మార్కెట్ కథలు
-ఎ.రవీంద్రబాబు
వెల: రూ.50/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
విజ్ఞాన భవన్, 4-1-435, బ్యాంక్ స్ట్రీట్,
హైదరాబాద్ - 500 001.
మానవీయ కథలు, స్ర్తివాద కథలు, భక్తి కథలు, శృంగార కథలు, సరస కథలు విన్నాం కానీ మార్కెట్ కథలు వినిపించారు రచయిత ఎ.రవీంద్రబాబు. అసలు మనం అనుకుంటాం కానీ సమకాలీన సమస్యలన్నీ దాదాపుగా మార్కెట్‌లోనే ఉంటాయి. నిగూఢమైన అవినీతిని, ఈర్ష్యను కలిగి వున్న వ్యాపార కథలంటే వీటికి సరిపోతుందేమో అనిపించింది. ఈ సంపుటిలో 17 కథలున్నాయి. ప్రతి కథలోను ఒక సామాజిక అంశం దాగుంది. జీవితంలో ప్రతిరోజు ఒక కథే! తరచి చూసి రచించే వారుంటే ఒక కథాంశమే ఎదురవుతుంది. మార్కెట్ అనేది ఒక కొత్త ప్రపంచం. మార్కెట్ అంటే ప్రతిరోజు మనకు తినడానికి కావాల్సిన వస్తువుల అమ్మే ధర, తర్వాత కొనే తీరు మధ్య ఒక త్రాసు అంతే! ఒక్కోరోజు మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన కూరలయినా, మాంసమయినా ఏదైనా అమ్ముడుపోతుంది. ఒక్కోసారి అమ్ముడుగాకుండా పొద్దుపోయే సమయానికి ఏదో ఒక ధరకు అమ్మి నష్టపోయి ఈసురోమంటూ ఇంటిముఖం పట్టిన క్షణాలు వీరిని దాటిపోవు. అలాగని సంపాదించేడు కదా కడుపునిండా తింటాడేమో అనుకుంటే అదీ లేదు. అప్పులంటూ, బదులంటూ తీసుకున్న వారి వేధింపులు భరించలేక వారికిచ్చి మళ్లీ వీరికి గంజినీరే.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మకం దారులంతా ఆడవారే. మగవారు చేపలు పట్టిస్తే ఆడవారు రంజుగా అరుస్తూ, అన్నా అక్కా, చెల్లీ తల్లీ అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఏదో రకంగా వారిదగ్గర కొనిపించాలనే థోరధిలో కూరలకంటే మాటలు అమ్ముతుంటారు. వీరిలో వీరికి కులాలు వేరైనా మనసులు ఒక్కటే. ఎవరికి ఎంత బాధ కలిగినా సాటి స్ర్తిలు ఓదార్చాలే తప్ప మరొకరివైపు న్యాయం కోసం పోరాడడానికి ముందుకు రారు. మార్కెట్‌లో వచ్చే కోపాలకు, భేషజాలకు, గొడవలకు అన్నీ క్షణికాలే. ఊహలు, ముందుగా ఇలా చేయాలనే ఆలోచన కానీ ఉండదు. ఒక్కోసారి ఒకమ్మ చాయి తాగడానికి పక్క దుకాణానికి వెడితే ఆ పక్కనున్న ఆమె బేరం చేసి అమ్మిపెడుతుంది. అలాగే ఆమెకు కూడా. ఇలా వారు ఒకరినొకరు ఎవరికి ఏమీ కాకున్నా సరే ఆత్మీయతను ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలాంటి అరమరికలు లేని వాతావరణం అనుకోవడం కంటే అన్నీ దిగమింగుకుని బతికే వాతావరణం అంటే బాగుంటుందేమో!
ఇందులో ప్రతి కథా ఆలోచింపదగినదే! వేప చెట్టు కథ కేవలం స్థలం కోసం పోరాడే తీరు, ఆ భాష ఎంతో హృద్యంగా సాగింది. రచయిత రవీంద్ర ఎంతో శ్రద్ధ చూపారు. వేపచెట్టుకింద తన వ్యాపారానికి కలిసి రాలేదని ఒక అమ్మ ఆవేదన ఎంతో అందంగా మలిచారు రచయిత. అలాగే మరో అద్భుతమైన కథ ‘తండాల డబ్బు’. వచ్చిన డబ్బంతా అప్పులోల్లకి, అయినోళ్లకి అందచేసాక మిగిలింది ఒక్క ముద్ద అన్నం కూడా నోటిలోకి వెళ్లదు సరికదా పైగా డబ్బు తక్కువైతే వీపులు వాగగొట్టే ఇంట్లో వారితో ఎంతో సహనంగా ఒకరినొకరు ఓదార్చుకుంటూ కన్నీళ్లను మింగి బతికే ఈ కథ కళ్లనీళ్లు పెట్టించింది. అలాగే పిచ్చిదొండ, బతుకు బేరం, అంకమ్మ అప్పచ్చలు, బురగంజ కథలు ఎంతో హృద్యంగా రక్తి కట్టించాయి. ఎంతో వైవిధ్యం కలిగి వున్న ఈ కథలు అందరూ తప్పక చదవాల్సిందే.