పాశ్చాత్య దేశస్థులకి అనేక ఆహార పదార్థాలు ఎలర్జీ. వేరుశెనగ పప్పు, ఇతర పప్పులు తింటే చర్మానికి రేష్ రావడం, ఊపిరి ఆడకపోవడం లాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. దాంతో పాశ్చాత్య దేశాలన్నింటిలోని ఫుడ్ పాకెట్స్ మీద ఎలర్జీ ఉన్న వారి కోసం ‘నట్స్ చేసిన యంత్రాల్లో ఇది చేయడం జరిగింది’ అనే హెచ్చరికని ప్రచురిస్తూంటారు.
ఐతే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కి చెందిన ఏష్‌లీ అనే అమ్మాయి ఓ చిత్రమైన ఎలర్జీతో బాధపడుతోంది. అది నీట ఎలర్జీ! ఈమె ఒంటి మీద నీరు పడితే చాలు. తక్షణం ఎర్రటి దద్దుర్లు చర్మం మీద ఏర్పడతాయి. ఈమెకి ఈ వింత ఎలర్జీ 14వ ఏట వచ్చింది. ఇప్పుడు ఈమె వయసు 19. ఈ ఐదేళ్లుగా ఏష్‌లీ ఈత కొలనులోకి వెళ్లదు. వర్షంలో తడవదు. స్నానం చేయదు! ఏ టెంపరేచర్లో ఉన్న నీరయినా సరే ఆమెకి ఎలర్జీనే. ఈమెకి వచ్చిన ఈ అరుదైన ఎలర్జీ పేరు అక్వాడెనిక్ ఉర్వికేరియా. ప్రపంచంలో ఈ రోగంతో బాధపడే వారు ఇంత దాకా పదిమందిలోపే గుర్తించబడ్డారు.
వీరి ఒంటిని నీరు తాకితే దురద, ఎర్రటి దద్దుర్లు వచ్చి అవి తగ్గడానికి రెండు గంటలు పడుతుంది. ఐతే ఒంటిని శుభ్రంగా ఉంచుకోడానికి ఏష్‌లీ ఓ నిమిషంసేపు మాత్రమే స్నానం చేస్తుంది. తర్వాత కలిగే పరిణామాలకి ఆమెకి కన్నీళ్లే తక్కువ. ఆమెకి ఎంత దురద పుడుతుందంటే గోకిగోకి ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. ఆమె జర్నలిజం కోర్స్ చేసి ఓ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తోంది. ఏష్‌లీ తల్లి 42 ఏళ్ల జెమిల్లర్ తన కూతురి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘మా అమ్మాయి బయటకి వెళ్లడానికి రెండు గంటల ముందే స్నానం చేస్తుంది లేదా ఒంటి మీది ఎర్రటి రేష్ గురించి అడిగిన వారికి వివరించాల్సి ఉంటుంది అంటుందామె. ఐతే ఏష్‌లీ తన ఎలర్జీ గురించి చెప్తే చాలామంది వెంటనే నమ్మలేదు. తమని ఆట పట్టిస్తోందని భావిస్తారు. ఎందుకంటే వాటర్ ఎలర్జీ వ్యాధి గురించి ఎవరికీ తెలీదు.
పధ్నాలుగో ఏట ఏష్‌లీకి టాన్సిల్స్ వచ్చాయి. అది తగ్గడానికి ఆమెకి పెన్సిలిన్ మందులని గుప్పించారు. అకస్మాత్తుగా ఓ రోజు ఆమె స్నానం చేశాక ఒంటి నిండా రేష్ వచ్చింది. ఆమెకి అర్థంకాక డెర్మటాలజిస్ట్ దగ్గరికి అలా అనేకసార్లు రేష్ వచ్చాక వెళ్లింది. ప్రొఫెసర్ రొడ్నేసిన్ క్లెయిర్‌కి అదృష్టవశాత్తు ఆ వ్యాధి గురించి తెలుసు. డెర్మటాలజిస్ట్ అయిన ఆయన రోగ నిర్ధారణని త్వరలోనే చేశాడు. పెన్సిలిన్ ఉపయోగించబట్టి ఆమె హిస్టామైన్ స్థాయిలో కలిగిన మార్పుల వల్ల ఈ ఎలర్జీ వచ్చిందని డాక్టర్లు భావిస్తున్నారు. దీనికి మందు లేదు. ఇంత దాకా రీసెర్చ్ కూడా జరగకపోవడానికి కారణం ఇది అత్యంత అరుదైన ఎలర్జీ అవడం. డాక్టర్ సలహా మీద సముద్రంలోకాని, ఈత కొలనులో కాని ఈదడం, చెమట పట్టేలా ఆడటం మానేసింది. ‘నాకీ ఎలర్జీ గురించి తెలిసాక కొన్ని గంటలపాటు ఏడుస్తూండి పోయాను. తర్వాత తేరుకున్నాను. ఇప్పుడు దీంతో రాజీ పడిపోయాను’ అని ఆమె పత్రికా విలేఖరులతో చెప్పింది.
ఆమె ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనే ఉంటుంది. తన కారులో సదా గొడుగుని, రెయిన్ కోట్‌ని ఉంచుకుంటుంది.
ఆమె బాయ్‌ఫ్రెండ్ 23 ఏళ్ల ఆడమ్. ఆమెకి గల ఈ ఎలర్జీ గురించి తెలిసి కూడా అతను ఆమెతో డేటింగ్ చేస్తన్నాడు. వారి సాన్నిహిత్య సమయంలో అతని ఒంటికి పట్టే చెమట ఆమెని బాధిస్తుంది. బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ ప్రస్తుతం ఈమె సహాయంతో ‘అక్వాజెనిక్’ అనే ఈ ఎలర్జీ మీద రీసెర్చ్‌ని ఆరంభించింది. నైనా గోడ్ అనే డాక్టర్ ఈ టీమ్‌కి హెడ్.
పాశ్చాత్య దేశస్థులకి అనేక ఆహార పదార్థాలు ఎలర్జీ.
english title:
water
Date:
Sunday, April 28, 2013