయి.. అనలేరు. ఈయనకి కవితా శిల్పమూ తెలుసు - ఇలా
‘‘్భవిష్యత్తును తమ గర్భంలో ఇమిడ్చుకునేందుకు
ప్రయత్నాలు ఊడల మర్రిచెట్టులా విస్తరిస్తాయి’’
మరి కొంత అధ్యయనం, ఇంకొంత శిల్పం అలవడితే మంచి కవి కాస్తా ఉత్తమ కవి అవుతాడు. సందేహం లేదు.