Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆహా... మండే ఎండల్లో మజా!

$
0
0

గ్రీష్మం ఇంకా రాకముందే వసంతం ప్రారంభంలోనే సూర్యుని ప్రతాపం ఇంత తీవ్రంగా వుంటే మున్ముందు ఈ తాపాన్ని తట్టుకునేదెలా అని జనం భీతిల్లుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా శీతల పానీయాలను సేవిస్తూ, ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు ఏసీలు, కూలర్లు పెట్టుకుని సేదదీరుతున్నారు. అయినా అవన్నీ కృత్రిమమైన ఉపశమనాలేగానీ సహజ శీతల సమీరానికి సాటిరావు కదా అటువంటి ప్రకృతి సిద్ధమైన చల్లదనంలో వేసవిని వెళ్లదీయాలంటే శీతల తీరాలకి తరలివెళ్లాల్సిందే మరి. వేసవి విడుదులుగా పేరొందిన అలాంటి ప్రదేశాలు మన సువిశాల భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు అనేకం వున్నా ఇప్పుడు మనం దక్షిణాది ప్రాంతాల్లోని కొన్నింటిపైనే దృష్టి సారిద్దాం.
వేసవి విడిది అనగానే దక్షిణాది వారికి తక్షణం స్ఫురించేది ఊటీనే. ఉదక మండలం అని కూడా పిలువబడే ఈ ప్రాంతం మన పొరుగు రాష్టమ్రైన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉంది. ఊటీకి వెళ్లాలంటే ముందుగా మనం చెన్నైకి చేరుకోవాలి. చెన్నై నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ‘బ్లూ వౌంటేన్’ అనే ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటల కల్లా మెట్టుపాలెం స్టేషన్లో దించుతుంది. ఇక అక్కడ నుంచి హిల్ రైల్వేస్‌కి చెందిన రైలును ఎక్కాలి. ఆ తర్వాత కొండ కోనల్లో నుంచి సాగే ఆ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. 14 టనె్నల్స్ గుండా దారి పొడవునా ఎన్నో సుందర దృశ్యాలను వీక్షిస్తూ వెళ్లటం వింత అనుభూతిని ఇస్తుంది. ఒక్కొక్కటీ దాదాపు రెండు కి.మీ మీటర్ల పొడవున వుండే టనె్నల్స్‌లో నుంచి రైలు వెళుతుంటే ప్రయాణీకులు కేరింతలు కొడతారు. దారిలో తారసపడే దృశ్యాల్లో బకాసుర వౌంటెన్ ఒకటి. పురాణాల్లోని బకాసురుడనే రాక్షసుడు అక్కడ నివసించడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. బాటకు ఇరువైపులా తోటలు మనను స్వాగతిస్తాయి. వక్కలు, జాజికాయ, జాపత్రి, మాచికాయ, పనసకాయ తదితరాలను పండిస్తారు. ఆ తర్వాత ‘కునూర్’ అనే పర్వత ప్రాంతం వస్తుంది. అక్కడ నిమ్స్ పార్కు, పళ్ల తోటలు వుంటాయి. రాస్‌బెర్రి, ఫిక్కీస్ ప్లమ్స్, పివార్, వంటి అరుదైన పళ్ల రకాలను ఇక్కడ పండిస్తారు. వెల్లింగ్టన్ స్టేషన్ సమీపంలో ఓ మిలిటరీ స్థావరం వుంది. అరవెన్‌కాడులో కార్టేజీ ఫ్యాక్టరీ వుంది. అందులో రక్షణ శాఖకు అవసరమైన పేలుడు పదార్థాలు తయారవుతాయి. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో వున్న ‘వౌంట్ ప్లెజెంట్’ పూర్వపు రోజుల్లో రాజులకు, రారాజులకు విడిదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కాఫీ, టీ తోటలతో పాటు యూకలిప్టస్, ఏలకులు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క తదితర సుగంధ ద్రవ్యాలను సాగు చేస్తారు. నేటికీ డబ్బున్న మారాజులెందరో ఇక్కడ విడిది చేయడానికి ఇష్టపడతారు.
కత్రిలవ్‌డేల్ స్టేషన్ సమీపాన లారెన్స్ స్కూల్ వుంది. ధనవంతుల పిల్లలంతా ఇక్కడ చదువుతారు. గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగ్ వంటివి కూడా ఇక్కడ బోధిస్తారు. ఆ తర్వాత గమ్యస్థానమైన ఊటీ స్టేషన్‌ను చేరుకుంటాం. దానికి ఉత్తరాన బొటానికల్ గార్డెన్ ఉంది. ఆ తోటలో నడుస్తుంటే బటన్ రోజెస్ అడుగడుగునా స్వాగతం పలుకుతాయి. తోటకు లోపల అసంఖ్యాకమైన సుమబాలలు సప్త వర్ణాల్లో దర్శనిస్తాయి. ఇక్కడ ఏటా మే 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు ‘్ఫ్లవర్ షో’ నిర్వహిస్తారు. ప్రసిద్ధి చెందిన ఈ పూ ప్రదర్శన చూడడానికి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు. అందులోను గులాబీ పూల సోయగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కేవలం పూల రకాలేగాక, పండ్లు, కూరగాయల వంటివి కూడా ఈ ప్రదర్శనలో చోటు చేసుకుంటాయి. అయితే అవి మామూలుగా మనం చూసే వాటికి ఎంతో భిన్నంగా వుంటాయి. ఉదాహరణకి చెప్పాలంటే ఒక్కో టమాటా, బంగాళదుంప దాదాపు రెండు కిలోలు తూగే పరిమాణంలో వుంటాయి. ముల్లంగి వంటి దుంప రకాలు రెండున్నర అడుగుల పొడవున వుంటాయి. ప్రదర్శన ముగిసిన అనంతరం సందర్శకులకు వాటిని విక్రయిస్తారు. రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపున మినీ గార్డెన్స్, మరో ఫర్లాంగ్ దూరంలో సరస్సు వుంటాయి. ఇక్కడ బోట్‌షైర్‌తోపాటు, గుర్రపు స్వారీ చేసే వీలుంది. కొండకి పై భాగాన సముద్ర మట్టానికి దాదాపు 9వేల అడుగులు వుండే భాగానికి చేరుకోగానే నక్షత్రాలు అతి పెద్దవిగా కనబడి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లుంటాయి. కొండపై మూల మూలలో అనేక రకాల గిరిజన జాతుల వారు జీవిస్తూ వుంటారు. తోడా, కొత్తార్, కురుంబల్ తదితర జాతులవారు అక్కడ తారసపడతారు. వారిలో తోడా జాతివారు ప్రసిద్ధులు. ఊటీలో చూడదగ్గ మరో ప్రదేశం పైకారా వాటర్ ఫాల్స్, ట్రాలీలలో రోప్‌వే మీదుగా చేరుకునే వీలుంది. ఎంతో ఏటవాలుగా వుండే ఈ ప్రదేశంలో ప్రయాణించాలంటే గుండెను
చిక్కబట్టుకోవాల్సిందే. ఫింగర్ పోస్టు అనే ఏరియాలో సినిమా హాల్స్ వుంటాయి. కల్‌హట్టీలో జామాయిల్ తదితర తోటలుంటాయి. ఎమరాల్డ్ లేన్, కురలిగంలలో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇంపీరియల్ లాడ్జిలో సినీ నటులు విడిది చేస్తారు. దొడ్డుబెట్ట స్టార్ హౌస్ వద్ద అబ్జర్వేటరీ వుంది. ఊటీ ప్రదేశాన్ని కనుగొన్న వ్యక్తిగా చరిత్ర చెబుతున్న డాక్టర్ బ్రేన్ నిర్మించిన స్టోన్ హౌస్ కూడా వుంది. గూడలూర్‌గా పిలువబడే అటవీ ప్రాంతం తప్పక చూడవలసిన వాటిలో ఒకటి. వేసవిలో ఇక్కడ గుర్రప్పందాలు జరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఊటీలో ఇంకా ఎనె్నన్నో అందమైన ప్రదేశాలు అలరిస్తాయి. అయితే వేసవిలోనూ బాగా చలి వుంటుంది. అందుకుతగ్గ ఏర్పాట్లతో వెళ్లాలి.
కొడైకెనాల్ : తమిళనాడులోనే మరో వేసవి విడిది కొడైకెనాల్. పడమటి కనుమలలో అతి ఎతె్తైన ప్రాంతంగా ఇది పేరొందింది. ఇక్కడి ఉష్ణోగ్రత 18 సెంటిగ్రేడ్ వుంటుంది. చెన్నై నుండి దాదాపు 600 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికీ బస్సులు, రైళ్ల వంటి రవాణా సౌకర్యాలేగాక ప్రైవేట్ టాక్సీలు కూడా వుంటాయి. నక్షత్రపు ఆకారంలో వుండే సరస్సు, పుష్కరానికి ఒకసారి మాత్రమే పుష్పించే కురింజి మొక్కలు కొడైకెనాల్‌లో ప్రత్యేక ఆకర్షణ. కొండ ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన రావి దిమ్మెల వరుస అబ్బుర పరుస్తుంది. కుంభకురైగా పిలువబడే చోట పర్వతారోహణం థ్రిల్లింగ్‌గా వుంటుంది. వందల ఎకరాల్లో విస్తరించి వున్న గోల్ఫ్ క్రీడా ప్రాంగణం, కొడై అందాలను దగ్గరగా వీక్షించే అవకాశాన్ని కల్పించే టెలీస్కోప్ హౌస్ కూడా ఇక్కడ వున్నాయి.
ఏర్కాడ్ : ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను సందర్శించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించే మధ్య తరగతి వారికి అందుబాటులో వుండే వేసవి విడిది ఏర్కాడ్. తమిళనాడులోని సేలంకి కేవలం ఒక గంట ప్రయాణ దూరంలో ఈ ప్రదేశం వుంది. సరస్సులు, దేవాలయాలు, సుందర వనాలు, ఎలుగుబంట్ల గుహలు ఇక్కడ చూడదగ్గవి.
మున్నార్: కేరళ రాష్ట్రంలోని మున్నార్ హిల్ స్టేషన్ కూడా కొడైకెనాల్, ఊటీల్లాగా వేసవి విడిదిగా పేరొందింది. కొండ చరియల్లో అడుగడుగునా పచ్చని తోటలు కనువిందుచేస్తాయి. ఇక్కడ అత్తిరాపల్లి వాటర్‌ఫాల్స్ అదనపు ఆకర్షణగా వుంటుంది.
ఇక మన రాష్ట్రానికి వస్తే ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు వ్యాలీ, హార్స్‌లీ హిల్స్ వున్నాయి. నిజానికి ఇవి అంత శీతల ప్రదేశాలు కాకపోయినా పర్యాటక కేంద్రాలుగా చూడదగ్గవి. హార్స్‌లీ హిల్స్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి కేవలం 25 కి.మీ దూరంలో కొలువుదీరి వుంది. కొండపైన వివిధ రకాల వన్యప్రాణులు, సుందర విహంగాలు తారసపడి తన్మయత్వాన్ని కలిగిస్తాయి. ఈ పర్వత ప్రాంతంలోనే ఋషీ వ్యాలీగా ప్రసిద్ధిగాంచిన హరితవనం వుంది. సుప్రసిద్ధ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన ఆదర్శ విద్యా కేంద్రం ప్రశాంతతకు మారుపేరుగా ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. తిరుపతి నుంచి కూడా ఇక్కడికి రవాణా సౌకర్యాలున్నాయి.
అరకు వ్యాలీ: మన రాష్ట్రంలో ప్రసిద్ధ ప్రదేశం అరకు వ్యాలీ. ఇది విశాఖ జిల్లాలో వుంది. ఇక్కడకు చేరుకోవాలంటే విశాఖపట్నం నుంచి దాదాపు 120 కి.మీ. ప్రయాణం. విశాఖ నుంచి బస్సు, రైలు వంటి రవాణా సౌకర్యాలున్నా అరకు అందాలను అడుగడుగునా అస్వాదించాలంటే రైలు ప్రయాణం తప్పని సరి. కొత్త వలస - కిరండోల్ రైలు మార్గంలో విశాఖ నుంచి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. దాదాపు 52 గుహల మీదుగా నాలుగు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో కలిగే థ్రిల్ అంతా ఇంతా కాదు. వీటిలో మానవ నిర్మిత గుహలు అనేకం వున్నా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు ఎంతో ప్రాశస్త్యాన్ని పొందాయి. వేలాది సంవత్సరాల క్రితం గోస్తనీ నది ఈ కొండ మీదుగా ప్రవహించినప్పుడు ప్రాకృతికంగా ఈ గుహలు ఏర్పడ్డాయి. రెండు కి.మీ. వరకు గుహ విస్తరించి వుంది. ఆ గుహలో అలా అలా లోపలికి వెళుతుంటే ప్రకృతి వైచిత్రి అబ్బురపరుస్తుంది. మైదాన ప్రాంతంలో సూర్యకాంతి పూలను తలపించేలా వున్న వలిసె పూవులు అడుగడుగునా కనువిందు చేస్తాయి. రణజిల్లెడ, చాపరాయి జలపాతాలు కూడా వున్నాయి. 19 రకాలకు చెందిన గిరిజన తెగలు ఈ కొండకోనల్లో మనుగడ సాగిస్తున్నాయి. ఇక్కడి గిరిజనులు ప్రదర్శించే థింసా నృత్యం ప్రసిద్ధి చెందింది. ఐటిడిఎ వారు ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియం గిరిజన తెగల ఆచార వ్యవహారాలకు అద్దంపడుతుంది. పద్మాపురం గార్డెన్స్‌లో యూకలిప్టన్, సిల్వర్ ఓక్ చెట్లేగాక గులాబి తోటలు, ఎర్ర చందనం చెట్లు కూడా వున్నాయి. మేఘాల రూపంలో మంచు సమూహాలు అలాఅలా పచ్చని మైదానాలపై కదలివెళుతుంటే అ దృశ్యం ఎంతో మనోహరంగా వుంటుంది. అయితే ఇవి ఎక్కువగా శీతాకాలంలోనే కనబడతాయి.
*

పర్యాటకం
english title: 
a
author: 
స్వాతి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>