ఊరకనే ఉత్తుత్తిపొగడ్తల్ని
పైపైనే పొగుడుకుంటూ-
అన్యాయంగా, అనవసరంగా
మధ్యలోకి మునగచెట్టును లాగుతుంటారు
అల్పదేహమని
బరువును తట్టుకోలేక పుటుక్కుమంటుందని
బలహీనతల్ని బయట పెడుతుంటారు
మునగకొమ్మ తేలిగ్గా విరిగిపోవడమే కాదు
తెగ నరికి పారేసినా
నేలలో మళ్లీ విశ్వాస వేళ్లు దించుకుని చిగురిస్తూ
సమస్యలు పీక మీద కతె్తై కూర్చుకున్నా-
బతుకును చేజార్చుకోకూడదని ప్రబోధిస్తూ
సిద్దార్థుడికి బోధి వృక్షమల్లే
నాకు నా మునగచెట్టు!
కాల్షియం లోపానికి
ఎముకలు పిండై పోతున్నట్టే
కల్మషం నిండిన మనిషి చూపు సోకి
మునగచెట్టే కాదు
చాలాచాలా చేవగల వృక్షాలే నేలకొరిగి పోతున్నారుూ వేళ!
ఋతువులు భుజాలు మార్చుకుంటున్న
ప్రతి సంధికాలంలోనూ
వ్యాధి నిరోధక ఔషధమై
బాలింత తల్లుల పాల వృద్ధికి మూలధాతులై నిల్చిన
మునగాకును తేలిగ్గా చూట్టం చూసి కాబోలు
అప్పుడప్పుడూ
కన్నీటి జిగట వల పోస్తోంది - మునగచెట్టు
తాను బ్రతకడమే కాదు
నలుగురికి ఆశ్రయమివ్వాలన్న
సహజత్వ జీవన నైజానికి కట్టుబడి
గొంగళి పురుగులకు నీడై నిల్చిన నేరానికి
అప్పుడప్పుడూ అక్కడక్కడా నిలువెల్లా తగలబెడుతున్నా-
గొంగళి గూడు వెన్ను చీల్చుకుని
అందచందాల చిరురెక్కలతో ఎగిరాడే
పసికందు సీతాకోక చిలుకలకు
పురిటి మంచం కదా - మునగచెట్టంటే!
*
మల్లె చెట్టు
-గిడుగు లక్ష్మీదత్
వే సవి
వస్తోందనుకొంటూ
తుప్పలా వున్న
మల్లెచెట్టును
కాస్త సవరించి
ఆకు దూసి
ఎరువేసి
నీరు పోసి
రోజూ పలకరిస్తూ
ఓ నేస్తమల్లే
దాంతో నెయ్యం పంచుకున్నాను.
అందుకు కృతజ్ఞతగా
ఆత్మీయులకు బహుమతిచ్చినట్లు
రోజుకో విన్యాసం అన్నట్లు
మల్లి చిగురేసింది
కొమ్మకొమ్మకూ మొగ్గ తొడిగింది
రెక్కలు విచ్చుకొంటూ
నక్షత్రాల్లా తెల్లని మల్లెపూలు
ఘుమఘుమ వాసనలతో
నా మనసు దోచి
నను మురిపించింది
తన సుగంధ పరిమళాలతో
నా పరిసరాలను
మధురం చేసింది
ఆ సువాసనల మత్తులో
నను నేనే మరిచాను
చెట్టైయితేనేం? చామ అయితేనేం?
మొక్కైయితేనేం? మొలకైతేనేం?
చేసిన సేవకు (పనికి)
బదులివ్వటం తెలిసిన
మహజ్ఞాని కాదూ! చెట్టు
ఇంతకంటే ఏం కావాలి?
మనిషికి!
అందుకే
చెట్టును చేరదీయండి.
...................
శవాల దిబ్బ
-పంజాల జగన్నాథం
వీచేది గాలికాదు పొగ
ప్రవహించేది నీరు కాదు మురుగు
తోటల్లో పండేవి కూరగాయలు కాదు -విషపు కాయలు
గగనాన ఎగిరేటివి పక్షులు కాదు ప్లెయిన్‌లు
ఆకాశంలోకి విస్తరించినవి మబ్బులు కాదు -సెల్ టవర్లు
గుమ్మానికి కట్టిన వరికంకుల్లోని వడ్లను
వయ్యారం వొలకబోసుకుంటూ
ముక్కున కరుచుకపోయే పిచ్చుకలు లేవు
చేలల్లో పడిపోతున్న పండిన కంకులు కాదు నిర్జీవమైన పక్షులు
ఊరికి దూరాన కొండ శిఖరాలు కాదు
గ్రానైట్స్ కింద కరిగిన మట్టిదిబ్బలు
ఊరి పొలిమేరలో ఉన్నది అడవి కాదు
చెట్లు నరికి బోసిపోయిన బంజరు
ఊరు! ఇపుడదొక మసిబారిన బతుకులు
మోడుబోయిన చెట్లు,
ప్రాణాలున్న శవాల దిబ్బ!