అదుపులో నీటిధారలు
ఒక ఖాళీ స్థూపాకారపు రేకు డబ్బాను మూతతో సహా తీసుకోవాలి. ఈ రేకు డబ్బా కింది భాగంపై సుత్తి, మేకు సహాయంతో అనేక రంధ్రాలు చేయాలి. డబ్బా పైభాగంలో మూతకు కొంచెం దిగువ భాగంలో ఒక రంధ్రాన్ని దాని వక్రతల గోడపై చేయాలి.
ఒక బకెట్ నీటిలో ఈ డబ్బాను ముంచి దాని నిండుగా నీటితో నింపాలి. డబ్బా నీటిలో మునిగి వున్నప్పుడే దానిని మూతతో బిగుతుగా మూయాలి.
మీ చూపుడు వేలుతో వక్రతల గోడపైగల రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు డబ్బాను నీటి నుండి బయటకు తీయాలి. డబ్బాలోని నీరు డబ్బా అడుగున గల రంధ్రాల గుండా కిందికి పడదు.
చూపుడు వేలును రంధ్రం నుండి తీసివేసి మళ్లీ మూసివేసిన నీటిధారలు డబ్బా అడుగు రంధ్రాల నుండి కిందికి పడతాయి. ఇలా చూపుడు వేలును రంధ్రాన్ని మూస్తూ, తెరుస్తూ చేయడం వల్ల డబ్బా అడుగు నుండి నీటిధారలు పడుతూ, ఆగుతూ ఉంటాయి. అంటే డబ్బా నుండి కింద పడే నీటి ధారలు మన అదుపులో ఉంటాయి.
రంధ్రాన్ని చూపుడు వేలుతో మూయడం వల్ల నీటిని డబ్బా నుండి కిందికి గెంటే గాలి పీడనం లేకపోవడం వల్ల డబ్బా నుండి నీరు కిందికి పడదు. చూపుడు వేలును రంధ్రం నుండి తొలగించగానే డబ్బాలోకి గాలి ప్రవేశించి డబ్బాలోని నీటిని కిందికి గెంటుతుంది. అందువల్ల డబ్బా అడుగున గల రంధ్రాల గుండా నీరు పడుతుంది. రంధ్రాన్ని చూపుడు వేలుతో మూయగానే నీటిని కిందికి గెంటే గాలి డబ్బాలోకి ప్రవేశించక అడుగు రంధ్రాల నుండి నీరు కిందికి పడదు.
...................
కుటుంబ బాధ్యత
స్ఫూర్తి
హిర మేనత్త, మేనమామలు మేరేజ్ ఏనివర్సరీని అబిడ్స్‌లోని తాజ్‌మహల్‌లో జరుపుకుంటున్నారు. ఆ ఆదివారం మధ్యాహ్నం మిహిర కుటుంబ సభ్యులంతా దానికి హాజరవ్వాల్సి ఉంది. అయితే పదకొండేళ్ళ మిహిర తన క్లాస్‌మేట్స్‌తో కలిసి ఎంబ్రాయిడరీ నేర్పే క్లాస్‌కి వెళ్ళాల్సి రావడంతో తను రానంది.
‘‘మీ మామయ్య పదహారో మేరేజ్ ఏనివర్సరీ మళ్ళీమళ్ళీ రాదు. ఎంబ్రాయిడరీ క్లాస్‌లో ఇవాళ మిస్సయింది తర్వాత నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు క్లాస్‌కి వెళ్ళద్దు.’’ మిహిర తండ్రి చెప్పాడు.
అయితే మిహిర తన తల్లిదగ్గరకి వెళ్ళి ఏడుస్తూ చెప్పింది.
‘‘నాకు ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం. నాన్న నన్ను క్లాస్‌కి వెళ్ళద్దు అంటున్నారు’’ మిహిర తల్లి తన భర్తతో ఆ విషయం మాట్లాడాక ఆయన మిహిరని ముందు గదిలోకి పిలిచి అక్కడ వేలాడే ఓ ఫొటోని చూపించాడు. అందులో మిహిర తాతయ్య, నానమ్మ, బాబాయిలు, అత్తయ్యలు ఉన్నారు. హాస్పిటల్‌లోని బెడ్‌మీద నాయనమ్మ పడుకుని ఉంది.
‘‘ఈ ఫొటోలోని వారంతా మీ నాయనమ్మ దగ్గరకి ఎందుకు వచ్చారో తెలుసా? కేవలం ఈ ఫొటో తీయించుకోడానికే. నిమిషంలో అయిపోయే ఈ పనికోసం నేను చైనా బార్డర్ నించి నాలుగురోజులు ప్రయాణంచేసి వచ్చాను. సరిగ్గా నిద్రలేకపోవడంతో అందుకే నా మొహంలో అలసట కనిపిస్తోంది. మీ బాబాయ్ లక్నోనించి, ఈ అత్తయ్య. సింగపూర్ నించి... ఇలా అంతా కనీసం వెయ్యి మైళ్ళ దూరంపైనే ప్రయాణంచేసి వచ్చాడు. మా అమ్మతో మేమంతా కలిసి తీయించుకున్న ఏకైక ఫొటో ఇది. మేము పడ్డ శ్రమ అంతా మాయమైంది. కానీ ఈ ఫొటో శాశ్వతంగా నిలిచిపోయింది. మన సమయాన్ని మన కుటుంబ సభ్యులకోసం ఖర్చుచేయడం మనందరి బాధ్యత.
మన కుటుంబ సభ్యుల సన్నిహిత బంధాలకు పెళ్ళిళ్ళు, మేనేజ్ ఏనివర్సరీలు లాంటి ముఖ్యమైన శుభకార్యాలకి, చావు, సంవత్సరీకాలు లాంటి అశుభకార్యాలకి మనం తప్పనిసరిగా హాజరవ్వాలి. మనం శారీరకంగా మన కుటుంబ సభ్యుల మధ్య ఉండటమే వారికి కావలసింది. మనం వారి కోసం ఏమీచేయకపోయినా, మన హాజరే వారికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇది కుటుంబపరమైన బాధ్యత’’.
తండ్రి చెప్పింది విన్న మిహిర తల ఊపి వెంటనే చెప్పింది. ‘‘నిజమే నాన్నా! వస్తాను. రేపు వాళ్ళు వీడియో చూసుకునేప్పుడు నేను లేకపోతే నాకూ బావుండదు.’’
-మల్లాది
..............
నేను గీసిన బొమ్మ
వి.సుధ (లింగంపల్లి, మెదక్ జిల్లా)
వి.కె.సందీప్ (కాట్రేనికోన)
...........................
కోయల కంఠం
సిసింద్రి కథ
పూర్వం పక్షులన్నీ తెల్లగా ఒకే రంగులో ఉండేవట. నెమళ్లు గానీ, పావురాలు గానీ, గద్దలు గానీ, చిలుకలు గానీ అన్నీ తెలుపు రంగులోనే తళతళ మెరిసిపోతూ చూడముచ్చటగా ఉండేవట. కానీ వాటికో సమస్య వచ్చి పడింది. అన్నీ ఒకే రంగులో ఉండటంతో ఏవి కాకులో, ఏవి కంజులో, ఏవి డేగలో, ఏవి పిట్టలో దగ్గరికొస్తే గానీ కనుక్కోలేక పోయేవి. దాంతోపాటు మాటిమాటికీ మట్టి మరకలు, చెట్ల మరకలు పడి అసహ్యంగా తయారవుతూ ఉండేవి. దాంతో నీళ్లలో స్నానం చేయాల్సి వచ్చేది. ఇది వాటికి పెద్ద ఇబ్బందిగా తయారైంది.
అడవిలో జంతువులన్నీ రంగులతో అందంగా, హుందాగా వుండేవి. నీటిలో చేపలన్నీ మిలమిలలాడుతూ స్వచ్ఛమైన రంగురాళ్లలా తళతళలాడుతుండేవి. చెట్లన్నీ పచ్చగా ఒకే రంగులో వున్నప్పటికీ రంగురంగుల పూలు కాస్తా కనువిందు చేస్తుండేవి. వాటన్నిటినీ చూస్తూ ఉంటే పక్షులకు చాలా బాధగా ఉండేది. మనకు కూడా ఒక్కొక్క పక్షికి ఒక్కో రంగు ఉంటే ఎంత బాగుంటుందో గదా అనుకున్నాయి. నెమ్మదిగా ఈ కోరిక అన్నింటికీ దావానలంలా అంటుకుపోయింది. దాంతో అవన్నీ కలిసి ఒకరోజు తమ రాజు గరుత్మంతుని దగ్గరికి పోయాయి.
‘రాజా.. ఈ లోకంలో నేల మీద నడిచే జంతువులకూ రంగులున్నాయి. నీళ్లలో ఈదే చేపలకూ రంగులున్నాయి.. చెట్లపై పూచే పూలకూ రంగులున్నాయి. చివరికి ఎక్కడ పడితే అక్కడ పాకే చిన్నచిన్న పురుగులకు రంగులున్నాయి.. కానీ.. ఆకాశంలో విహరించే మనకు మాత్రం ఏ రంగులూ లేవు. అందరమూ తెల్లగా పాలిపోయి చచ్చిపోయిన శవాల్లా వెలవెలపోతూ ఉన్నాం. ఇది మాకెంతో బాధగా ఉంది. పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అన్నట్టు ఈ తెలుగు రంగు చూసీచూసీ మొహమ్మొత్తి పోతోంది. మేం కూడా రంగులు రంగులలో వుంటే ఎంత ముద్దుగా, ముచ్చటగా ఉంటుందో కాస్త ఆలోచించండి’ అంటూ అన్నీ తమ మనసులోని మాటను బయటపెట్టాయి.
గరుత్మంతుడు బాగా ఆలోచించాడు. ‘నిజమే.. లోకమంతా రంగులతో నిండి ఉంది. తెలుపు ఎంత హాయిగా ఉన్నప్పటికీ అన్నీ అదే రంగులో ఉండటంతో ఏదో వెలితిగానే ఉంది. పువ్వులకు ఆ నవ్వులు, జంతువులకు ఆ మెరుపులూ, చేపలకు ఆ తళతళలూ రంగులతోనే వచ్చాయి. పక్షులు కూడా రకరకాల రంగుల్లో ఆకాశంలో విహరిస్తూంటే మళ్లామళ్లా చూడాలనిపించేలా ఎంత మజాగా ఉంటుందో’ అనుకున్నాడు.
గరుత్మంతుడు గొంతు సవరించుకున్నాడు. పక్షులన్నీ ఏం చెబుతాడా అని చెవులు రిక్కించి వినసాగాయి పక్షులన్నీ. ‘సరే.. మీరు చెప్పిన మాటలన్నీ నాకు కూడా నచ్చాయి. మీరు కూడా అసాధ్యమైన గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. ఒక రాజుగా మీ ఆనందంకన్నా నాకు కావలసిందేముంది. అతి త్వరలోనే మీరు కోరుకున్నట్లుగానే రకరకాల రంగులలో మెరిసిపోదురుగానీ. నాకు కాస్త సమయమివ్వండి’ అన్నాడు. ఆ మాటలకు పక్షులన్నీ సంబరంగా జయజయ ధ్వానాలు చేస్తూ ఇళ్లకు వెళ్లిపోయాయి.
పక్షి రాజు స్వర్గలోకంలో ఎక్కడెక్కడి రంగులన్నీ తెప్పించి ఇంటి ముందు కుప్పలు పోయించాడు. తరువాత రోజు ఒక పక్షితో అడవంతా ‘రేపు పొద్దునే్న పక్షులన్నీ మన రాజు ఇంటికి దగ్గరకు రావాలి. ఈ రోజుతో మనకు ఈ తెల్లరంగు ఆఖరు. ఎవరికి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు రాజుగారు అందిస్తారహో’ అంటూ దండోరా వేయించాడు.
ఆ మాట విన్నప్పటి నుంచీ పక్షులన్నీ ఒకటే సంబరపడ్డాయి. రాత్రంతా ఒక్కటీ నిద్రపోలేదు. అడవంతా ఎక్కడ చూసినా పక్షుల కూతలతో, ఆటలతో, పాటలతో పట్టపగల్లా మారిపోయింది. చీకటి ఎప్పుడెప్పుడు తొలగిపోతుందా, తాము ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కల ఎప్పుడు నిజమవుతుందా అని ఆలోచిస్తూ, తమ వొంటికి ఏ రంగు బాగుంటుందా అని, ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేశాయి. సూర్యునికన్నా ముందు పరుగు పరుగున పక్షిరాజు ఇంటికి చేరుకున్నాయన్నీ. భటులు వచ్చి అన్నిటినీ వరుసగా నిలబెట్టాక గరుత్మంతుడు చిరునవ్వులతో అక్కడకు అడుగుపెట్టాడు.
పక్షులన్నీ ఒక్కసారిగా మాటలు ఆపి వౌనంగా లేచి నిలబడ్డాయి. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. భటులు రకరకాల రంగులు బస్తాల నిండా నింపుకొని తెచ్చిపెట్టారు. గరుత్మంతుడు తన గంభీరమైన కంఠాన్ని సవరించుకొని ‘పక్షులారా! మీ కల నెరవేరే కాలం వచ్చింది. ఈ ప్రపంచంలోని మిగతా వాటివలే మనం కూడా రంగుల్లో మెరిసిపోయే సమయం మరి కొద్ది క్షణాల్లోనే వచ్చేస్తోంది. ఇదిగో చూడండి. మీ ముందున్న రంగురంగుల కుప్పలు. ఎవరూ ఒకరినొకరు నెట్టుకోవద్దు. నెమ్మదిగా, ప్రశాంతంగా వరుసగా రండి. మీకిష్టమైన రంగులు తీసుకోండి. ఇంటికి పోయి మీ శరీరమంతా ఎక్కడ ఏ రంగు కావాలో బాగా ఆలోచించి పూసుకోండి. ఇవి మామూలు రంగులు కావు. దేవలోకంలో నుంచి దేవదేవుణ్ణి మెప్పించి తీసుకువచ్చినవి. కానీ బాగా గుర్తు పెట్టుకోండి. ఒకసారి రంగు పూసుకున్నాక మరలా పోదు... జాగ్రత్త’ అని చెప్పాడు. ఆ మాటలకు పక్షులన్నీ ఆనందంతో తలలాడించాయి.
ఒక్కొక్క పక్షే రాసాగింది. తన కిష్టమైన రంగులు తీసుకొని సంబరంగా పోసాగింది.
కొంగ, కాకి ఒకదాని వెనుక ఒకటి నిలబడ్డాయి. ‘నాకు ఇంతవరకూ ఎవ్వరికీ లేనంత, ఎప్పుడూ చూడనంత అద్భుతమైన రంగును పూసుకోవాలనుంది’ అంది కాకి. ఆ మాటలకు కొంగ ‘ఔనౌను. నాక్కూడా అలాగే అనిపిస్తోంది. కానీ ఏ రంగులు పూసుకుంటే అలా మెరుపులా మెరిసిపోతాం’ అంది. కాకీ, కొంగ కలిసి తెగ ఆలోచించాయి. కానీ వాటికి ఏమీ తోచలేదు. దాంతో తమ ముందు నిలబడ్డ కోకిలతో ‘కోకిలా.. కోకిలా.. మాకు ఈ లోకంలో ఎవరికీ లేనట్టి రంగు పూసుకోవాలని ఉంది. ఏం చేయాలో నీకేమైనా తెలుసా’ అని అడిగాయి. కోకిల కాసేపు ఆలోచించి ‘మిత్రులారా.. ఏ పక్షయినా ఒకటో, రెండో రంగులు తీసుకొంటుంది. పూసుకుంటొంది. మీరు అలా కాక అన్ని రంగులూ తలా కొంచెం తెచ్చుకోండి. అన్నింటినీ ఒకదాంట్లో ఒకటి కలపండి. దాంతో ఇంతవరకూ ఎక్కడా చూడని, ఎవరూ పూసుకోని అద్భుతమైన రంగు తయారవుతుంది. దానిని పూసుకోండి’ అని చెప్పింది. కాకికి, కొంగకు ఆ సలహా నచ్చింది. తమ వంతు రాగానే రెండూ రకరకాల రంగులు తలా కొంచెం తీసుకున్నాయి. ఇంటికి పోయాక రెండూ కలిసి ఒక గినె్నలో అన్ని రంగులూ పోశాయి. నీరు వేసి కలపడం మొదలుపెట్టాయి.
మొదట కాకి ‘కొంగ మామా... కొంగ మామా.. నేను చిన్నగా ఉంటాను కదా.. మొదట నేను రంగు పూసుకుంటా. తరువాత నువ్వు పూసుకో’ అంది. కొంగ సరేనంది. కాకి రంగులన్నీ బాగా కలిపాక అందులోకి మునిగింది. పాపం! దానికి రంగులన్నీ కలిపితే నల్లరంగు వస్తుందని తెలీదు. దాంతో తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు అది నల్లగా అమావాస్య చీకటిలాగా మారిపోయింది. ఆ రంగు చూడగానే దాని గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఊహలన్నీ చెదిరిపోయాయి. ‘అరెరె... రంగులన్నీ కలిపితే ఏదో అద్భుతమైన రంగు వస్తుందనుకున్నా కానీ కందెనలాగా ఈ చిక్కటి నల్లరంగు వస్తుందా’ అని అదిరిపడింది. బెరబెర దాన్ని వదిలించుకోవాలని చూసింది. కానీ ఎక్కడ అంటిన రంగు అక్కడే అలాగే అతుక్కుపోయింది. తెల్లని కాకి కాస్తా నల్లగా అందవికారంగా మారిపోయింది.
అది చూసిన కొంగ ‘అయ్యబాబోయ్.. నాకు ఈ నల్లరంగు కన్నా ఇప్పుడు ఈ తెల్లరంగే బాగుంది’ అనుకుంటూ అక్కణ్నించి ఎగిరిపోయింది. పాపం.. కాకి కళ్లనీళ్లతో ఒంటరిగా మిగిలిపోయింది. తనకు ఈ సలహా ఇచ్చిన కోకిల మీద విపరీతమైన కోపం వచ్చింది. గినె్న తీసుకొని బయల్దేరింది. కోకిల ఒక చెట్టు కింద కూర్చుని గినె్నలో పసుపురంగు వేసుకొని కలుపుకుంటూ ఉంది. అది చూసి కాకి ‘ఇక్కడ నేను ఈ నల్లరంగుతో బాధపడుతూ ఉంటే నువ్వు పసుపురంగు వేసుకోవడానికి తయారవుతున్నావా.. చూడు నినే్నం చేస్తానో’ అంటూ ఒక్కసారిగా తన గినె్నలోని మిగిలిన రంగంతా కోకిలపై కుమ్మరించింది. అంతే.. పాపం.. అది కూడా నల్లగా కాకిలెక్కనే మారిపోయింది.
పాపం.. కోకిల బాధతో పరుగు పరుగున పక్షిరాజు దగ్గరికి చేరుకుంది. పక్షిరాజు జరిగిందంతా విని ‘సరే... అయిపోయిందేదో అయిపోయిందిలే. నీవు కూడా రంగులన్నీ కలిస్తే అలా నల్లరంగు వస్తుందని ఊహించలేదు గదా.. కానీ ఒక్కసారి రంగు అంటుకున్నాక దాన్ని తొలగించడం ఎవరికీ చేతకాదు. కాకపోతే నీ రూపం మార్చలేకున్నా నీ గొంతు కమ్మగా మారిపోయేలా వరమిస్తా ఇక నుంచీ నీ కూత అన్ని పక్షులకన్నా అత్యంత మధురంగా ఉంటుంది పో.. కానీ ఒక్కమాట ఇంకెప్పుడూ ఇలా మిడిమిడి జ్ఞానంతో ఎవరికీ సలహాలివ్వొద్దు’ అని చెప్పింది.
ఇదీ కథ. అందుకే పక్షులన్నీ రంగురంగులుగా వున్నా కొంగలు తెల్లగా, కాకీ, కోకిలలు నల్లగా ఉంటాయి. కోయిల కంఠం అన్నింటికన్నా కమ్మగా ఉంటుంది.
-డా.ఎం.హరికిషన్